
రవాణాశాఖలో వినూత్నమార్పులు
రవాణా శాఖలో టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కు రాష్ట్ర రవాణా శాఖ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు
నగరంపాలెం(గుంటూరు) : రవాణా శాఖలో టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కు రాష్ట్ర రవాణా శాఖ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా ఉప రవాణా కమిషనరు రాజారత్నం కన్వీనర్‌గా ఏర్పాటైన ఈ కమిటీ రవాణా శాఖలో పారదర్శక సేవలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకునేందుకు అవసరమైన మార్పులను సూచిస్తూ ప్రాథమిక నివేదిక తయారు చేసింది. దీనిని గత వారం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాజారత్నం రవాణాశాఖ కమిషనర్‌కు వివరించారు. రవాణా శాఖలో ఏజెంట్ల ప్రమేయాన్ని పూర్తిస్థాయిలో నిరోధించేందుకు వాహనదారులకు సంబంధించి ఎక్కువ సేవలను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయాలని తెలిపారు.
ప్రస్తుతం వాహనాలకు అనుమతులకు, లెసైన్స్‌ల జారీకి రవాణా శాఖ నిర్వహించే 54 రకాల సేవలలో ఎల్‌ఎల్‌ఆర్, డీఎల్‌ఆర్ స్లాట్ బుకింగ్‌లు,ఇన్సూరెన్స్‌లకు మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. వీటితోపాటు డూప్లికేట్ లెసైన్స్‌లు, ఆర్‌సీల జారీకి, అడ్రస్ మార్పునకు, కండెక్టర్ లెసైన్స్ రెన్యూవల్‌కు తదితర 11 రకాల సర్వీసులను తక్షణమే ఆన్‌లైన్‌లో అందించేందుకు అవకాశం ఉన్నట్టు తెలిపారు.
డ్రైవింగ్ ట్రాక్‌పై కెమెరాలు
కార్యాలయాల్లో పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్‌లకు అధికారుల పర్యవేక్షణలో కొనసాగే ప్రాక్టికల్ టెస్ట్‌ను కంప్యూటరైజ్డ్ చేయనున్నారు. డ్రైవింగ్ ట్రాక్‌పై వివిధ ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు సెన్సార్లతో కూడిన వీడియో కెమెరాలను అమర్చి కంప్యూటరుకు అనుసంధానిస్తారు. ట్రాక్‌ై పె డ్రైవింగ్ టెస్ట్ జరిపిన వెంటనే వాహనం నడిపిన వి దానాన్ని కెమెరాలు రికార్డు చేసి కంప్యూటర్‌లోని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌కు అందిస్తాయి. టెస్ట్ పూర్తయిన పదిహేను ని మిషాలలో ఫలితాలను విశ్లేషించి కంప్యూటర్ పాస్ లేదా ఫెయిల్ అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్‌పోస్టులలో పనిచేస్తున్న ఉద్యోగులలో పారదర్శకత పెంచేందుకు సీసీ కెమెరాలను ఏర్పా టు చేసి ఆన్‌లైన్‌కు అనుసంధానించి సిబ్బంది పనితీరు ను ఉన్నతాధికారులు పరిశీలించే వీలు కల్పించనున్నారు.
తనిఖీ అధికారులకు బాడీమౌంటెడ్, వెహికల్ మౌంటెడ్ కెమెరాలు
మోటరు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేసే సమయంలో వాహనదారులతో జరిగే సంభాషణలు రికార్డు చేసేందుకు వారి షర్టు బటన్స్‌కు అమర్చుకుని వీడియో తీసే బాడీమౌంటెడ్ కెమెరాలను అందించనున్నారు. వీటి ద్వారా తనిఖీ అధికారుల పనితీరులో జవాబుదారీతనం పెరగటంతో పాటు రికార్డు చేసిన దృశ్యాలు కార్యాలయం సర్వరులో లోడ్ చేయటం వలన కిందిస్థాయి సిబ్బంది పనితీరును ఉన్నతస్థాయి అధికారులు ఎక్కడినుంచైనా పరిశీలించే అవకాశం ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వాహనాలను ట్రాక్ చేసేందుకు తనిఖీ అధికారులకు అందించే ప్రత్యేక వాహనాలకు వెహికల్ మౌంటెడ్ కెమెరాలను సమకూర్చనున్నారు. వీటి ద్వారా తనిఖీ అధికారుల నుంచి తప్పించుకొని వెళుతున్న వాహనాల నంబర్లు తెలుసుకొని కేసులు నమోదు చేసేందుకు అవశాశం ఏర్పడుతుంది. 500 మీటర్లు దూరంలో వాహనాల నంబర్లు తెలుసుకునేందుకు వీలున్న హై ఎండ్ కెమెరాలను వీటి కోసం వినియోగించనున్నారు.