‘ఫిట్‌నెస్’ లేకుంటే క్రిమినల్ కేసే..!
పాఠశాల బస్సుల నియంత్రణకు సర్కారు యోచన
- కఠినంగా వ్యవహరించే దిశగా రవాణా శాఖ అడుగులు
- ప్రస్తుతం పర్మిట్లు, లెసైన్స్ రద్దుతో సరి
- కొత్తగా హెచ్చరిక నోటీసులు జారీకి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఫిట్‌నెస్ లేని పాఠశాల బస్సులను నియంత్రించే క్రమంలో యజమానులపై ఇక క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి వరకూ సాధారణ పెనాల్టీలతోనే సరిపుచ్చుతున్న రవాణా శాఖ కఠిన నిర్ణయాల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్న రవాణా శాఖ అధికారులు ఈసారి పర్మిట్, లెసైన్స్ రద్దు లాంటి కాస్త కఠిన చర్యలకే దిగుతున్నప్పటికీ.. ఇంకా వందల సంఖ్యలో వాహనాలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను రెన్యూవల్ చేసుకోవటం లేదు.
అధికారుల దాడులను సాధారణ బెదిరింపుగానే భావిస్తున్న కొందరు వాహన యజమానులు అంతగా పట్టించుకోవటం లేదు. కండీషన్‌లో లేని పాఠశాల బస్సు ఎక్కడైనా అదుపు తప్పితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నందున దాన్ని తీవ్ర నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఫిట్‌నెస్ రెన్యూవల్ చేయించుకోని వాహనాలకు సంబంధించిన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి అధికారులకు సూచనలు చేయటంతో పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. నోటీసులు జారీ అయిన తర్వాత పట్టుబడితే సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ఫిట్‌నెస్ లేని వాహనాలు 6 వేలకుపైనే..
గత ఏడాది మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ప్రైవేటు పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ప్రమాదం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా క్రమం తప్పకుండా రవాణా శాఖ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. గత సంవత్సరం ముమ్మరంగా తనిఖీలు జరిపి ఫిట్‌నెస్ లేని వాహనాలను జప్తు చేయటంతో ఈసారి యజమానులు జాగ్రత్త పడ్డారు. పాఠశాలలు ప్రారంభం కాకముందు నుంచే ఫిట్‌నెస్ రెన్యూవల్ చేయించుకుంటున్నారు. బడులు తెరిచిన గత నాలుగు రోజుల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు జరుపుతుండటంతో మరికొందరు వచ్చి రెన్యూవల్ చేయించుకుంటున్నారు. గత ఏడాది కంటే ఈసారి దాదాపు 400కుపైగా బస్సులు అదనంగా రెన్యూవల్ చేయించుకోవటం విశేషం. అయినా మరో 6 వేలకుపైగా వాహనాలు జాడ లేకుండా పోయాయి. అంటే అవి ఫిట్‌నెస్ లేనివిగా అధికారులు తేల్చారు. ఇప్పుడు పట్టుబడే వాహనాలకు సంబంధించిన పర్మిట్లు రద్దు చేయటంతోపాటు డ్రైవర్ లెసైన్సులను కూడా రద్దు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇక క్రిమినల్ కేసుల దాఖలుకు సంబంధించి హెచ్చరిక నోటీసులను మరో వారం రోజుల్లో జారీ చేయనున్నారు.