
ఆటో సమ్మె వాయిదా
- స్పెషల్ డ్రైవ్ నిలిపివేతకు ఆర్టీఏ అధికారుల అంగీకారం
- ఆటో సంఘాలతో చర్చలు సఫలం
- డ్రైవింగ్ లెసైన్సులకు నెల గడువు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ, పోలీసుల స్పెషల్ డ్రైవ్‌కు వ్యతిరేకంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక బంద్‌ను ఆటో సంఘాల జేఏసీ వాయిదా వేసుకుంది. ఆటో సంఘాల ప్రతినిధులతో రవాణా, పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం రెండు విడతలుగా జరిపిన చర్చలు సఫలం కావడం, స్పెషల్ డ్రైవ్ నిలిపివేసేందుకు అధికారులు అంగీకరించడంతో సమ్మె ప్రతిపాదనను వాయిదా వేసుకుంటున్నట్లు ఆటో సంఘాల జేఏసీ నాయకులు బి.వెంకటేశం, వి.కిరణ్, మారయ్య, సత్తిరెడ్డిలు తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ నెల 16 నుంచి జప్తు చేసిన ఆటోలను తిరిగి డ్రైవర్లకు అప్పగించేందుకు కూడా రవాణాశాఖ అంగీకరించినట్లు పేర్కొన్నారు.
రవాణాశాఖ అదనపు కమిషనర్ బి.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్, డీసీపీ (ట్రాఫిక్) రంగనాథ్, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ ఆటో సంఘాలతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగియడంతో నగరంలోని లక్షా 30 వేల ఆటోలు యథావిధిగా సాగనున్నాయి. లెసైన్సు లేకుండా ఆటోలు నడిపితే పర్మిట్లు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఆటోడ్రైవర్లు డ్రైవింగ్ లెసైన్సు తీసుకునేందుకు నెల రోజుల గడువు విధించారు. అలాగే లెసైన్సులు లేవనే కారణంగా ఆటోలను జప్తు చేయడం, పర్మిట్లను రద్దు చేయడం వంటి చర్యలు మాత్రం ఉండబోవు. రవాణా, పోలీసు అధికారులతో జరిగిన చర్చల్లో 15 ఆటో సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇతర జిల్లాల ఆటోలపై కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్
మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర పొరుగు జిల్లాల నుంచి వచ్చి నగరంలో తిరిగే ఆటోరిక్షాలపైన మాత్రం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని జేటీసీ రఘునాథ్ తెలిపారు. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, సంగారెడ్డి, షాద్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి ఆటోలను నగరానికి తరలిస్తున్నందువల్ల వాటిని నియంత్రించేందుకు డ్రైవ్ కొనసాగుతుందన్నారు. డ్రైవింగ్ లెసైన్సులు తీసుకొనేందుకు నెల రోజుల గడువు విధించిన నేపథ్యంలో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసి లెర్నింగ్ లెసైన్సులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.