దోపిడీకి దారులెన్నో..
శాఖోపశాఖలుగా విస్తరించిన డీటీసీ మోహన్ అవినీతి
చెక్ పోస్ట్ నుంచి స్కూల్ బస్సుల వరకూ దండుడు దందా
ప్రతి నెలా అక్రమార్జన రూ.కోటిన్నర పైమాటే
రోజువారీ, నెలవారీ మామూళ్లు
ఎక్కడ పని చేసినా ఇదే తీరు
వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన రవాణా శాఖ కాకినాడ ఉప కమిషనర్ (డీటీసీ) ఆదిమూలం మోహన్ అవినీతి దందా రాష్ట్రవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించింది. డబ్బు దండుకోవడానికి గల ఏ మార్గాన్నీ ఆయన విడిచి పెట్టలేదు. డీటీసీగా ఏ జిల్లాలో పనిచేస్తే అక్కడ ఆస్తులు గడించారు. గత ఏడాదిన్నరగా కాకినాడ డీటీసీగా పని చేస్తున్న ఆయన ఆస్తులపై మూడురోజులుగా జరుగుతున్న దాడుల్లో అవినీతి బాగోతాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎంత తక్కువ లెక్కేసినా డీటీసీ మోహన్ అక్రమార్జన నెలకు ఒకటిన్నర కోట్ల పైమాటేనంటున్నారు.
- సాక్షి ప్రతినిధి, కాకినాడ
డీటీసీ మోహన్‌కు కాకినాడ, వాకలపూడి, అమలాపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న లారీ యూనియన్‌ల నుంచి నెల వారీగా రూ.50 లక్షలకు తక్కువ కాకుండా ముడుపులు ముట్టచెప్పే వారని లెక్కలేస్తున్నారు.
జిల్లా కేంద్రం కాకినాడ ఉప
రవాణాశాఖ కార్యాలయం పరిధిలో ప్రధానంగా తునికి సమీపాన ఉన్న తేటగుంట చెక్‌పోస్టుతో పాటు కత్తిపూడి, రాజమండ్రి, అమలాపురం, మండపేట తదితర ప్రాంతాల్లోని రవాణాశాఖ స్థానిక కార్యాలయాల నుంచి నెలనెలా ముక్కుపిండి మామూళ్లు రాబట్టారని ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తేటగుంట వద్ద ఉన్న చెక్‌పోస్ట్, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కాకినాడ పోర్టు మీదుగా జరిగే సరుకు రవాణా లారీలు, ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు, కాకినాడ నుంచి పొరుగు రాష్ట్రాలకు పామాయిల్ రవాణా చేసే ట్యాంకర్‌లు.. ఇలా వీటన్నింటినీ అక్రమార్జనకు మార్గాలుగా ఎంచుకున్నారు.
అధిక లోడుతో వెళ్లే వాహనాలను నిలుపుదల చేసి అపరాధ రుసుం వసూలు చేయడం తేటగుంట చెక్‌పోస్టు ప్రధాన విధి. ఈ చెక్‌పోస్టు మీదుగా ప్రతి రోజూ సుమారు ఎమినిదివేల భారీ వాహనాలు వెళుతుంటాయి. ఈ వాహనాల ద్వారా రోజుకు అధికారికంగా రూ.3 లక్షల ఆదాయం ప్రభుత్వానికి జమ అవుతోంది. అక్రమంగా ఆర్జించేది ఇంతకు రెట్టింపు ఉంటుందని అంచనా. ఇందులో ప్రధాన వాటా డీటీసీకి ఏరోజుకారోజు సాయంత్రానికే అందేదని ఆయన కార్యాలయ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి.
తేటగుంట తనిఖీ కేంద్రంలో ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలపై మూడు వేల నుంచి ఐదువేలు అపరాధరుసుం వసూలు చేయాలి. ఒక వాహనం నుంచి రెండు, మూడు పర్యాయాలు ఓవర్‌లోడ్ కారణంగా అపరాధ రుసుం వసూలైనట్టు రికార్డు అయితే ఆ వాహన యజమానికి రకరకాల ఇబ్బందులు తప్పవు. ఈ కారణంగా వాహన నిర్వాహకులు అనధికారికంగా రెండువేలు చేతిలో పెట్టి వెళ్లిపోతుంటారు. ఈ ఆదాయంలో సగం వాటా డీటీసీ జేబులో పడుతుంది.
ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు నడిపే విద్యార్థుల బస్సులను కూడా డీటీసీ అక్రమార్జనకు మరో మార్గంగా ఎంచుకున్నారు. చిన్న చిన్న యాజమాన్యాలైతే ఒక బస్సు సామర్థ్య పరీక్షకు రూ.50 వేలకు తక్కువ కాకుండా ఇచ్చుకునేవి. అదే కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలైతే గంపగుత్త బేరంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ముట్టచెప్పేవని చెబుతున్నారు.
నల్లధనం తెలుపు చేసుకునేందుకే బినామీ సంస్థలు
వివిధ మార్గాల్లో కూడబెట్టిన నల్లడబ్బును ‘తెలుపు’ చేసుకునేందుకే డీటీసీ మోహన్ వివిధ ప్రాంతాల్లో తేజ బయో ఫ్యూయల్స్ ప్రైవేటు లిమిటెడ్, తేజ అండ్ తేజశ్రీ డెవలపర్స్, సాయి దివ్య డెవలపర్స్, మెర్క్ మినరల్ ప్రైవేటు లిమిటెడ్, రోజాలిన్ రాక్స్ అండ్ మైన్స్ ప్రైవేటు లిమిటెడ్..ఇలా బినామీ పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేశారు. అలాంటి వాటి ఆరా తీయడంలో ఇప్పటికే ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఒక బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆ పేర్లతో కంపెనీలు లేకపోగా విలువైన భూములు మాత్రం ఉన్నాయని గుర్తించారు. ఇలా ఏ ఒక్క మార్గాన్ని కూడా విడిచి పెట్టకుండా కోట్లు కొల్లగొట్టిన ఆదిమూలం మోహన్ ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా నిలిచారు.
నెల్లూరులో కొనసాగుతున్న సోదాలు
నెల్లూరు క్రైం : డీటీపీ మోహన్ అక్రమ ఆస్తులను గుర్తించేందుకు నెల్లూరు జిల్లాలోనూ సోదాలు జరుగుతున్నారుు. ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం మోహన్ ఆస్తులు, బినామీలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మోహన్ 2003 నుంచి 2005 వరకు, 2013 నుంచి 2014 అక్టోబర్ వరకు జిల్లాలో ఆర్టీఓగా, డీటీసీ పని చేశారు. ఆ సమయంలో వింజమూరులో 8 ఎకరాలు, వరికుంటపాడు మండలంలో 45 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌కు చెందిన మద్యం వ్యాపారి మల్లికార్జున డీటీసీకి బినామీగా వ్యవహరించారు.
డీటీసీ అక్రమ సంపాదనలో అధిక భాగం మద్యం వ్యాపారం, రియల్ ఎస్టేట్‌లో పెట్టి భారీ లాభాలు ఆర్జించినట్లు తెలిసింది. మల్లికార్జున నివాసముంటున్న మాగుంట లేఅవుట్‌లోని పిచ్చిరెడ్డి కల్యాణమంటపం సమీపంలోగల ధీరజ్ అపార్ట్‌మెంట్‌కు శనివారం ఏసీబీ అధికారులు వెళ్లారు. అయితే ఆయన కొంతకాలంగా కుమారుల చదువుల నిమిత్తం విజయవాడలో ఉన్నట్లు తెలియడంతో అధికారులు అక్కడకు వెళ్లినట్లు సమాచారం. కాగా మోహన్ హయాంలో అకౌంటెంట్‌గా శ్రీనివాసులు, హోంగార్డు ఏడుకొండలు అవినీతి వ్యవహారాల్లో చక్రం తిప్పారని ఫిర్యాదులందడంతో శనివారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయూనికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసులు, ఏడుకొండలు ఇళ్లలో సోదాలు చేశారు.