సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రవాణాశాఖలో ఇప్పటికే అన్ని రకాల లైసెన్సులను ఆన్‌లైన్ విధానంలో అందిస్తున్న రవాణాశాఖ.. ఇక సరిహద్దుల్లో కూడా ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్రాష్ట్ర రవాణా చెక్‌పోస్టులను ఇక క్యాష్‌లెస్‌గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది.
రవాణాశాఖకు చెందిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో యూపీఐ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించింది. తద్వారా చెక్‌పోస్టుల్లో అవినీతిని కట్టడికి ఉపయోగపడుతుందని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. అన్ని చెక్‌పోస్టుల్లో క్యాష్‌లెస్ విధానం అమలు కావడంతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
అన్ని ట్యాక్స్‌లూ ఆన్‌లైన్‌లోనే..
వాస్తవానికి రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. బోర్డర్ ట్యాక్స్, టెంపరరీ పర్మిట్ ట్యాక్స్, వలంటరీ ట్యాక్స్, కంపౌండింగ్ ఫీజు ఇలా అన్నింటినీ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేయడం ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు.
అంతేకాకుండా హెచ్‌టీ టీపీఎస్://ఏపీఆర్‌టీఏసిటిజెన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్‌జీ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్ విధానంతో అవినీతి కట్టడితో పాటు చెక్‌పోస్టుల వద్ద లైన్లలో నిలబడి చెల్లించే బాధ తప్పనుంది. తద్వారా వాహనాలను ఎక్కువ సమయం నిలిపి ఉంచే సమయం కూడా తగ్గడం ద్వారా వాహన రవాణా ప్రయాణ సమయం కూడా తగ్గనుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
రవాణాశాఖ చెక్‌పోస్టులివే..
రాష్ట్రానికి అటు కర్ణా్ణటక, ఇటు తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను రవాణాశాఖ నిర్వహిస్తోంది. మొత్తం 15 చెక్‌పోస్టులు.. ఇచ్ఛాపురం, జీలుగువిుల్లి, పంచలింగాల, పెనుకొండ, సున్నిపెంట, తిరువూరు, గరికపాడు, పలమనేరు, తడ, బీవీ పాలెం, రేణిగుంట, నరహరిపేట, దాచేపల్లి, మాచర్ల, బెండపూడి ప్రాంతాల్లో రవాణాశాఖ నిర్వహిస్తోంది.
సీఎం ఆదేశాలతో
చెక్‌పోస్టుల వద్ద క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇక నుంచి చెక్‌పోస్టుల్లో నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేశాం. అవినీతిరహిత పరిపాలన దిశగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎటువంటి మధ్యవర్తులకు తావులేకుండా ఈ విధానం తోడ్పడనుంది. ట్రాఫిక్ ఇబ్బందులకు కొత్త విధానంతో చెక్ పడుతుంది.
– మనీష్‌కుమార్ సిన్హా, రవాణాశాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment