DTC Mohan
-
డీటీసీ వెనుక ఓ ఐఏఎస్?
♦ బయట పడుతున్న అక్రమ ఆస్తుల్లో మెజార్టీ ఆయనవేనా? ♦ అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు ♦ పక్కా ఆధారాల కోసం అన్వేషణ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏసీబీ దాడుల్లో పట్టుబడిన కాకినాడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ) మోహన్ వెనుక ఓ ఐఏఎస్ అధికారి ఉన్నారా? పట్టుబడిన ఈ అక్రమాస్తులో సింహభాగం సదరు ఐఏఎస్ అధికారివేనా? మోహన్ ఆయనకు బినామీగా వ్యవహరిస్తున్నారా? ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారా? అనే ప్రశ్నలకు విశ్వసనీయవర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మరిన్ని పక్కా ఆధారాల కోసం ఏసీబీ అన్వేషిస్తున్నట్టు తెలిసింది. రూ.800 కోట్లకుపైగా అక్రమాస్తులు సంపాదించిన డీటీసీతో సదరు ఐఏఎస్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్టు సమాచారం. పక్కా ఆధారాలు దొరికిన మరుక్షణం సదరు ఐఏఎస్ అధికారిని విచారించేందుకు అనుమతి కోసం ప్రభుత్వాన్ని కోరే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇద్దరూ ఇంజనీరింగ్ క్లాస్మేట్స్! డీటీసీ మోహన్‌కు సదరు ఐఏఎస్‌కు కళాశాల చదువు నుంచే పరిచయం అని తెలుస్తోంది. ఇద్దరూ ఇంజనీరింగ్ విద్య చదివే సమయంలో క్లాస్మేట్స్ అని సమాచారం. అప్పటి స్నేహమే ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్టు సమాచారం. అనేక సంవత్సరాలుగా ఒకే శాఖలో ఉంటూ.. రాష్ట్ర విభజన తర్వాత అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు అధికారిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పనిలోనూ ఆయనకు వాటా అందుతోందనే ఆరోపణలు ఉన్నాయి. డీటీసీ నెలకొల్పిన పలు సంస్థల్లోనూ ఈయనకు వాటా ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆధారాల కోసం ఏసీబీ అన్వేషిస్తోందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మోహన్ నెలకొల్పిన 6 కంపెనీల వివరాలను కూడా ఏసీబీ సేకరిస్తోంది. తేజ బయో ఫ్యూయల్స్, తేజ అండ్ తేజశ్రీ డెవలపర్, సాయి దివ్య డెవలపర్స్, మెర్క్ మినరల్స్, రోజాలిన్ రాక్స్ అండ్ మినరల్స్, టిట్లే పేర్లతో నెలకొల్పిన కంపెనీలకు ఎక్కడెక్కడ కాంట్రాక్టులు దక్కాయి? అవి ఎవరి ప్రోద్భలంతో దక్కాయనే కోణంలో ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. డీటీసీ మోహన్ అక్రమ సంపాదన తవ్వేకొద్దీ పెరుగుతూ రూ.1,000 కోట్లకు చేరుకుంది. ఇక ఆయన నెలకొల్పిన వివిధ సంస్థలకు చెందిన ఆస్తులను కూడా లెక్కిస్తే.. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంత ఆస్తి మోహన్ కేవలం డీటీసీగానే సంపాదించడం సాధ్యం కాదని, ఈ వ్యవహారంలో మరిన్ని కొత్త కోణాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం. -
దోపిడీకి దారులెన్నో..
శాఖోపశాఖలుగా విస్తరించిన డీటీసీ మోహన్ అవినీతి చెక్ పోస్ట్ నుంచి స్కూల్ బస్సుల వరకూ దండుడు దందా ప్రతి నెలా అక్రమార్జన రూ.కోటిన్నర పైమాటే రోజువారీ, నెలవారీ మామూళ్లు ఎక్కడ పని చేసినా ఇదే తీరు వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన రవాణా శాఖ కాకినాడ ఉప కమిషనర్ (డీటీసీ) ఆదిమూలం మోహన్ అవినీతి దందా రాష్ట్రవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించింది. డబ్బు దండుకోవడానికి గల ఏ మార్గాన్నీ ఆయన విడిచి పెట్టలేదు. డీటీసీగా ఏ జిల్లాలో పనిచేస్తే అక్కడ ఆస్తులు గడించారు. గత ఏడాదిన్నరగా కాకినాడ డీటీసీగా పని చేస్తున్న ఆయన ఆస్తులపై మూడురోజులుగా జరుగుతున్న దాడుల్లో అవినీతి బాగోతాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎంత తక్కువ లెక్కేసినా డీటీసీ మోహన్ అక్రమార్జన నెలకు ఒకటిన్నర కోట్ల పైమాటేనంటున్నారు. - సాక్షి ప్రతినిధి, కాకినాడ డీటీసీ మోహన్‌కు కాకినాడ, వాకలపూడి, అమలాపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న లారీ యూనియన్ల నుంచి నెల వారీగా రూ.50 లక్షలకు తక్కువ కాకుండా ముడుపులు ముట్టచెప్పే వారని లెక్కలేస్తున్నారు. జిల్లా కేంద్రం కాకినాడ ఉప రవాణాశాఖ కార్యాలయం పరిధిలో ప్రధానంగా తునికి సమీపాన ఉన్న తేటగుంట చెక్‌పోస్టుతో పాటు కత్తిపూడి, రాజమండ్రి, అమలాపురం, మండపేట తదితర ప్రాంతాల్లోని రవాణాశాఖ స్థానిక కార్యాలయాల నుంచి నెలనెలా ముక్కుపిండి మామూళ్లు రాబట్టారని ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తేటగుంట వద్ద ఉన్న చెక్‌పోస్ట్, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కాకినాడ పోర్టు మీదుగా జరిగే సరుకు రవాణా లారీలు, ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, కాకినాడ నుంచి పొరుగు రాష్ట్రాలకు పామాయిల్ రవాణా చేసే ట్యాంకర్లు.. ఇలా వీటన్నింటినీ అక్రమార్జనకు మార్గాలుగా ఎంచుకున్నారు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను నిలుపుదల చేసి అపరాధ రుసుం వసూలు చేయడం తేటగుంట చెక్‌పోస్టు ప్రధాన విధి. ఈ చెక్‌పోస్టు మీదుగా ప్రతి రోజూ సుమారు ఎమినిదివేల భారీ వాహనాలు వెళుతుంటాయి. ఈ వాహనాల ద్వారా రోజుకు అధికారికంగా రూ.3 లక్షల ఆదాయం ప్రభుత్వానికి జమ అవుతోంది. అక్రమంగా ఆర్జించేది ఇంతకు రెట్టింపు ఉంటుందని అంచనా. ఇందులో ప్రధాన వాటా డీటీసీకి ఏరోజుకారోజు సాయంత్రానికే అందేదని ఆయన కార్యాలయ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. తేటగుంట తనిఖీ కేంద్రంలో ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలపై మూడు వేల నుంచి ఐదువేలు అపరాధరుసుం వసూలు చేయాలి. ఒక వాహనం నుంచి రెండు, మూడు పర్యాయాలు ఓవర్‌లోడ్ కారణంగా అపరాధ రుసుం వసూలైనట్టు రికార్డు అయితే ఆ వాహన యజమానికి రకరకాల ఇబ్బందులు తప్పవు. ఈ కారణంగా వాహన నిర్వాహకులు అనధికారికంగా రెండువేలు చేతిలో పెట్టి వెళ్లిపోతుంటారు. ఈ ఆదాయంలో సగం వాటా డీటీసీ జేబులో పడుతుంది. ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు నడిపే విద్యార్థుల బస్సులను కూడా డీటీసీ అక్రమార్జనకు మరో మార్గంగా ఎంచుకున్నారు. చిన్న చిన్న యాజమాన్యాలైతే ఒక బస్సు సామర్థ్య పరీక్షకు రూ.50 వేలకు తక్కువ కాకుండా ఇచ్చుకునేవి. అదే కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలైతే గంపగుత్త బేరంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ముట్టచెప్పేవని చెబుతున్నారు. నల్లధనం తెలుపు చేసుకునేందుకే బినామీ సంస్థలు వివిధ మార్గాల్లో కూడబెట్టిన నల్లడబ్బును ‘తెలుపు’ చేసుకునేందుకే డీటీసీ మోహన్ వివిధ ప్రాంతాల్లో తేజ బయో ఫ్యూయల్స్ ప్రైవేటు లిమిటెడ్, తేజ అండ్ తేజశ్రీ డెవలపర్స్, సాయి దివ్య డెవలపర్స్, మెర్క్ మినరల్ ప్రైవేటు లిమిటెడ్, రోజాలిన్ రాక్స్ అండ్ మైన్స్ ప్రైవేటు లిమిటెడ్..ఇలా బినామీ పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేశారు. అలాంటి వాటి ఆరా తీయడంలో ఇప్పటికే ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఒక బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆ పేర్లతో కంపెనీలు లేకపోగా విలువైన భూములు మాత్రం ఉన్నాయని గుర్తించారు. ఇలా ఏ ఒక్క మార్గాన్ని కూడా విడిచి పెట్టకుండా కోట్లు కొల్లగొట్టిన ఆదిమూలం మోహన్ ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా నిలిచారు. నెల్లూరులో కొనసాగుతున్న సోదాలు నెల్లూరు క్రైం : డీటీపీ మోహన్ అక్రమ ఆస్తులను గుర్తించేందుకు నెల్లూరు జిల్లాలోనూ సోదాలు జరుగుతున్నారుు. ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం మోహన్ ఆస్తులు, బినామీలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మోహన్ 2003 నుంచి 2005 వరకు, 2013 నుంచి 2014 అక్టోబర్ వరకు జిల్లాలో ఆర్టీఓగా, డీటీసీ పని చేశారు. ఆ సమయంలో వింజమూరులో 8 ఎకరాలు, వరికుంటపాడు మండలంలో 45 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌కు చెందిన మద్యం వ్యాపారి మల్లికార్జున డీటీసీకి బినామీగా వ్యవహరించారు. డీటీసీ అక్రమ సంపాదనలో అధిక భాగం మద్యం వ్యాపారం, రియల్ ఎస్టేట్‌లో పెట్టి భారీ లాభాలు ఆర్జించినట్లు తెలిసింది. మల్లికార్జున నివాసముంటున్న మాగుంట లేఅవుట్లోని పిచ్చిరెడ్డి కల్యాణమంటపం సమీపంలోగల ధీరజ్ అపార్ట్‌మెంట్‌కు శనివారం ఏసీబీ అధికారులు వెళ్లారు. అయితే ఆయన కొంతకాలంగా కుమారుల చదువుల నిమిత్తం విజయవాడలో ఉన్నట్లు తెలియడంతో అధికారులు అక్కడకు వెళ్లినట్లు సమాచారం. కాగా మోహన్ హయాంలో అకౌంటెంట్‌గా శ్రీనివాసులు, హోంగార్డు ఏడుకొండలు అవినీతి వ్యవహారాల్లో చక్రం తిప్పారని ఫిర్యాదులందడంతో శనివారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయూనికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసులు, ఏడుకొండలు ఇళ్లలో సోదాలు చేశారు. -
డీటీసీ అవినీతిలో ‘అధికార’ వాటా
♦ ఏపీ అధికార పార్టీ నేతల అండతోనే మోహన్ అవినీతి ♦ మోహన్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆదిమూలం మోహన్ అవినీతిలో ఏపీ అధికార పార్టీ నేతలకు భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ అధికార పార్టీ నేతల అండతోనే మోహన్ అవినీతి వ్యవహారాలు సాగించినట్లు రవాణా శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది రవాణా శాఖ బదిలీల సమయంలో మోహన్‌కు తూర్పు గోదావరి జిల్లాలో డీటీసీగా పోస్టింగ్ ఇప్పించేందుకు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఉన్నత స్థాయిలో పట్టుబట్టి మరీ మోహన్‌కు పోస్టింగ్ ఇప్పించారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్న ఓ మంత్రి రవాణా శాఖ పోస్టింగుల్లో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. 8మంది రవాణా అధికారులకు పోస్టింగుల కోసం రూ.5 కోట్లు వసూలు చేశారు. మోహన్‌కు డీటీసీగా పోస్టింగ్ ఇప్పించినందుకు ప్రతిఫలంగా ఏపీ అధికార పార్టీ నేతలకు, పార్టీ కార్యక్రమాలకు ఇతోధికంగా సాయమందించారన్న ఆరోపణలున్నాయి. మోహన్ అవినీతిలో పలువురు ఎమ్మెల్యేలు వాటాలు పొందినట్లు తెలుస్తోంది. చివరకు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన మోహన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా లో పలు విద్యాసంస్థలు, అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు, సెటిల్మెంట్లలోనూ అధికార పార్టీ నేతలకు వాటాలున్నాయి. రవాణా శాఖ బదిలీల్లోనూ మోహన్ పైరవీలు మోహన్ పనిచేసిన జిల్లాల్లో రవాణా శాఖ బదిలీలు, పదోన్నతులలో పెద్ద ఎత్తున పైరవీలు సాగించినట్లు రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎంవీఐ పోస్టుకు రూ.15 నుంచి రూ.20 లక్షలు, ఏఎంవీఐ పదోన్నతులకు భారీగా సొంత శాఖ అధికారుల నుంచే రూ.కోట్లలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. పోస్టింగులు, గతంలో రవాణాశాఖలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిని అడ్డుపెట్టుకుని పదోన్నతుల్లో మోహన్ తన దందా సాగించారు. సదరు ఉన్నతాధికారి అప్పట్లో విమానాశ్రయంలో భారీ నగదుతో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఏసీబీ దాడుల్లో చిక్కిన రవాణా అధికారులకు పోస్టింగులిప్పించడంలోనూ, విచారణను ఉపసంహరించడంలోనూ ఉన్నత స్థాయిలో చక్రం తిప్పిన మోహన్ ఇప్పుడు తనపై కేసునుంచి ఏ విధంగా బయటపడతారో.. అన్న వ్యాఖ్యలు సొంత శాఖ అధికారులు వ్యక్తం చేయడం గమనార్హం. డీటీసీ మోహన్ అవినీతి స్టైల్ ఇదీ.. చెక్‌పోస్టుల్లో టేబుల్ కలెక్షన్ల పేరిట రవాణా శాఖ అధికారులు ప్రతి రోజూ రూ.లక్షల్లో బహిరంగంగానే ముడుపులు స్వీకరిస్తారు. ఈ కలెక్షన్లన్నీ తనకే చెందాలని అధికారులను బెదిరించడం మోహన్ నైజం. నెల్లూరు జిల్లాలో పనిచేసిన సమయంలో టార్గెట్లు విధించి మరీ వసూళ్లు చేసేవారని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాకినాడ పోర్టు నుంచి రవాణా జరిగే సరుకు లారీల నుంచి, లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంకర్ల అసోసియేషన్లతో సెటిల్మెంట్లు రివాజుగా మారాయి. ఏదైనా వాహనం పట్టుబడితే జరిమానా కట్టాలి. ఈ జరిమానా మొత్తాన్ని రెండుగా విభజించి వాహనదారుల నుంచి వసూలు చేయడం అలవాటని తెలుస్తోంది. -
అవినీతి ఆర్జన రూ.వందల కోట్లలో..
♦ తవ్వేకొద్దీ బయటపడుతున్న డీటీసీ మోహన్ అక్రమ ఆస్తులు ♦ మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఏసీబీ దాడులు సాక్షి, హైదరాబాద్/కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ (డీటీసీ) ఆదిమూలం మోహన్ నివాసం, ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో రూ.వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు వెలుగు చూస్తున్నారుు. కాకినాడలోని డీటీసీ ఇంటితో సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో తొమ్మిదిచోట్ల గురువారం ఉదయం నుంచి నిర్వహిస్తున్న దాడుల్లో రూ.వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మోహన్ బంధువులు, బినామీల వివరాలను సేకరిస్తున్నామని, బ్యాంకు బ్యాలెన్స్‌లను తనిఖీ చేసి, లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఏసీబీ అధికారులు కాకినాడలోని డీటీసీ కార్యాలయంలో శుక్రవారం పలువురిని ప్రశ్నించి, మోహన్‌కు సంబంధించిన మరికొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. అతడి బంధువులు, స్నేహితుల వివరాలను ఇప్పటికే సేకరించిన అధికారులు వారి ఇళ్లపైనా దాడులు చేయనున్నట్లు తెలిసింది. దాడుల్లో భారీగా నగదు, బంగారం, వెండి వస్తువులు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, వ్యవసాయ భూ ములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి విలువను లెక్కకట్టే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు రూ.100 కోట్లకుపైనే మోహన్‌కు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విలువే రూ.100 కోట్లు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అతడికి చిత్తూరు, నెల్లూరు, బళ్లారిల్లోనూ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో కుమార్తె పేరుతో ఉన్న ఐదు బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల విలువ కూడా రూ.కోట్లలోనే ఉంటుందంటున్నారు. హైదరాబాద్, కడప, బళ్లారి, అనంతపురం, విజయవాడ, ప్రొద్దుటూరు, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో దాడులు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంకా దాడులు కొనసాగుతున్నందున ఆస్తులపై పూర్తి సమాచారం ఇప్పుడే చెప్పలేమని అధికారులు అంటున్నారు. మోహన్‌కు సంబంధించిన ఆస్తుల, బినామీల వివరాలు ఏమైనా తెలిస్తే ఏసీబీ డీఎస్పీ కె.రమాదేవి, సెల్ నంబర్ 8332971044కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. మోహన్ ఆదాయం నెలకు రూ.3 కోట్లు! తూర్పుగోదావరి జిల్లా డీటీసీ ఆదిమూలం మోహన్ రూ.వందల కోట్ల అవినీతి పాల్పడినట్లు తేలడంతో ఏసీబీ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మోహన్ అనంతపురం, చిత్తూరు, కరీంనగర్, విజయవాడ, ఏలూరుల్లో రవాణా శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు. పనిచేసిన ప్రతి జిల్లాలో రూ.కోట్లు ఆర్జించారనే ఆరోపణలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన అవినీతి పెచ్చుమీరింది. కాకినాడ పోర్టుకు వెళ్లే ప్రతి లారీ నుంచి రవాణా శాఖ అధికారులు రూ.వెయ్యి వసూలును తప్పనిసరి చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా అధిక లోడుతో వెయ్యికి పైగా లారీలు పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. వీటికి సంబంధించి రోజుకు రూ.10 లక్షల చొప్పున నెలకు రూ.3 కోట్లు మోహన్‌కు ముడుపులు అందుతున్నాయని, చెక్‌పోస్టుల నుంచి రోజువారీ రూ.లక్ష వరకు అందుతున్నట్లు సమాచారం.