వసూళ్ల దందా
రవాణా శాఖ అధికారుల అక్రమదందాకు అలంపూర్ అంతర్రాష్ట్ర రవాణా చెక్‌పోస్టు అడ్డాగా మారింది. రెండురోజుల క్రితం చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేసినా వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. సగటున రోజుకు రూ. రెండు లక్షలపైనే అనధికారికంగా వాహనదారుల నుంచి వసూలు చేస్తూ వాటాలు పంచుకుంటున్నట్లు తెలిసింది.‘సాక్షి’ పరిశీలనలో ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికారులకు సైతం వాటాలు అందుతున్న తతంగం వెలుగుచూసింది. చెక్‌పోస్టు వద్ద జరుగుతున్న వసూళ్ల దందాపై దృష్టి సారించడంతో అనేక విషయాలు వెలుగుచూశాయి.
* అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్‌పోస్టు అడ్డా
* రోజువారీ కలెక్షన్ రూ.2లక్షలపైనే
* ప్రైవేట్ సిబ్బందితో ప్రత్యేకటీం
* అధికారులు సహా అందరికీ వాటాలు
* ఏసీబీ నివేదిక అందేదెన్నడో?
* ఏఎంవీఐపై చర్యకు మీనమేషాలు
కల్వల మల్లికార్జున్‌రెడ్డి: హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై అలంపూర్ రవాణా శాఖ చెక్‌పోస్టు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారింది. ఈనెల 20న అర్ధరాత్రి చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ అమర్‌నాథ్ నుంచి రూ.1.08లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఏసీబీ దాడుల తర్వాత కూడా చెక్‌పోస్టు వద్ద వసూళ్ల దందా యథాతథంగా కొనసాగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. నిబంధనల ప్రకారం అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంది.
లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న పర్యవేక్షణ అధికారులు రోజుకు 12 గంటలు చొప్పున రెండు షిఫ్టుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టులో మొత్తం 9 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వీరికితోడు అదనంగా మరో 10 మంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని ఒక్కో వ్యక్తికి రోజుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారు. చెక్‌పోస్టు పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తుల సంచారం ఉండకూడదనే నిబంధన పాటించడం లేదు. ఈ ఏడాది అక్టోబర్ 9న చెక్‌పోస్టును అధికారి కంగా ప్రారంభించగా, రెండు నెలల ముం దు నుం చే అనధికారిక చెక్‌పోస్టు ఏర్పాటుచేసి వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టినట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది.
ఏసీబీ కేసు తేలేనా?
చెక్‌పోస్టుపై దాడిచేసి ఓ ఎఎంవీఐతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా ప ట్టుకున్న నిందితులపై శాఖాపరమైన చర్య తీసుకోవాలని లేఖ రాసింది. డిపార్ట్‌మెంట్ ప్రొసిడింగ్ వచ్చిన తర్వాతే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని చెబుతోంది. ప్రా థమిక సమాచారాన్ని ఉన్నతాధికారులకు పం పిన ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను మరో నెల రోజుల్లో సమర్పిస్తామని చెబుతున్నారు. ఏ సీబీ పూర్తిస్థాయి విచారణ నివేదిక తరువాతే అ క్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అన్ని స్థాయుల అధికారులకు వాటాలు అందుతుండటంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
నిబంధనలు గాలికి
జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్డీఓ పర్యవేక్షణ, నియంత్రణ, మార్గనిర్దేశనంలో పనిచేయాల్సిన చెక్‌పోస్టు సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. విధుల్లో ఉండే సిబ్బంది తమ వద్ద ఉన్న నగదు వివరాలను సంబంధిత రిజిస్టరులో నమోదు చేయాల్సి ఉన్నా పాటించడం లేదు.
* విధుల్లో ఉన్న సిబ్బంది హోదా, పేర్లు బోర్డుపై రాయాల్సి ఉన్నా రావడం లేదు.
* విధులు నిర్వహించే సిబ్బంది కచ్చితంగా యూనిఫామ్స్ ధరించాలనే నిబంధన కూడా అమలుకావడం లేదు.
* చెక్‌పోస్టుగా మీదుగా వెళ్తున్న వాహనాల వివరాలను అరకొరగా నమోదు చేస్తున్నారు.
* సరైన అనుమతి పత్రాలు, ఫిట్‌నెస్ ధ్రువీకరణపత్రాలు లేకుండా సరిహద్దు దాటుతున్న వాహనాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
* పన్నులు చెల్లించకుండా సరిహద్దు దాటుతున్న వాహనాల నుంచి వసూళ్లు చేస్తూ అరకొర తనిఖీలతో వదిలేస్తున్నారు.
* వాహనాల నంబర్లు, ఛాసిస్ నంబర్లు తనిఖీ చేయాలన్న నిబంధన పాటించడం లేదు.