ఇక అమెరికా మొత్తం మా గుప్పిట్లో: ఉత్తర కొరియా
వాషింగ్టన్: ఉత్తర కొరియా తన దుస్సాహసాన్ని కొనసాగిస్తునే ఉంది. అమెరికా తమపైకి దాడి చేసినా ఏం చేయలేదనే తీరుగా వ్యవహరిస్తోంది. ఒక్క ఈ నెలలోనే రెండుసార్లు ఖండాంతర అణుక్షిపణులను పరీక్షించింది. ఈ నెల(జులై) 4న ఓ ఖండాంతర బాలిస్టిక్ అణుక్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా తాజాగా శుక్రవారం మరో బాలిస్టిక్ ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఇంకో అడుగు ముందుకేసి ఇప్పుడు అమెరికా మొత్తం తమ లక్షిత ప్రాంతంలోకి వచ్చినట్లేనని, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంపైనైనా తమ దేశం నుంచే దాడి చేయగలమని అని అన్నారు.
తాజా ఖండాంతర క్షిపణితో అది స్పష్టమైందని ఆయన చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. 'తాజాగా నిర్వహించిన పరీక్షల తర్వాత కిమ్ చాలా ఉత్సాహంగా కనిపించారు. మేం దాడి చేయగల పరిధిలో అమెరికా మొత్తం ఉంది అంటూ ఆయన అన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా అమెరికా భూభాగంపై దాడి చేయగల సత్తా ఇక మాది' అని కిమ్ అన్నట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది. అంతేకాదు, ఈ క్షిపణిని అభివృద్ధి చేసిన వారిని ప్రశంసల్లో ముంచెత్తారని వివరించింది. కాగా, ఉత్తర కొరియా చర్యపట్ల అమెరికా మండిపడింది. కొరియా చేసింది చాలా నిర్లక్ష్య పూరితమైన అపాయకరమైన చర్య అంటూ మండిపడింది. ఇక ఉత్తర కొరియాను ఏప్రమాదం నుంచి రక్షించే సమస్య లేదని స్పష్టం చేసింది. ఉత్తర కొరియాను ఏకాకిని చేసేందుకు ఇదొక్క కారణం చాలు అంటూ ట్రంప్ అన్నారు.