ఖండాంతర క్షిపణి ప్రయోగం
► విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా
► అమెరికా సహా పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యం
సియోల్: ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను ఉత్తర కొరియా మరోసారి బేఖాతరు చేసింది. అమెరికాతో పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న తన తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని మంగళవారం విజయవంతంగా పరీక్షించామని ప్రకటించింది. వాసోంగ్–14 క్షిపణి పరీక్షను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని ఉ.కొరియా టీవీ చానల్ పేర్కొంది. ‘కిమ్ ఈ పరీక్షకు ఆదేశించారు. క్షిపణి 2,802 కి.మీ.ఎత్తుకు చేరుకుని 933 కి.మీ ప్రయాణించింది. 39 నిమిషాల పయనం తర్వాత జపాన్ సముద్రంలో పడిపోయింది.
పూర్తి స్థాయి అణుశక్తి దేశమైన ఉ.కొరియా వద్ద ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ఉంది. అమెరికా నుంచి అణు యుద్ధ ముప్పునకు ఇది ముగింపు పలుకుతుంది’ అని తెలిపింది. ఉ.కొరియా క్షిపణి ఒకటి 2,802 కి.మీ ఎత్తుకు వెళ్లడం ఇదే తొలి సారి. ఉ.కొరియాలోని ఉత్తర ఫియోంగాన్ రాష్ట్రంలో ఈ పరీక్ష జరిపారని దక్షిణ కొరియా తెలిపింది. ఇది భూమిపై నుంచి ప్రయోగించిన మధ్యశ్రేణి క్షిపణి అని, అమెరికాకు దీనివల్ల ముప్పులేదని అమెరికా పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ఐసీబీఎం 6,700 కి.మీ. వరకు దూసుకెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉ.కొరియా ఈ ఏడాదిలో క్షిపణి పరీక్ష నిర్వహించ డం ఇది 11వసారి. అమెరికా స్వాతంత్య్రదినమైన జూలై4న ఐసీబీఎంను పరీక్షించడం గమనార్హం.
ఇంకో మంచి పని లేదా?: ట్రంప్
ఉ.కొరియా క్షిపణి పరీక్షపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ‘ఇతనికి తన జీవితంలో చేయాల్సిన మంచిపనేదీ లేదా?’ అని ఉ.కొరియా నేత కిమ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఉ.కొరియాపై ఒత్తిడి తెచ్చి, ఈ పిచ్చిపనులను మానిపించాలని ఆ దేశానికి మిత్రదేశమైన చైనాకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అమెరికా సహా సంబంధిత పక్షాలన్నీ సంయమనం పాటించాలని చైనా కోరింది.