ట్రాఫిక్ ఉల్లం‘ఘనులూ’ పారాహుషార్!
చలానే కాదు ఇక పాయింట్లూ పడతాయ్.. జాగ్రత్త
- రెండేళ్లలో 12 పాయింట్లు ఉంటే లై సెన్స్ రద్దు
- నోటిఫికేషన్ జారీ చేసిన రవాణాశాఖ
- సూచనలు, సలహాలు, అభ్యంతరాలకు 15 రోజుల గడువు
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లం‘ఘనులూ’ పారాహుషార్. నిబంధనలను ఉల్లంఘిస్తే పెనాల్టీలకుతోడుగా నేరాన్ని బట్టి పాయింట్లు కేటాయిస్తారు. ఆ పాయింట్లు 12కు చేరితే లెసైన్స్ రద్దవుతుంది. అదే లెర్నింగ్ లెసెన్సు ఉన్నవారు నిబంధనలు ఉల్లంఘిస్తూ పాయింట్ల సంఖ్యను ఐదుకు పెంచుకుంటే వారి తాత్కాలిక లెసైన్స్ కూడా రద్దవుతుంది. ఈ మేరకు రవాణాశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తెలుసుకునేందుకు పక్షం రోజుల గడువు ఇచ్చింది. రోడ్డు భద్రత చట్టం నియమాలను కచ్చితంగా పాటించేలా కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే కేంద్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.వేలల్లో భారీ పెనాల్టీలు, లెసైన్సు రద్దు, వాహనాల జప్తు లాంటివి ఇందులో ఉండబోతున్నాయి.
ప్రస్తుతం ట్రాఫిక్ కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా వాహనదారుల ఉల్లంఘనలను గుర్తించి ట్రాఫిక్ పోలీసులు ఈ-చలానాలు పంపుతున్నారు. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నందున కూడళ్లలోనే కాకుండా, సాధారణ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించినా కెమెరా కంటికి చిక్కటం ఖాయం. రవాణాశాఖ డేటాబేస్ ఎప్పటికప్పుడు లెక్కకడుతూ ఉంటుంది. 24 నెలల్లో పాయింట్ల సంఖ్య 12కు చేరితే ఏడాదిపాటు లెసైన్సును రద్దు చేస్తారు. మళ్లీ కొత్త ఖాతా మొదలవుతుంది. మళ్లీ 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే రెండేళ్లపాటు, తదుపరి పునరావృతమైతే మూడేళ్లపాటు లెసైన్సు రద్దు చేస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో వాహనాల నిబంధనలు, ప్రమాదాల నివారణ అంశాలపై నిర్వహించే అవగాహన తరగతులకు హాజరైతే అప్పటి వరకు వాహనదారు ఖాతాలో నమోదైన పాయింట్ల నుంచి మూడు పాయింట్లను తగ్గించే అవకాశముంది. రెండేళ్లల్లో రెండుసార్లు ఈ అవకాశం ఉంటుంది.