హైదరాబాద్: పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వర్తకుల కోసం రెండు వినూత్న చెల్లింపుల సాధనాలను విడుదల చేసింది. 4జీ ఆధారిత పేటీఎం పాకెట్ సౌండ్ బాక్స్, పేటీఎం మ్యూజిక్ సౌండ్ బాక్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పేటీఎం పాకెట్ సౌండ్‌బాక్స్ అనేది చెల్లింపుల ఆధారిత తొలి పోర్టబుల్ పరికంగా కంపెనీ పేర్కొంది.
డెబిట్ కార్డ్ పరిమాణంలో పాకెట్‌లో పట్టేస్తుందని, డ్రైవర్లు, డెలివరీ, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఇప్పటికే మార్కెట్లో ఉన్న పేటీఎం సౌండ్‌బాక్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. దీన్ని వెంట తీసుకెళ్లడం సౌకర్యంగా ఉండదు. తరచూ వాహనాలపై ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని పేటీఎం పాకెట్ సౌండ్‌బాక్స్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, పేటీఎం మ్యూజిక్ సౌండ్‌బాక్స్ అనేది వర్తకులకు చెల్లింపుల సమాచారాన్ని వాయిస్ రూపంలో వినిపించడమే కాకుండా, బ్లూటూత్‌తో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మ్యూజిక్ వినడం, మ్యాచ్ కామెంటరీ వినొచ్చని పేటీఎం తెలిపింది.
వర్తకుల సౌకర్యం కోసమే ఈ రెండు ఉత్పత్తులను తీసుకొచ్చినట్టు పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. ఇందులో పాకెట్ సౌండ్‌బాక్స్ చెల్లింపుల పరిశ్రమలో ఎంతో మార్పును తీసుకొస్తుందన్నారు. ఈ ఏడాది జూన్ చివరికి పేటీఎంకు 79 లక్షల సౌండ్‌బాక్స్, పేటీఎం కార్డ్ మెషిన్ల చందాదారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment