న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండు ఫిన్‌టెక్ దిగ్గజం.. వన్97 కమ్యూనికేషన్స్‌లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనుంది. యాంట్‌ఫిన్(నెదర్లాండ్స్) హోల్డింగ్స్ నుంచి 10.3 శాతం వాటాను విజయ్ సొంతం చేసుకోనున్నట్లు పేటీఎం తాజాగా పేర్కొంది. ఇందుకు ఎలాంటి నగదు చెల్లింపు ఉండదని, ఆఫ్‌మార్కెట్ లావాదేవీ ద్వారా వాటా బదిలీ ఉంటుందని తెలియజేసింది.
అయితే ఈ వాటా ఎకనమిక్ రైట్స్ యాంట్‌ఫిన్ వద్దనే కొనసాగుతాయని వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా విదేశీ సొంత సంస్థ రెజిలియంట్ అసెట్ మేనేజ్‌మెంట్ బీవీ ద్వారా వాటాను శర్మ కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. దీనికి బదులుగా మార్పిడికి వీలయ్యే(ఆప్షనల్లీ కన్వర్టిబుల్) డిబెంచర్లను యాంట్‌ఫిన్‌కు రెజిలియంట్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ లావాదేవీ కారణంగా కంపెనీ యాజమాన్య నియంత్రణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోవని స్పష్టం చేసింది.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ లావాదేవీతో పేటీఎంలో శర్మ వాటా 19.42 శాతానికి చేరనుంది. వెరసి కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలవనున్నారు. మరోపక్క యాంట్‌ఫిన్ వాటా 23.79 శాతం నుంచి 13.5 శాతానికి తగ్గనున్నట్లు తెలుస్తోంది. కాగా.. పేటీఎం బోర్డులో యాంట్‌ఫిన్ నామినీ ఉండబోరు. యాంట్‌ఫిన్.. చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ అనుబంధ కంపెనీ అన్న సంగతి తెలిసిందే.
షేరు జూమ్
సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాటా పెరగనున్న వార్తల నేపథ్యంలో ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం కౌంటర్లో లావాదేవీలు ఊపందుకున్నాయి. షేరు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో 7 శాతం జంప్‌చేసి రూ. 851 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 12 శాతం దూసుకెళ్లి రూ. 888కు చేరింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,511 కోట్లు ఎగసి రూ. 53,957 కోట్లను అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment