షీ ఆటోలకు బ్రేక్ | breaks to She autos | Sakshi
Sakshi News home page

షీ ఆటోలకు బ్రేక్

Published Sat, Jul 4 2015 1:08 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

breaks to She autos

బ్యాడ్జి నంబర్ తెచ్చిన తంటా
ఏడాది అనుభవం తప్పనిసరి అంటున్న రవాణా శాఖ
స్పెషల్ కేసుగా పరిగణించాలంటున్న యూసీడీ

 
విజయవాడ సెంట్రల్ : అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి చందంగా ‘షీ’ ఆటోల పరిస్థితి తయారైంది. రోడ్డెక్కకుండానే బ్రేక్ పడింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ)లు వినూత్నంగా నగరంలో ప్రవేశపెడదామనుకున్న షీ ఆటోలకు రవాణా శాఖ రెడ్ సిగ్నల్ వేసింది. నిబంధనల పుణ్యమా అని మరో ఏడాది వరకు షీ ఆటోలు రోడ్డెక్కే ఛాన్స్ లేదు.
 
స్వయం సహాయక సంఘ (డ్వాక్వా) మహిళలకు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడలో షీ ఆటోలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది. మెప్మా డెరైక్టర్ రాజశేఖర్ రెడ్డి మార్చిలో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించి, 40 ఏళ్ల లోపు వయసు ఉన్న డ్వాక్వా మహిళలను షీ ఆటో శిక్షణకు ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నగర పాలక సంస్థ యూసీడీ అధికారులు డివిజన్లలో సదస్సులు నిర్వహించారు. డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించడం, బ్యాంకర్ల ద్వారా రుణాలు మంజూరు చేయించడంతో పాటు రవాణా శాఖ ద్వారా డ్రైవింగ్ లెసైన్స్ మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు. దీనితో పలువురు మహిళల్లో  ఆసక్తి నెలకొంది.  తొలి విడతగా నగరంలో 117 మంది మహిళలు ఆటో డ్రైవింగ్ నేర్చుకునేందుకు ముందుకు వచ్చారు.  పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ, గారపాటి కనుమిల్లి చారిటీస్‌కు మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చే బాధ్యతను అప్పగించారు. 45 రోజుల శిక్షణకు సంబంధించి రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. మొదటి బ్యాచ్‌కు మే నెలలోనే శిక్షణ పూర్తయింది.  

 కథ అడ్డం తిరిగింది
 ఆటోల కొనుగోలులో భాగంగా  రుణాల మం జూ రు కోసం యూసీడీ అధికారులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, భారతీయ స్టేట్‌బ్యాంక్ అధికారులతో చర్చలు సాగించారు. డ్రైవింగ్ లెసైన్సు, షూరిటీలు ఉంటే రుణాలు మంజూరు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు తేల్చిచెప్పారు. అక్కడి నుంచి సీన్ రవాణా శాఖకు మారింది. డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన మహిళలకు డ్రైవింగ్  లెసైన్స్, బ్యాడ్జి మంజూరు చేయాల్సిందిగా నగర పాలక సంస్థ అధికారులు కోరారు. మహిళల్లో కొందరు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండక పోవడాన్ని రవాణా శాఖ తప్పుపట్టింది. లెసైన్స్ పొందిన ఏడాది తర్వాత మాత్రమే బ్యాడ్జి నంబర్ మంజూరు చేస్తామని పేర్కొంది. ఇప్పుడు లెసైన్సు మంజూరు చేస్తే ఏడాది తర్వాత కానీ బ్యాడ్జి నెంబర్ వచ్చే పరిస్థితి లేదు. బ్యాడ్జి నంబర్ లేకుండా పబ్లిక్ సర్వీసు చేయడం నేరం కాబట్టి షీ ఆటోలను రోడ్డు ఎక్కనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన మహిళలు అయోమయంలో పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement