
ప్రాణాలు కాపాడలేని ‘కళ్లెం’!
♦ కొరగాకుండా వేగ నియంత్రణ ఉత్తర్వులు
♦ కీలక వాహనాలను విస్మరించిన వైనం
♦ ఫలితాలు ఉండవంటున్న పోలీసు అధికారులు
సాక్షి, హైదరాబాద్: ‘పెత్తనం ఒకరి చేతిలో.. బెత్తం మరొకరి చేతిలో..’ అంటే ఇదేనేమో! నిత్యం రహదారులపై ఉంటూ రోడ్డు ప్రమాదాలను పర్యవేక్షిస్తూ, కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టేది పోలీసు విభాగమైతే... రోడ్డు ప్రమాదాల నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారం మాత్రం రవాణా శాఖ చేతుల్లో ఉంది. ఈ కారణంగానే వాస్తవాలకు దూరంగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం వాహనాల వేగానికి కళ్లెం వేస్తూ తాజాగా విడుదల చేసిన స్పీడ్ గవర్నర్ (వేగనియంత్రణ పరికరం) జీవో క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రమాదాల నిరోధం కోణంలో ఒరిగేదేమీ లేదని పోలీసులు పెదవి విరుస్తున్నారు.
ఇదీ జీవో స్వరూపం
ఈ జీవో ప్రకారం ట్రావెల్స్ బస్సులు వంటి వాహనాలు గంటకు గరిష్టంగా 80 కి.మీ., డం పర్లు, ట్యాంకర్లు, పాఠశాల బస్సులు, ప్రమాదకర రసాయనాలు, వస్తువులు తరలించే వాహనాలు 60 కి.మీ. వేగాన్ని దాటకూడదు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఈ నిబంధనల నుంచి ఫైర్ టెండర్స్ (ఫైరింజిన్లు), అంబులెన్సులు, పోలీసు వాహనాలతో పాటు ద్విచక్రవాహనాలు, మూడు చక్రాల వాహనాలు, ప్రయాణికులు, వారి వస్తువులు తరలించే నాలుగు చక్రాల (తేలికపాటి) వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ ఉత్తర్వులు క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోకుండా, కేవలం జాతీయ రహదారుల్ని మాత్రమే దృష్టి లో పెట్టుకుని జారీ చేసినట్లు ఉందని పోలీసులు చెబుతున్నారు.
వాటివల్లే ప్రమాదాలు అధికం
రాష్ట్రంలో 53.63 శాతం ప్రమాదాలు ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాల వల్లే జరిగినట్లు స్పష్టవుతోంది. మృతులు, క్షతగాత్రుల విషయాన్ని తీసుకున్నా... మొత్తం సంఖ్యలో ఈ కేటగిరీలకు చెందిన వాహన ప్రమాదాల్లో 52.52 శాతం మంది క్షతగాత్రులు కాగా.. 43.16 శాతం మంది మృతులుగా ఉన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్‌లతో పాటు వరంగల్ తదితర నగరాలు, పట్టణాల్లోనూ వీటివల్ల జరిగే ప్రమాదాలే ఎక్కుగా నమోదవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులపై జరిగినవి 43.23 శాతం మాత్రమే. మిగిలినవి ఇతర రోడ్లలోనే చోటు చేసుకున్నాయి.
అమలు ఎలా?
వేగ నియంత్రణ ఉత్తర్వుల్ని జారీ చేయడం వరకు సజావుగానే ఉన్నా వీటిని అమలు చేయడంలోనే అసలు సమస్యలు వస్తాయని అధికారులు చెప్తున్నారు. ఓ వాహనం ఏ వేగంతో వెళ్తున్నదో గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని అంటున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలంటే స్పీడ్ లేజర్ గన్స్ వంటి ఉపకరణాలతో పాటు జాతీయ/రాష్ట్ర రహదారుల్లో తనిఖీలు చేయడానికి ఇతర పరికరాలు అవసరమని స్పష్టం చేస్తున్నారు. వీటిని సమకూర్చడంతో పాటు అవసరమైన స్థాయిలో సిబ్బందిని కేటాయిస్తేనే జీవో జారీ ఉద్దేశం నెరవేరుతుందని పేర్కొంటున్నారు. కేవలం హైదరాబాద్, సైబరాబాద్‌ల్లోనే కాస్త ఎక్కువ సంఖ్యలో, మిగిలిన చోట్ల పరిమిత సంఖ్యలో స్పీడ్ లేజర్ గన్స్ అందుబాటులో ఉన్నాయి.