రూ. 10 వేల సాయంపై విధి విధానాలు జారీ | Issued the policies for 10 thousand financial aid to Auto and Cab Drivers | Sakshi
Sakshi News home page

రూ. 10 వేల సాయంపై విధి విధానాలు జారీ

Published Tue, Sep 10 2019 5:40 AM | Last Updated on Tue, Sep 10 2019 10:03 AM

Issued the policies for 10 thousand financial aid to Auto and Cab Drivers - Sakshi

సాక్షి, అమరావతి: ఆటో రిక్షాలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయంపై విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. నేటి (మంగళవారం) నుంచి అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన డ్రైవర్లు తమ వాహనం, లైసెన్సుతో ఆధార్‌ను లింక్‌ చేసుకోవాలి. రవాణా శాఖ వెబ్‌సైట్‌ డేటాబేస్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 15 రోజుల్లోగా నిర్ధిష్టమైన (అన్‌ ఎన్‌కంబర్డ్‌) ఖాతాను తెరవాలి.

ఈ ఖాతాను తెరిచేందుకు లబ్ధిదారుడికి గ్రామ/వార్డు వలంటీర్‌ సాయపడతాడు. ఒక వ్యక్తికి, ఒక వాహనానికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది. దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి గ్రామ సచివాలయం/మున్సిపాలిటీలు/నగర కార్పొరేషన్లకు వెళతాయి. అర్బన్‌ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అనంతరం కలెక్టరు అనుమతి తీసుకుని సీఎఫ్‌ఎంఎస్‌ డేటాబేస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ వివరాల ఆధారంగా రవాణా శాఖ కమిషనర్‌ లబ్ధిదారులకు సమగ్ర బిల్లు అందించేందుకు అనుమతిస్తారు. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటికీ రూ. పది వేల చెల్లింపు రశీదులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని అందిస్తారు.  కాగా, దరఖాస్తులు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్ల పరిశీలన కోసం రవాణా, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

రూ. పది వేల సాయానికి అర్హతలివే..
- ఆటో రిక్షా/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌ సొంతదై ఉండి, సొంతగా నడుపుకోవాలి.
ఆటో రిక్షా/లైట్‌ మోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలి.
సంబంధిత వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, పన్నుల రశీదులు) సరిగా ఉండాలి.
అర్హుడు దారిద్య్ర రేఖకు దిగువన/తెల్లరేషన్‌ కార్డుతో పాటు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement