
ఇక సర్కారీ డ్రైవింగ్ స్కూళ్లు
పరిశోధన సంస్థలు కూడా... కేంద్రం నిధులతో ఏర్పాటు
మొదటి దశలో హైదరాబాద్‌తో పాటు మరో మూడు జిల్లాల్లో
కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రవాణా శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పాటు డ్రైవింగ్ లోపాలపై రవాణా శాఖ దృష్టి కేంద్రీకరించింది. కేంద్రం సహాయంతో ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన సంస్థల (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, ఐడీటీఆర్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో రూ.25 కోట్ల వ్యయంతో ఐడీటీఆర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలి పిన నేపథ్యంలో అలాంటి కేంద్రాలను రాష్ట్రం లోని ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని రవాణాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఐదెకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో ఐడీటీఆర్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని కోరారు. దేశవ్యాప్తంగా డ్రైవింగ్ ప్రమాణాలు, నైపుణ్యాలను పెంపొందించి రోడ్డు ప్రమాదాలను అరిక ట్టాలనే లక్ష్యంతో కేంద్రం రహదారి భద్రతా బిల్లును రూపొందించింది. దీనికనుగుణంగా ఐటీడీఆర్‌లపై ప్రధానంగా దృష్టి సారించినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. సకాలంలో కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే స్థల సేకరణ, భవనాలు, ట్రాక్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
దశలవారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో...
మొదట హైదరాబాద్‌లోని నాగోల్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్లగొండ జిల్లా సూర్యాపేట, మెదక్ జిల్లా సిద్దిపేటలో ప్రాంతీయ ఐడీటీఆర్‌లను ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత దశలవారీగా మిగతా జిల్లాలకు విస్తరిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించే ఈ శిక్షణ సంస్థల్లో విశాలమైన డ్రైవింగ్ ట్రాక్‌లు, తరగతి గదులు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. లాభాపేక్ష లేకుండా నామమాత్రపు ఫీజులు చెల్లించి డ్రైవింగ్ నేర్చుకొనేలా ఈ సంస్థల నిర్వహణ ఉంటుంది. పేరెన్నికగన్న ఆటోమోబైల్ కంపెనీలకు శిక్షణ బాధ్యతలను అప్పగిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మారుతి మోటార్స్ అలాంటి శాస్త్రీయమైన శిక్షణనిస్తోంది. అలాగే సిరిసిల్ల ఐడీటీఆర్‌ను అశోక్‌లేలాండ్‌కు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నాగోల్‌లోని ఆర్టీఏ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో ప్రయోగాత్మకంగా ఐడీటీఆర్‌ను అభివృద్ధి చేసి అదే తరహాలో మిగతా చోట్ల ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక శిక్షణతో మహిళా డ్రైవర్‌లనూ ప్రోత్సహిస్తారు.