స్పీడ్ బ్రేకర్లు తొలగించండి
హైవేలపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: జాతీయరహదారులపై ఉన్న అన్ని స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాలను, ఎన్‌హెచ్‌ఏఐ, పీడబ్ల్యూడీ వంటి నిర్వహణ సంస్థలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆదేశాలు జారీచేసింది. భద్రత కోసం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాట్లు చేస్తున్నా.. రవాణా సజావుగా సాగేందుకు అవి ఇబ్బందికరంగా మారాయని పేర్కొంది.
వాటి తొలగింపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వచ్చే బుధవారం లోగా చెప్పాలని, డ్రైవర్లకు వేగాన్ని తగ్గించాలని సూచించే ఇనుప వరుసల(రంబల్ స్ట్రిప్స్) వివరాలను అందించాలని ఆదేశించింది. స్పీడ్ బ్రేకర్లు పెట్టకూడదన్న నిబంధనలు ఉన్నా వేగాన్ని అడ్డుకునేందుకు స్థానిక యంత్రాంగం వీటిని నిర్మిస్తున్నాయంది. ‘రవాణా సక్రమంగా సాగేందుకే హైవేలున్నాయి. స్పీడ్‌బ్రేకర్లు వాహనాలకు అడ్డంకిగా మారడంతో పాటు ప్రమాదాలకు కారణ మవుతున్నాయి’ అని పేర్కొంది. 2014 నాటిలెక్కల ప్రకారం స్పీడ్‌బ్రేకర్ల వల్ల జరిగిన ప్రమాదాల్లో 4,726 మంది చనిపోయారు.