ఆన్‌లైన్ వద్దు...అడ్డదారే ముద్దు
రవాణా శాఖ ఉద్యోగుల యత్నం
అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి
సిటీబ్యూరో: రవాణా శాఖలో ఆన్‌లైన్ వ్యవస్థకు ఆదిలోనే కొందరు అధికారులు, సిబ్బంది మోకాలడ్డుతున్నారు. పారదర్శక, స్మార్ట్ సేవలను అందించేందుకు ఆన్‌లైన్ బాట పట్టిన రవాణా శాఖకు సిబ్బంది సహాయ నిరాకరణ శాపంగా పరిణమించింది. ఒక వైపు అన్ని ప్రభుత్వ విభాగాలు తమ సేవలను మొబైల్ అప్లికేషన్లు... ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంటే... రవాణా శాఖలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. బ్రోకర్లు, మధ్యవర్తుల ద్వారా తమ అక్రమార్జనకు గండి పడుతుండడంతో ఏకంగా ఆన్‌లైన్ వ్యవస్థనే ఎత్తి వేయాలనే లక్ష్యంతో కొద్ది రోజులుగా ఆ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నట్లు తెలిసింది. ‘ఆన్‌లైన్ తొల గింపు’ అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండా దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు ఉన్నాయని... పని భారం పెరిగింద ని... వినియోగదారులు సరైన డాక్యుమెంట్లు అందజేయడం లేదని సాకులు చెబుతున్నారు. దీన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు పెద్దలను రంగంలోకి దించినట్లు తెలిసింది.
‘అడ్డదారి’కే పెద్దపీట
రవాణాశాఖ అందజేసే డ్రైవింగ్ లెసైన్స్ రె న్యూవల్, డూప్లికేట్ లెసైన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లెసైన్స్, డైవింగ్ లెసైన్స్‌లో చిరునామా మార్పు వంటి 15 రకాల పౌర సేవల కోసం ఇంటి నుంచే నేరుగా దరఖాస్తు చేసుకొనేలా గత ఏడాది నవంబర్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. వినియోగదారులు ఈ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్‌ల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సదుపాయానికి ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తున్న తరుణం లో నీరుగార్చడం ద్వారా ‘అడ్డదారి’ కే పెద్దపీట వేస్తున్నారు. ప్రధాన కార్యాలయమైన ఖైరతాబాద్ మినహా మిగతా చోట్ల ఆన్‌లైన్ నిరాదరణకు గురవుతోంది. దీనిపై గత ఫిబ్రవరిలో ‘ఆన్‌లైన్ కాదు... అదే ‘లైన్’,... ఆర్టీఏ అడ్డదారి’ శీర్షికన ‘సాక్షి’లో వార్తా కథనం వెలువరించిన సంగతి తెలిసిందే. దీనితో ఆన్‌లైన్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వెబ్ కెమెరాల ద్వారా నిఘాను పటిష్టం చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ వివిధ కేడర్లలోని ఉద్యోగులు, సిబ్బంది నుంచి సహాయ నిరాకరణ మొదలు కావడం, దీని తొలగింపునకు అధికారులపై ఒత్తిళ్లు ప్రారంభం కావడం గమనార్హం.
ఏజెంట్ల ద్వారా వస్తే ఓకే....
ఆర్టీఏలో ఏజెంట్ల కార్యకలాపాలను 2002లోనే నిషేధించి నప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల స్వీయ పర్యవేక్షణ ఉండే ఖైరతాబాద్, అత్తాపూర్ వంటి కొన్ని కార్యాలయాలు మినహా అనేకచోట్ల వినియోగదారులకు సముచితసేవలు లభించడంలేదు. ఇబ్రహీం పట్నం, కూకట్‌పల్లి, టోలీచౌకీ వంటి నగర శివారు ఆర్టీఏ కేంద్రాల్లో ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులకు తప్ప సామాన్యులకు పౌరసేవలు లభించడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారుల చిరునామాకు స్పీడ్ పోస్టు ద్వారా అందజేయవలసిన స్మార్ట్‌కార్డులను సైతం రూ.200 నుంచి రూ.300 చొప్పున నేరుగా విక్రయిస్తున్నారు.