జిల్లాపై వరాల జల్లు | Gifts to the district | Sakshi
Sakshi News home page

జిల్లాపై వరాల జల్లు

Published Thu, Jun 23 2016 4:42 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

జిల్లాపై వరాల జల్లు - Sakshi

జిల్లాపై వరాల జల్లు

- రామాయపట్నం పోర్టు కోసం కృషి..   ట్రిపుల్ ఐటీ ఈ ఏడాదే మొదలు
- కనిగిరికి నిమ్జ్.. దొనకొండలో ఇండస్ట్రియల్ ఎస్టేట్..    ఒంగోలు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- పాత హామీలనే మళ్లీ వల్లెవేసిన వైనం..    రైతులకు రెండో విడత రుణవిముక్తి పత్రాలు పంపిణీ
 
 ఒంగోలు సభలో రుణమాఫీ రెండు వసంతాల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు ప్రత్తిపాటి, శిద్దా, రావెల, ఎమ్మెల్సీ మాగుంట, ఎమ్మెల్యేలు జనార్దన్, బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ సుజాతశర్మ తదితరులు
 
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. బుధవారం ఒంగోలులో జరిగిన రెండో విడత రైతు రుణవిముక్తి పత్రాల పంపిణీ సభలో గతంలో జిల్లాకు ఇచ్చిన హామీలనే మరోమారు వల్లెవేశారు. నేతలు అడిగిన పనులన్నీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆశించిన మేర జనం సభకు రాకపోవడంతో ముఖ్యమంత్రి షెడ్యూలును మార్చారు. 2.15 గంటలకే సీఎం హెలిప్యాడ్‌కు చేరుకోవాల్సి ఉండగా గంట ఆలస్యంగా 3.10 గంటలకు చేరుకున్నారు. ముందుగా 150 ఏళ్ల వేడుకలు జరుపుకొంటున్న జేఎంజీ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఒంగోలు తాగునీటి పథకానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. సాయంత్రం 4 గంటలకు మినీస్టేడియూనికి వచ్చిన సీఎం పది నిమిషాల పాటు అక్కడ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం ఐదుగురు  రైతులతో ముఖాముఖి మాట్లాడారు.  

 సుందర నగరంగా ఒంగోలు..
 ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. చిరకాల వాంఛ అయిన రామాయపట్నం పోర్టును సాధించేందుకు కృషి చేస్తానన్నారు. పోర్టు వస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. మైనింగ్ యూనివర్సిటీ (అటానమస్) తెస్తామని,  ట్రిపుల్ ఐటీ పనులు ఈ ఏడాదే మొదలుపెడుతున్నామని సీఎం చెప్పారు. దీని కోసం భూములు డి-నోటిఫై చేస్తామన్నారు. ఒంగోలును ఆర్‌డీవో కేంద్రంగా చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

 వెలిగొండను త్వరితగతిన పూర్తిచేస్తాం..
 కనిగిరి ప్రాంతానికి నిమ్జ్, దొనకొండకు ఇండస్ట్రీయల్‌ఎస్టేట్ వస్తుందని సీఎం ప్రకటించారు. అమరావతి టు బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే చేస్తామన్నారు. గిద్దలూరు నుంచి అటు అనంతపురం, ఇటు కడప, కర్నూలుకు ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించనున్నట్లు, సోమరాజు కాలువ ఫేజ్-2కు రూ.80 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒంగోలు మార్కెట్‌యార్డులో
 
 రైతు భవన్‌ను నిర్మిస్తామని, సోమరాజు-పోతురాజుకాలువ పరిధిలో ఇళ్లు కోల్పోతున్న 350 మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీటిని అందిస్తామన్నారు. రుణమాఫీ కింద ప్రకాశం జిల్లాకు మొదటి విడతలో రూ.602 కోట్లు, రెండో విడతలో రూ.348 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది నాటికి వెలిగొండకు నీరు తెచ్చేలా కృషి చేస్తామన్నారు. నాగార్జున సాగర్ కుడికాలువను ఆధునీకరించి 4.50 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని వెల్లడించారు.

 కొత్త ఎమ్మెల్యేలకు స్వాగతం..
 అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకే కొత్తగా ఎమ్మెల్యేలు పార్టీలో చేరారని చంద్రబాబు పేర్కొన్నారు. వారికి పార్టీ ఘనస్వాగతం పలికిందన్నారు. జిల్లా ప్రజలందరూ కొత్త ఎమ్మెల్యేలకు స్వాగతం పలకాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు, జిల్లాకు చెందిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు, కదిరి బాబూరావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, పాలపర్తి డేవిడ్‌రాజు, ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ శాసనసభ్యులు బి.ఎన్.విజయకుమార్, అన్నా రాంబాబు, కరణం బలరాం, దివి శివరాం, కందుల నారాయణరెడ్డి, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్, చీరాల టీడీపీ నాయకురాలు పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.  

 అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..సీఎంపై మంత్రుల పొగడ్తలు జల్లు
 ఒంగోలు: రుణ విముక్తి పత్రాల పంపిణీ సభలో మంత్రులు మాట్లాడుతూ సీఎంపై పొగడ్తల జల్లు కురిపించారు. వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి రాష్ట్రంలో రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర చంద్రబాబునాయుడిదన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రైతు కంట తడి పెడితే అశుభం అని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుకాగానే రుణమాఫీకి శ్రీకారం చుట్టారని, ఒక వైపు కష్టాలు వెన్నాడుతున్నా ఆడిన మాట తప్పరాదనే భావనతో రుణమాఫీ చేశారని చెప్పారు. రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోప్రకటించిన రుణమాఫీ రాష్ట్ర విభజన కారణంగా భారంగా మారిందని, అరుునా అడ్డంకులను అధిగమించి ఒక్క ప్రకాశం జిల్లాలోనే రూ.600.2 కోట్లు రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. ఈ దశలో అమరావతి అభివృద్దికి ప్రజలు కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్దిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించారని మంత్రి చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement