ట్రాఫిక్ విధులకు టాటా..?
- బాధ్యతల నుంచి తప్పుకోనున్న పోలీసు శాఖ
- అమెరికా, బ్రిటన్ మాదిరిగా రవాణా శాఖకు అప్పగించే యోచన
- పోలీసులను పూర్తిగా శాంతిభద్రతల కోణంలోనే ఉపయోగించే ఆలోచన
- ప్రభుత్వానికి అందజేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ విభాగం నుంచి పోలీసులు తప్పుకోనున్నారా..? ఆ వ్యవస్థను మొత్తం రవాణా శాఖ పరిధిలోకి తీసుకెళ్లనున్నారా? దీనికి అవుననే అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా రవాణా శాఖ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. రవాణా శాఖ, ఆర్‌అండ్‌బీకి చెందిన ఇంజనీర్లే ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోనూ ట్రాఫిక్ విభాగాన్ని పూర్తిగా రవాణా శాఖ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈ విధానం ద్వారా రోడ్ల భద్రత, రహదారుల లోపాలు, రోడ్ల మార్కింగ్ వంటి వాటిని రవాణా శాఖ అధికారుల ద్వారా సులభంగా గుర్తించవచ్చు. కనుక ట్రాఫిక్ విధులను రవాణా శాఖకే అప్పగించి.. పోలీసులను పూర్తిగా శాంతిభద్రతలకు సంబంధించిన కోణంలోనే ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసేందుకు డీజీపీ అనురాగ్‌శర్మ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విధివిధానాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.
లోటుపాట్లు తెలిసేది రవాణా శాఖకే..
చిన్న చిన్న రహదారులు మినహా ఒక మోస్తారు నుంచి రహదారుల నిర్మాణాలన్నీ ఆర్‌అండ్‌బీ శాఖనే చేపడుతుంది. డ్రైవింగ్, వాహనాల ఫిట్‌నెస్ వంటి నియమ నిబంధనలన్నీ రవాణా శాఖే నిర్ణయిస్తుంది. అంతేకాదు రహదారుల్లో ఉండే లోపాలను ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ అధికారులే గుర్తిస్తారు. ఈ విభాగాల్లోనే ఇంజనీర్లు, నిఫుణులైన అధికారులు అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా పదే పదే ప్రమాదాలు జరిగే రహదారులను, బాటిల్‌నెక్ వంటి వాటిని గుర్తించి సరిచేయడం ఈ రెండు విభాగాల పరిధిలోనే ఉంటుంది. అలాగే రద్దీగల రహదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలన్నా, దారి మళ్లింపులు చేపట్టాలన్నా అందుకు ఇంజనీరింగ్ నిఫుణులైతేనే సరైన ప్రణాళిక రూపొందించగలరు.
అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్ వంటి చోట్ల ట్రాఫిక్‌ను పూర్తిగా రవాణా శాఖనే పర్యవేక్షిస్తుంది. రహదారుల లోపాలను, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడం వంటివన్నీ అక్కడి ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. సీసీటీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్ వివరాలను రవాణా శాఖ అధికారులే ప్రజలకు చేరవేస్తారు. పోలీసులకు ఏ మాత్రం సంబంధం ఉండదు. రహదారులపై ఏమైన ప్రమాదాలు, శాంతిభద్రతలకు విఘాతం వంటి ఘటనలు చోటు చేసుకుంటేనే పోలీసులు జోక్యం చేసుకుంటారు. అలాంటి విధానాన్ని ఇక్కడ తీసుకురావడం ద్వారా పోలీసు సేవలను శాంతిభద్రతల కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
సిబ్బంది పరిస్థితిపై తర్జనభర్జన..
ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడానికి అవసరమైన సిబ్బంది రవాణా శాఖకు అందుబాటులో లేరు. ఇప్పటికిప్పుడు సిబ్బంది నియామకం చేయాలన్నా కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో రవాణా శాఖ ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు కొత్తగా సిబ్బందిని నియమించాలా లేదా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను బదలాయించాలా? అనేది అధికారులకు అంతుబట్టడం లేదు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులను రవాణా శాఖకు బదిలీ చేస్తే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పోలీసుల క్యాడర్ ర్యాంకు, నియమ నిబంధనలు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. మొత్తం మీద ప్రభుత్వ సలహా తీసుకుని సిబ్బంది విషయంలో ముందుకెళ్లాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.