
ఫిట్ లెస్ బస్సులు
- 800 బస్సులకు ముగిసిన కాలపరిమితి
- ఆర్టీఏకు చిక్కకుండా విద్యార్థుల తరలింపు
- పాఠశాల యాజమాన్యాలకు రవాణాశాఖ నోటీసులు
- కాలం చెల్లిన బస్సులను స్వాధీనం చేసుకొనేందుకు సన్నాహాలు
సాక్షి, సిటీబ్యూరో : ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులే కాదు. కాలం చెల్లిన వాటిలో సైతం విద్యార్థులను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గత పదిహేను రోజులుగా స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీఏ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 800లకు పైగా కాలం చెల్లిన స్కూల్ బస్సులు ఉన్నట్లు గుర్తించింది.
కొన్ని పాఠశాలల నిర్వాహకులు రవాణా చట్టాలను బేఖాతరు చేస్తూ 15 ఏళ్ల కాలపరిమితి ముగిసి, రవాణాకు పనికి రాని బస్సులను పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో రెండోశ్రేణి, పదిహేనేళ్ల గడువు సమీపించిన బస్సులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి నగరంలో నడుపుతున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇలాంటి బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
రవాణాశాఖ గణాంకాల ప్రకారం గ్రేటర్ పరిధిలో 10 వేలకు పైగా స్కూళ్లు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు చెందిన బస్సులు నడుస్తున్నాయి. అయితే ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు స్కూల్ బస్సుల నిబంధనలను కఠినతరం చేశారు. ఏటా విధిగా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి, ఆర్టీఏ అనుమతి పొందాలనే నిబంధనను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 800కు పైగా బస్సులు చాలా ఏళ్లుగా ఫిట్‌నెస్ పరీక్షలకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు రవాణాశాఖ పరిశీలనల్లో వెల్లడయ్యింది. ఈ నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.
విద్యాసంస్థలకు నోటీసులు
నగరంలో కాలంతీరిన బస్సులు 300 ఉండగా, శివారు ప్రాంతాల్లో మరో 500లకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇవి లెక్కల్లో తేలినవి మాత్రమే. రికార్డులకు అందకుండా ఎక్కువ సంఖ్యలోనే ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు విద్యాసంస్థలకు నోటీసులు సైతం జారీ చేశారు. అంతేగాకుండా అధికారులు స్వయంగా ప్రతి స్కూల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ఎంవీఐ తన పరిధిలోని 8 నుంచి 10 స్కూళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి కాలం చెల్లిన బస్సులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆటోలు, వ్యాన్‌లపైనా తనిఖీలు : ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు
నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను తీసుకెళ్లే ఆటోలు, మారుతీ ఓమ్నీ వాహనాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు తెలిపారు. 8 సీట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యాన్‌లలో మాత్రమే పిల్లలను తీసుకెళ్లాలనే నిబంధనను ఉల్లంఘిస్తూ, ఆటోల్లోనూ పరిమితికి మించి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాటిని సీజ్ చేయనున్నట్లు తెలిపారు.