నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పదు జరిమానా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : మోటారు వాహనాలతో రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాటిని తనిఖీ కోసం ఆపే అధికారం రవాణా శాఖ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. ఆ సమయంలో ఆ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలూ సక్రమంగా ఉండి, వాహన చోదకుడు కూడా సరైన స్థితిలో ఉంటే ఎటువంటి జరిమానా చెల్లించనక్కరలేకుండా హాయిగా వెళ్లవచ్చు. ఒకవేళ వాహనంలో అవసరమైన పత్రాలు లేకపోతే మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీవో, ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే కొన్నిసార్లు తమవద్ద అన్నీ ఉన్నా జరిమానా వేశారంటూ వాహనచోదకులు లబోదిబోమంటూంటారు.
సాధారణంగా వివిధ పత్రాలు లేనందుకు, నిబంధనలు ఉల్లంఘించినందుకు కిందివిధంగా జరిమానా విధిస్తూంటారు. అంతకన్నా అధికంగా వసూలు చేస్తే సదరు అధికారులను ప్రశ్నించవచ్చు.
* మోటారు వాహనాల చట్టం సెక్షన్ 181 ప్రకారం వాహనం నడిపే వ్యక్తికి లెసైన్స్ లేకుంటే రూ.500 జరిమానా విధిస్తారు. అలాగే సెక్షన్ 180 ప్రకారం వాహనం ఇచ్చినందునకు యజమానికి రూ.1000, వాహనం నడపడం రాని కారణంగా సెక్షన్ 184 కింద రూ.1000 మొత్తం రూ.2500 జరిమానా విధించవచ్చు.
* సెక్షన్ 184 ప్రకారం ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.1000 జరిమానా విధిస్తారు.
* రెడ్ సిగ్నల్ దాటి వెళ్తే రూ.1000, వాహనం ఇరువైపులా వస్తువులు తీసుకెళ్తే రూ.1000, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.1000 జరిమానా తప్పదు.
* సెక్షన్ 190 (2) ప్రకారం పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.100, నిషేధ ప్రాంతంలో వాహనం పార్కింగ్ చేస్తే రూ.100, ప్రమాదకరంగా వాహనం పార్కింగ్ చేస్తే రూ.100 జరిమానా విధిస్తారు.
* సెక్షన్ 192 ప్రకారం వాహనం రిజిస్ట్రేషన్ చేయించకుంటే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ జరిమానా తప్పదు.
* సెక్షన్ 196 ప్రకారం వాహనానికి ఇన్సూరెన్స్ చేయించకుంటే రూ.1000 ఫైన్ వేస్తారు.
* సెక్షన్ 177 (4) ప్రకారం ట్యాక్సీ, ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించకుంటే రూ.100 నుంచి రూ.200 వరకూ జరిమానా విధిస్తారు.
* సెక్షన్ 177 (6) ప్రకారం ఆటోలో పరిమితికి మించి {పయాణికులను ఎక్కించుకుంటే రూ.ఒక్కొక్కరికి రూ.100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
* సెక్షన్ 177 (7) ప్రకారం గూడ్స్ క్యారియర్ డ్రైవర్ యూనిఫాం వేసుకోకుంటే రూ.100 నుంచి రూ.200 ఫైన్ విధిస్తారు.
* సెక్షన్ 177 (9) ప్రకారం నంబర్ ప్లేట్ లేకపోయినా, దానిపై ఎటుంటి గుర్తులు ఉన్నా రూ.100 నుంచి రూ.200 జరిమానా వేస్తారు.
* సెక్షన్ 177 (19) ప్రకారం హెల్మెట్ ధరించకుంటే రూ.100 నుంచి రూ.200 వరకూ, సెక్షన్ 177 (20) సీట్‌బెల్ట్ ధరించకుంటే రూ.100 ఫైన్ చెల్లించాలి.
* సెక్షన్ 177 (21) ప్రకారం ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళితే రూ.100 నుంచి రూ.200 వరకూ జరిమానా విధిస్తారు.
* సెక్షన్ 179 (1) ప్రకారం తనిఖీ సమయంలో అధికారులకు ఆటకం కల్పిస్తే రూ.500 జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
* సెక్షన్ 185 (ఎ) ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే చార్జ్‌షీట్ రాసి కోర్టుకు పంపుతారు.