న్యూఢిల్లీ: అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం ఆధారిత భారత్ అని.. ఐదు మూల స్థంభాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ.. లోకల్ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. లాక్‌డౌన్ కాలంలోనూ కేంద్రం అనేక సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
కాగా కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పథకం గురించి నిర్మల బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ విధివిధానాలను ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశ వ్యాపార వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపి... వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.(రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ)
తమ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు.. ఇప్పుడు మంచి ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంక్ అకౌంట్ల కారణంగా కరోనా కష్టకాలంలో.. పేదల అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేయగలిగామని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ధాన్యం, ఉచిత సిలిండర్లు అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ద్వారా ఆర్థిక ఉద్దీపన అమలు చేశామని.. స్వయం ఆధారిత భారత్‌కు కావాల్సిన పునాదులు ఇప్పటికే మోదీ సర్కారు పూర్తి చేసిందని వెల్లడించారు. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ఈరోజు ప్రకటించబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు... ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్‌ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అదే విధంగా ఈపీఎఫ్ పరిధిలోని ఎంఎస్‌ఎంఈలకు జూన్, జూలై, ఆగస్టు నెలెల పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇందుకు గానూ రూ. 2500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీంతో దాదాపు 70 లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఇక విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల తెలిపారు. అలాగే ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్, టీసీఎన్‌ను 25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారు. మే 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఇక కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్ ఎస్టేట్ కంపెనీలు.. భవన నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు మరో ఆరు నెలల సమయం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
నిర్మలా సీతారామన్ ప్రసంగం- ముఖ్యాంశాలు
- లాక్‌డౌన్‌తో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి
- 45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట
- రూ. 3 లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ
- చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు అప్పులు
- అత్యవసరాల కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 20 వేల కోట్ల అప్పులు
- 4 సంవత్సరాల కాలపరిమితికి అప్పులు తీసుకోవచ్చు
- విద్యుత్ డిస్కంలను ఆదుకునేందుకు రూ. 90 వేల కోట్ల నిధులు
- ఈపీఎఫ్: ప్రభుత్వమిస్తున్న సాయం మరో 3 నెలల పాటు పొడిగింపు
- తద్వారా 70.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది
- ఇందుకోసం రూ. 2500 కోట్లు కేటాయింపు
- ప్రాథమిక, సెకండరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ. 30 వేల కోట్లు
- నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లను ఆదుకునేందుకు రూ. 30 వేల కోట్లు
- ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వాల్సిన బాకీలు తీరుస్తాం
- కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలల వరకు పొడిగింపు
- కరోనాతో వాయిదాపడిన రియల్ ఎస్టేట్ నిర్మాణాల కాలపరిమితి 6 నెలల పాటు పొడిగింపు
- పనిని బట్టి కాంట్రాకట్లర్లకు డబ్బులు చెల్లింపు
- ఇక పన్నుల విషయానికొస్తే.. రేపటి నుంచి మార్చి 2021నాటికి చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ 25 శాతం తగ్గింపు
- తద్వారా 50 వేల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లోనే
- ట్యాక్స్ రిటర్న్స్ తేదీ 31 జూలై నుంచి నవంబరు 30 వరకు పొడిగింపు
చిన్న మధ్య తరహా పరిశ్రమల మూలధన పరిధిని పెంచిన కేంద్రం
- రూ.కోటి పెట్టుబడి, రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న ప్రతి కంపెనీ సూక్ష్మపరిశ్రమగా గుర్తింపు
- 10 కోట్ల పెట్టుబడి, 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తింపు
- రూ.200 కోట్ల విలువ వరకు గ్లోబల్ టెండరింగ్ అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment