ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం మనీ ల్యాండరింగ్‌తో పాటు వందల కోట్లలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని గుర్తించిన ఆర్‌బీఐ పేటీఎంపై పలు ఆంక్షలు విధించింది. ఫలితంగా పేటీఎం భవిష్యత్ మరింత గందరగోళంగా మారింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదంటే స్తంభించి పోతుందా? ఇలాంటి అనేక ప్రశ్నల పరంపరకు స్పష్టత రావాలంటే అప్పటి వరకు ఎదురు చూడాల్సి ఉంది.
ఆర్‌బీఐ ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)కు పలు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం నుంచి టోల్ ఛార్జీలు చెల్లించడం, డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఇలా అన్నీ రకాల ఆర్ధిక లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశించింది.
ఫిబ్రవరి 29 తర్వాత
ఆర్‌బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 29 లోపు వినియోగదారులు డిపాజిట్లు చేయడంతో పాటు ఇతర సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా? లేదా? అనేది ఆర్‌బీఐ మీద ఆధారపడింది. అప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తున్న విచారణలో లోపాలు తలెత్తితే మాత్రం పేటీఎంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే వినియోగదారులు పేటీఎం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెద్ద ఎత్తున అవకతవకలు
పలు నివేదికల ప్రకారం.. పేటీఎం వినియోగిస్తున్న లక్షల కస్టమర్లకు కేవైసీ లేదు. పైగా మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్స్‌కు ఒకటే పాన్ కార్డ్ ఉండటం మరిన్ని అనుమానాలకు దారి తీసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో దాదాపు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉన్నాయి. ఇందులో, దాదాపు 31 కోట్ల అకౌంట్‌లు పనిచేయడం లేదు. కేవలం 4 కోట్లు మాత్రమే బ్యాలెన్స్ లేదా చిన్న నిల్వలతో నిర్వహణలో ఉన్నాయి. కాబట్టి కేవైసీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇది ఖాతాదారులు, డిపాజిటర్లు, వాలెట్ హోల్డర్లను తీవ్రమైన ప్రమాదానికి గురి చేసిందని ఓ అధికారి పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఆర్‌బీఐ చర్యలకు ఉపక్రమించింది.
2021 నుంచి ఇదే తంతు
పేటీఎం నిబంధనలు ఉల్లంఘించిన కార్యకలాపాలు నిర్వహించడం ఇదేమీ తొలిసారి కాదు. 2021లో ఈ ఫిన్ టెక్ కంపెనీకి ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. పేటీఎంలో అనేక అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది. కేవైసీ లేకపోవడం, మనీల్యాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వెంటనే లోపాల్ని సవరించాలని సూచించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ కస్టమర్లకు సేవలందించారు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. ఇక ఈ లోపాలన్నీ ఆయా బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా పేటీఎంలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు తేలడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
40 శాతం క్షీణించిన షేర్లు
ఆర్‌బీఐ ఆదేశాలతో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు గత రెండు రోజుల్లో 40 శాతం క్షీణించాయి. శుక్రవారం బీఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం నష్టపోయి రూ. 487.05కి చేరుకుంది. రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.17,378.41 కోట్లు తగ్గి రూ.30,931.59 కోట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment