
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డుల జారీలో నెలకొన్న జాప్యాన్ని పక్షం రోజుల్లో నివారించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్య తీవ్రంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాల జిల్లాల కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.30 లక్షల కార్డుల జారీ పెండింగ్‌లో పడిన నేపథ్యంలో వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన రవాణా శాఖ అధికారులతో సమీక్షించారు.
రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జేటీసీలు రమేశ్, పాండురంగ నాయక్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్ ఆ కార్డుల జారీకి కావాల్సిన రిబ్బన్‌లను సరఫరా చేయకపోవటంతో సమస్య తలెత్తిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్య తీవ్రంగా ఉన్న నాలుగు జిల్లాల కార్యాలయాలకు మూడు రోజుల్లో కార్డుల జారీకి కావాల్సిన సరంజామాను సరఫరా చే యాలని మంత్రి ఆదేశించారు. పక్షం రోజు ల్లో ఆ నాలుగు జిల్లాల్లో పెండింగ్‌ను క్లియర్ చేయాలని తెలిపారు. సాధారణ ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకంగా ఓ వ్యక్తిని కేటాయించి ఓ ల్యాండ్ లైన్ నంబరు, వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడీ కేటాయించాలని సూచించారు.
ఆన్‌లైన్ సేవల పరిశీలనకు కమిటీ..
ప్రస్తుతం రవాణా శాఖ అందిస్తున్న ఆన్‌లైన్ సేవల తీరును పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీఏ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తేవాలని తెలిపారు.కమిషనర్ అధ్యక్షతన ఏర్పడే ఈ కమిటీ పక్షం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
Comments
Please login to add a commentAdd a comment