డీటీసీ వెనుక ఓ ఐఏఎస్?
♦ బయట పడుతున్న అక్రమ ఆస్తుల్లో మెజార్టీ ఆయనవేనా?
♦ అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు
♦ పక్కా ఆధారాల కోసం అన్వేషణ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏసీబీ దాడుల్లో పట్టుబడిన కాకినాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(డీటీసీ) మోహన్ వెనుక ఓ ఐఏఎస్ అధికారి ఉన్నారా? పట్టుబడిన ఈ అక్రమాస్తులో సింహభాగం సదరు ఐఏఎస్ అధికారివేనా? మోహన్ ఆయనకు బినామీగా వ్యవహరిస్తున్నారా? ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారా? అనే ప్రశ్నలకు విశ్వసనీయవర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మరిన్ని పక్కా ఆధారాల కోసం ఏసీబీ అన్వేషిస్తున్నట్టు తెలిసింది. రూ.800 కోట్లకుపైగా అక్రమాస్తులు సంపాదించిన డీటీసీతో సదరు ఐఏఎస్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్టు సమాచారం. పక్కా ఆధారాలు దొరికిన మరుక్షణం సదరు ఐఏఎస్ అధికారిని విచారించేందుకు అనుమతి కోసం ప్రభుత్వాన్ని కోరే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
ఇద్దరూ ఇంజనీరింగ్ క్లాస్‌మేట్స్!
డీటీసీ మోహన్‌కు సదరు ఐఏఎస్‌కు కళాశాల చదువు నుంచే పరిచయం అని తెలుస్తోంది. ఇద్దరూ ఇంజనీరింగ్ విద్య చదివే సమయంలో క్లాస్‌మేట్స్ అని సమాచారం. అప్పటి స్నేహమే ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్టు సమాచారం. అనేక సంవత్సరాలుగా ఒకే శాఖలో ఉంటూ.. రాష్ట్ర విభజన తర్వాత అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు అధికారిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పనిలోనూ ఆయనకు వాటా అందుతోందనే ఆరోపణలు ఉన్నాయి. డీటీసీ నెలకొల్పిన పలు సంస్థల్లోనూ ఈయనకు వాటా ఉందనే అనుమానాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆధారాల కోసం ఏసీబీ అన్వేషిస్తోందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మోహన్ నెలకొల్పిన 6 కంపెనీల వివరాలను కూడా ఏసీబీ సేకరిస్తోంది. తేజ బయో ఫ్యూయల్స్, తేజ అండ్ తేజశ్రీ డెవలపర్, సాయి దివ్య డెవలపర్స్, మెర్క్ మినరల్స్, రోజాలిన్ రాక్స్ అండ్ మినరల్స్, టిట్లే పేర్లతో నెలకొల్పిన కంపెనీలకు ఎక్కడెక్కడ కాంట్రాక్టులు దక్కాయి? అవి ఎవరి ప్రోద్భలంతో దక్కాయనే కోణంలో ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. డీటీసీ మోహన్ అక్రమ సంపాదన తవ్వేకొద్దీ పెరుగుతూ రూ.1,000 కోట్లకు చేరుకుంది. ఇక ఆయన నెలకొల్పిన వివిధ సంస్థలకు చెందిన ఆస్తులను కూడా లెక్కిస్తే.. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంత ఆస్తి మోహన్ కేవలం డీటీసీగానే సంపాదించడం సాధ్యం కాదని, ఈ వ్యవహారంలో మరిన్ని కొత్త కోణాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం.