ఆర్టీసీలో ఫ్లెక్సీ ఫేర్!
ఇక సీట్లు రిజర్వ్ అయ్యే కొద్దీ పెరగనున్న చార్జీలు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నష్టాలతో కుదేలైన ఆర్టీసీని గట్టెక్కించేందుకు కొత్త విధానాల అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ‘ఫ్లెక్సీ ఫేర్’ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిమాండ్ పెరిగే కొద్దీ చార్జీ పెరగటమే దీని లక్ష్యం. ‘డైనమిక్ ఫేర్’ పేరుతో విమానాల విషయంలో అమలు చేస్తున్న విధానాన్నే ‘ఫ్లెక్సీ ఫేర్’ పేరుతో బస్సులకు కూడా వర్తింపజేస్తారన్నమాట! సీట్లు రిజర్వ్ అయ్యే కొద్దీ మిగిలిన వాటి ధర పెరుగుతూ ఉంటుంది.
ముందు రిజర్వ్ చేసుకుంటే తక్కువ చార్జీ, ఆలస్యంగా బుక్ చేసుకుంటే ఎక్కువ చార్జీ పడుతుంది. దీన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న బస్సులకు వర్తింప చేస్తారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని బాగు చేసేందుకు సూచనలు, సలహాలు కోరుతూ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం బస్‌భవన్‌లో నాలుగు గంటల పాటు మేధోమథన సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ జేఎండీ రమణారావు, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాతోపాటు గతంలో ఆర్టీసీ ఎండీగా పనిచేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణారావు, విశ్రాంత ఈడీ సుధాకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం బెంగళూరు, విజయవాడ మధ్య కొన్ని గరుడ ప్లస్ బస్సులకు ఫ్లెక్సీ ఫేర్‌ను అమలు చేస్తుం డగా ఇక ఆన్‌లైన్ రిజర్వేషన్ ఉన్న అన్ని బస్సులకు వర్తింపచేయాలనే ఆలోచనకు వచ్చారు. ఈ లెక్కన సూపర్ లగ్జరీ బస్సులకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేస్తారు.
ఆర్టీసీ భూములు లీజుకు: ఆర్టీసీ భూములను వాణిజ్య అవసరాలకు అద్దెకు, లీజ్‌కు ఇవ్వటం ద్వారా ఆదాయం సమీకరించుకునే అవకాశం ఉందని, ఆ దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు. బీఓటీ, డీఓటీ విధానాల్లో నిబంధనలను కాస్త సరళీకృతం చేయటం ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించి ఆదాయాన్ని సమీకరించవచ్చని నిర్ణయించారు. ప్రస్తుతం డీజిల్‌పై ఆర్టీసీకి 22 శాతం వ్యాట్ విధిస్తున్నారు. దీన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తే సంస్థకు భారం తగ్గుతుందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.