
వేగాన్ని గాలికొదిలేశారు
► రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నెన్స్ ఏర్పాటు
► నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం
► ఏడాది గడుస్తున్నా జారీ కాని విధివిధానాలు
► కనీసం ఫైల్ ఎక్కడుందో తెలియని అయోమయం
► వాయువేగంతో ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా వాహనాల వేగాన్ని నియంత్రించాలంటూ జారీ చేసిన నోటిఫికేషన్ అటకెక్కింది. వాహనాల గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లకు మించకూడదంటూ గత సంవత్సరం నవంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి అన్ని వాహనాలకు స్పీడ్ గవర్నెన్స్ పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ... రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు దానికి సంబంధించిన మార్గదర్శకాలే జారీ చేయలేదు. అసలు దాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలో తెలుపకపోవడంతోపాటు స్పీడ్ గవర్నెన్స్ పరికరాలు ఎవ రు అమర్చాలి, ఎలా అమర్చాలో స్పష్టం చేయలేదు. దీంతో ఆ కీలక నిర్ణయం కాస్తా ఇక అటకెక్కినట్టేనని స్పష్టమవుతోంది.
నోటిఫికేషన్‌లో ఏముంది?
డంపర్లు, ట్యాంకర్లు, పాఠశాల బస్సులు, ప్రమాదకర రసాయనాలు, వస్తువులు తరలించే వాహనాలకు మాత్రం ఈ వేగ పరిమితి 60 కిలోమీటర్లుగా నిర్ధారించింది. వాహనం తయారీ సమయంలోనే వేగాన్ని అదుపు చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 2015 అక్టోబర్ ఒకటి, ఆ తర్వాత రిజిస్టర్ అయిన వాహనాల్లో ఈ స్పీడ్ గవర్నెన్స్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. అంతకుముందే తయారైన వాహనాలకు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వాటిని అమర్చాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
వీటికి మినహాయింపు
ఈ నిబంధన నుంచి ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, ప్రయాణికులు, వారి వస్తువులు తరలించే నాలుగు చక్రాల వాహనాలు (ఎనిమిది మందికి మించని సామర్థ్యం), ఫైరింజన్లు, అంబులెన్సులు, పోలీసు వాహనాలు, ఇప్పటికే స్పీడ్ గవర్నెన్స్ వ్యవస్థ ఉన్న అన్ని రకాల వాహనాలను మినహాయించారు.
పాలెం ప్రమాదంతో..
రెండేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ప్రైవేట్ బస్సు డివైడర్‌ను ఢీకొని అగ్నికి ఆహుతై 45 నిండు ప్రాణాలు బలి తీసుకున్న ఘటన దేశ చరిత్రలోనే ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాతనే కేంద్రప్రభుత్వం మేల్కొంది. వేగం 80 కి.మీ.కు మించకుండా వాహనాల్లో స్పీడ్ గవర్నెన్స్ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినా గైడ్‌లైన్స్ ఇవ్వటం మరిచిపోయింది.
అసలు ఆ ఫైలు ఎక్కడుందో కూడా తెలియని అయోమయం నెలకొంది. దీంతో నోటిఫికేషన్ తర్వాత ఒక్క అడుగు కూడా పడలేదు. మార్గదర్శకాలు రాకపోవటంతో రవాణాశాఖ చేతులెత్తేసింది. ఇప్పటికీ వాహనాలు వాయువేగంతో దూసుకెళ్తూ ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. వాహన సంఘాల ఒత్తిడికి తలొగ్గటం వల్లనే ఈ జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.