అవినీతి ఆర్జన రూ.వందల కోట్లలో..
♦ తవ్వేకొద్దీ బయటపడుతున్న డీటీసీ మోహన్ అక్రమ ఆస్తులు
♦ మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్/కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ (డీటీసీ) ఆదిమూలం మోహన్ నివాసం, ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో రూ.వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు వెలుగు చూస్తున్నారుు. కాకినాడలోని డీటీసీ ఇంటితో సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో తొమ్మిదిచోట్ల గురువారం ఉదయం నుంచి నిర్వహిస్తున్న దాడుల్లో రూ.వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
మోహన్ బంధువులు, బినామీల వివరాలను సేకరిస్తున్నామని, బ్యాంకు బ్యాలెన్స్‌లను తనిఖీ చేసి, లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఏసీబీ అధికారులు కాకినాడలోని డీటీసీ కార్యాలయంలో శుక్రవారం పలువురిని ప్రశ్నించి, మోహన్‌కు సంబంధించిన మరికొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. అతడి బంధువులు, స్నేహితుల వివరాలను ఇప్పటికే సేకరించిన అధికారులు వారి ఇళ్లపైనా దాడులు చేయనున్నట్లు తెలిసింది. దాడుల్లో భారీగా నగదు, బంగారం, వెండి వస్తువులు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, వ్యవసాయ భూ ములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి విలువను లెక్కకట్టే పనిలో ఉన్నారు.
హైదరాబాద్‌లో ఆస్తులు రూ.100 కోట్లకుపైనే
మోహన్‌కు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విలువే రూ.100 కోట్లు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అతడికి చిత్తూరు, నెల్లూరు, బళ్లారిల్లోనూ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో కుమార్తె పేరుతో ఉన్న ఐదు బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల విలువ కూడా రూ.కోట్లలోనే ఉంటుందంటున్నారు. హైదరాబాద్, కడప, బళ్లారి, అనంతపురం, విజయవాడ, ప్రొద్దుటూరు, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో దాడులు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంకా దాడులు కొనసాగుతున్నందున ఆస్తులపై పూర్తి సమాచారం ఇప్పుడే చెప్పలేమని అధికారులు అంటున్నారు. మోహన్‌కు సంబంధించిన ఆస్తుల, బినామీల వివరాలు ఏమైనా తెలిస్తే ఏసీబీ డీఎస్పీ కె.రమాదేవి, సెల్ నంబర్ 8332971044కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు.
మోహన్ ఆదాయం నెలకు రూ.3 కోట్లు!
తూర్పుగోదావరి జిల్లా డీటీసీ ఆదిమూలం మోహన్ రూ.వందల కోట్ల అవినీతి పాల్పడినట్లు తేలడంతో ఏసీబీ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మోహన్ అనంతపురం, చిత్తూరు, కరీంనగర్, విజయవాడ, ఏలూరుల్లో రవాణా శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు. పనిచేసిన ప్రతి జిల్లాలో రూ.కోట్లు ఆర్జించారనే ఆరోపణలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన అవినీతి పెచ్చుమీరింది. కాకినాడ పోర్టుకు వెళ్లే ప్రతి లారీ నుంచి రవాణా శాఖ అధికారులు రూ.వెయ్యి వసూలును తప్పనిసరి చేశారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకుండా అధిక లోడుతో వెయ్యికి పైగా లారీలు పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. వీటికి సంబంధించి రోజుకు రూ.10 లక్షల చొప్పున నెలకు రూ.3 కోట్లు మోహన్‌కు ముడుపులు అందుతున్నాయని, చెక్‌పోస్టుల నుంచి రోజువారీ రూ.లక్ష వరకు అందుతున్నట్లు సమాచారం.