successfully launches
-
జీఎస్ఎల్వీ–ఎఫ్14 సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జియో సింక్రనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్14) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 27.30 గంటల అనంతరం నిర్దేశిత సమయానికి రాకెట్ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగంలోని మొత్తం మూడు దశలు విజయవంతమయ్యాయి. 2,275 కిలోల బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు(పెరిజీ), భూమికి దూరంగా 36,647 కిలోమీటర్ల(అపోజీ) జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఇన్శాట్–3డీఎస్‌లో నింపిన 1,250 కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండించి, మరో రెండు మూడు రోజుల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్(భూ స్థిరకక్ష్య)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. ఏమిటీ ఇన్శాట్–3డీఎస్? దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు, విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది. దీంతో వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత రానుంది. ఇన్శాట్–3, ఇన్శాట్–3ఆర్ ఉపగ్రహాలకు అనుసంధానంగా మూడో తరం ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహం పని చేస్తుంది. ఇప్పటిదాకా ఇన్శాట్ శ్రేణిలో 23 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ శాటిలైట్లకు కొనసాగింపుగా ఇన్శాట్–3డీఎస్‌ని అభివృద్ధి చేశారు. ఇందులో ఆరు చానెల్ ఇమేజర్స్, 19 చానెల్ సౌండర్స్తోపాటు మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను అమర్చారు. వాతావరణ పరిశీలనతోపాటు భూమి, సముద్ర ఉపరితలాల అధ్యయనం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా సేవలు అందించనుంది. త్వరలో నిస్సార్ ప్రయోగం: సోమనాథ్ నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్(నిస్సార్) మిషన్ అనే జాయింట్ ఆపరేషన్ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జూన్‌లో జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. పీఎస్ఎల్వీ–సీ59, ఎస్ఎస్ఎల్వీ–డి3, జీఎస్ఎల్వీ–ఎఫ్15 ప్రయోగాలతో పాటు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ఆర్ఎల్వీ–టీడీ–2 ప్రయోగం కూడా నిర్వహించబోతున్నట్లు ఎస్.సోమనాథ్ తెలిపారు. -
అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర క్షిపణి పరీక్ష
మాస్కో: అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ఈ క్షిపణి అణువార్హెడ్లను మోసుకెళ్లగలదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంతో రష్యా, పశ్చిమదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడం, అంతర్జాతీయ అణు పరీక్ష నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతూ రష్యా పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై అధ్యక్షుడు పుతిన్ గత వారం సంతకం చేసిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బులావా క్షిపణిని రష్యా ఉత్తర తెల్ల సముద్రంలో నీటి అడుగు నుంచి పరీక్షించి చూసినట్లు రష్యా రక్షణ శాఖ వివరించింది. -
PSLV C-54 ప్రయోగం సక్సెస్
-
స్క్రామ్‌జెట్ పరీక్ష విజయవంతం
చండీపూర్: భారత రక్షణ పరిశోధన సంస్థ మరో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. క్షిపణుల వేగాన్ని ఆరు రెట్లు ఎక్కువ చేసే స్క్రామ్‌జెట్ ఇంజిన్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఘనత సాధించిన అతితక్కువ దేశాల సరసన భారత్‌ను సగర్వంగా నిలిపింది. పూర్తిగా దేశీయంగానే తయారైన ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్లు భవిష్యత్తు అగ్ని –5, బ్రహ్మోస్ వంటి క్షిపణులను నడిపిస్తాయని అంచనా. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీ పారిశ్రామిక రంగం సాయంతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్షిస్తున్న డీఆర్డీవో ఆ దిశగా మరో ముందడుగు వేసినట్లే. ఒడిశాలోని వీలర్ ఐల్యాండ్‌లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలామ్ కాంప్లెక్స్‌లో సోమవారం ఉదయం 11.03 గంటలకు ప్రయోగం జరగ్గా... హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ వెహికల్ (హెచ్‌ఎస్‌టీటీవీ) విజయవంతంగా నింగికి ఎగసిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌ఎస్‌టీటీవీ 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత ఏరడైనమిక్ హీట్‌షీల్డ్స్ వేరుపడ్డాయని, ఆ తరువాత క్రూయిజ్ వాహనం ముందుకు దూసుకెళ్లిందని ఆ ప్రకటన వివరించింది. ముందుగా నిర్దేశించిన మార్గంలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మొదలుపెట్టిందని, లాంచ్ వెహికల్ నుంచి వేరుపడిన వెంటనే స్క్రామ్‌జెట్ ఇంజిన్ పరిసరాల్లోని గాలికి ఇంధనాన్ని జోడించి మండటం మొదలుపెట్టిందని, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసినట్లు టెలిమెట్రీ స్టేషన్లలోని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు గుర్తించాయి. స్క్రామ్‌జెట్ ఇంజిన్ పనితీరును పరిశీలించేందుకు బంగాళాఖాతంలో ఒక ప్రత్యేక నౌకను ఏర్పాటు చేయడం గమనార్హం. దశాబ్దాల పరిశోధనల ఫలితంగా ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైందని, సంక్లిష్టమైన టెక్నాలజీలను సైతం దేశీయంగానే అభివృద్ధి చేయగలమన్న నమ్మకాన్ని పెంచిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నో ప్రయోజనాలు... స్క్రామ్‌జెట్ ఇంజిన్ల వల్ల ధ్వనికి ఆరురెట్ల వేగంతో ప్రయాణించడం ఒక్కటే ప్రయోజనం కాదు. రాకెట్లు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఆక్సిజన్‌ను మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంజిన్‌లో తిరిగే భాగాలు ఏవీ ఉండవు కాబట్టి ప్రస్తుతం రాకెట్లలో వాడుతున్న టర్బోజెట్ల కంటే సులువుగా స్క్రామ్జెట్లను తయారు చేయవచ్చు. అందించే ప్రతి లీటర్ ఇంధనానికి ఈ ఇంజిన్లు అందుకునే వేగం సాధారణమైన వాటికంటే చాలా ఎక్కువ. వేగం కూడా చాలా ఎక్కువ కాబట్టి అంతరిక్ష ప్రయోగాలు చాలా చౌక అవుతాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయం నుంచి స్క్రామ్జెట్లను అభివృద్ధి చేసేందుకు పలు దేశాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే 1991లో రష్యా తొలిసారి ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఆ తరువాతి కాలాల్లో ఫ్రాన్స్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు ఈ టెక్నాలజీని అందుకున్నాయి. ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్ ఇంజిన్లు సాధించిన గరిష్ట వేగం ధ్వనికి 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2007లో నాసా, ఆస్ట్రేలియాకు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ ఘనతను సాధించాయి. ప్రధాని అభినందనలు స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీవోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘హైపర్సోనిక్ టెస్ట్ డెమాన్‌స్ట్రేషన్ వెహికల్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవోకు అభినందనలు. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్ ఇంజిన్ ధ్వని వేగం కన్నా ఆరురెట్లు అధికవేగాన్ని అందుకొంది. అతికొద్ది దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది’అని మోదీ ట్వీట్ చేశారు. స్క్రామ్‌జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఓ చరిత్రాత్మక ఘనత అని వ్యాఖ్యానించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. -
స్క్రామ్‌జెట్ పరీక్ష సక్సెస్
బాలాసోర్: హైపర్సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్(హెచ్ఎస్టీడీవీ) అనే మానవరహిత విమానాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ స్క్రామ్‌జెట్ విమానాన్ని ఒడిశాలోని కలామ్ ద్వీపం నుంచి బుధవారం ఉదయం డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. హెచ్ఎస్టీడీవీ ఓ పునర్వినియోగ వాహనమనీ, దీంతో ఉపగ్రహాలను చవకగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని రక్షణరంగ నిపుణుడొకరు చెప్పారు. దీంతో శత్రుదేశాలపై క్రూయిజ్ క్షిపణులనూ ప్రయోగించవచ్చన్నారు. హెచ్ఎస్టీడీవీ 20 సెకన్లలో 32.5 కి.మీ ఎత్తుకు చేరుకోగలదనీ, గంటకు 7,408 కి.మీ(6 మ్యాక్‌ల) వేగంతో దూసుకుపోగలదన్నారు. తాజాగా ప్రయోగంతో ఇలాంటి సాంకేతికత ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరిందన్నారు. హెచ్‌ఎస్‌టీడీ తొలుత ఘనఇంధన మోటార్‌తో నిర్ణీత ఎత్తులోకి చేరుకుంటుంది. సరైన వేగం అందుకున్నాక హెచ్‌ఎస్‌టీడీలోని క్రూయిజ్ వాహనం విడిపోతుందనీ, స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను మండించడం ద్వారా ఇది లక్ష్యం దిశగా దూసుకెళుతుందని పేర్కొన్నారు. -
ఇస్రోకు మరో ‘పీఎస్ఎల్వీ’ విజయం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన గెలుపుగుర్రం పీఎస్ఎల్వీతో మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పీఎస్ఎల్వీ–సీ43 రాకెట్ ద్వారా హైసిస్ (హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్) అనే అత్యాధునిక భూ పర్యవేక్షక ఉపగ్రహంతోపాటు ఎనిమిది దేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత గురువారం ఉదయం 9.57 గంటలకు పీఎస్ఎల్వీ సీ–43 రాకెట్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ, మేఘాలను చీల్చుతూ నింగికి దూసుకెళ్లింది. సరిగ్గా 17 నిమిషాల 27 సెకన్లలో హైసిస్‌ను భూమికి 636.3 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ప్రవేశపెట్టింది. అనంతరం మరో గంటలో మిగిలిన 30 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా వివిధ కక్ష్యల్లోకి చేర్చింది. ఇస్రో చరిత్రలో అత్యంత సుదీర్ఘ సమయం సాగిన ప్రయోగం ఇదే. ఇస్రో అభివృద్ధి చేసిన హైసిస్ ఉపగ్రహంతో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం వ్యవసాయం, అడవులు, భూ సర్వే, భూగర్భ శాస్త్రం, తీర ప్రాంతాలు, దేశీయ జల మార్గాలు, పర్యావరణ పర్యవేక్షణ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం గుర్తింపు తదితర రంగాల్లో హైసిస్ సేవలనందించనుంది. వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ–సీ 43 ప్రయోగం విజయవంతం అయినందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్తులో వారికి అన్నీ విజయాలే చేకూరాలనీ, అంతరిక్షరంగంలో భారతదేశం వెలిగి పోవాలని ఆయన ఆకాంక్షించారు. 15 రోజుల్లోనే మరో అద్భుత విజయం: శివన్ ఇటీవలే భారీ రాకెట్ జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ద్వారా జీశాట్ 29 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఆ తర్వాత 15 రోజుల్లోనే ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ43 రాకెట్ విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం అద్భుతమని ఇస్రో చైర్మన్ శివన్ అన్నారు. వచ్చే నెల 5వ తేదీనే ఇస్రో మరో ప్రయోగం చేపడుతోంది. ఫ్రెంచ్ గయానా నుంచి జీశాట్ 11 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని కూడా డిసెంబర్లోనే ప్రయోగించే అవకాశం ఉంది. చంద్రయాన్– ఐఐ సహా వచ్చే ఏడాది తామెన్నో ప్రయోగాలను చేయనున్నామన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టును వీలైనంత ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో చేపడతామని ఆయన చెప్పారు. గగన్‌యాన్ కింద 2020 డిసెంబర్ నాటికి మానవ రహిత, 2022 నాటికి మానవసహిత ప్రయోగాలను చేపట్టనున్నామని శివన్ వెల్లడించారు. -
జీశాట్- 15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
ఫ్రెంచ్ గయానా: జీశాట్-15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.04 గంటలకు జీశాట్-15ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అరైన్-5-వీఏ 227 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3,164 కిలోలు బరువున్న జీశాట్-15తో పాటు అరబ్‌శాట్-6బీనూ రోదసిలోకి పంపారు. జీశాట్-15లో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్స్ , రెండు గగన్ పేలోడ్స్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంట్ నావిగేషన్) అనే ఉపకరణాలను అమర్చి పంపారు.