నకిలీ.. మకిలీ!
రవాణా శాఖ లెసైన్సు కోసం మీకు మెడికల్ సర్టిఫికెట్ కావాలా? అంతో ఇంతో ఇచ్చుకుంటే చాలు.. ఒక్కటంటే ఒక్కటే నిమిషంలో మెడికల్ సర్టిఫికెట్ మీ చేతిలో ఉంటుంది. ఇదేదో జిల్లాలో కొద్ది మంది డాక్టర్లు చేసే వ్యవహారమే అనుకుంటున్నారా? ఇక్కడ సర్టిఫికెట్ ఇస్తోంది అసలుసిసలు డాక్టర్ కాదు. ఫిజీషియన్ పేరిట ఓ ఆర్‌ఎంపీ చేస్తున్న మకిలీ వ్యవహారం. ఓ డాక్టర్ పేరుతో ఉన్న సీలును ఉపయోగిస్తూ విచ్చలవిడిగా సంతకాలు చేసి మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. కర్నూలు నగర శివారు నంద్యాల చెక్‌పోస్టుకు సమీపంలో పాత రవాణా శాఖ కార్యాలయం(ఆర్‌టీఓ) ఎదుటనున్న లక్ష్మీ పాలి క్లినిక్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది.
మెడికల్ సర్టిఫి‘కేట్’
ప్రభుత్వ వైద్యుని సీల్‌తో ఆర్‌ఎంపీ దందా
రోజూ పదుల సంఖ్యలో సర్టిఫికెట్ల జారీ
దగ్గరుండి పంపుతున్న రవాణా శాఖ ఏజెంట్లు
పాత ఆర్టీఓ కార్యాలయం ఎదుట దుకాణం
సాక్షి టాస్క్‌ఫోర్స్: డ్రైవింగ్ లెసైన్సు కావాలన్నా.. ప్రధానంగా 50 ఏళ్ల వయసు పైబడిన వారు లెర్నింగ్ లెసైన్సు పొందేందుకు మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి. అదేవిధంగా ఏ వయసు వారైనా హెవీ, ట్రాన్స్‌పోర్టు లెసైన్సు పొందేందుకు కచ్చితంగా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఇందుకోసం ఫారం-1 ఏపై గెజిటెడ్ హోదా కలిగిన ఫిజీషియన్ సర్టిఫై చేయాల్సి ఉంది. అయితే, కర్నూలు ఆర్‌టీఓ కార్యాలయంలో రోజుకు పదుల సంఖ్యలో లెసైన్సులు జారీ అవుతున్నాయి. వీరందరికీ అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ కోసం రవాణాశాఖ ఏజెంట్లు కాస్తా లక్ష్మీ పాలి క్లినిక్‌కే పంపుతున్నారు. ఇక్కడ డాక్టర్ ఎం.ప్రతాప్ బీఎస్సీ, ఎంబీబీఎస్.. ఫిజీషియన్ అండ్ సర్జన్ అని రిజిస్టర్ నెంబరు 45367గా పేర్కొంటూ రెవెన్యూ కాలనీలో ఉంటున్నట్టు మెడికల్ సర్టిఫికెట్ జారీచేస్తున్నారు. అయితే, ఇది వాస్తవానికి నిజమైన డాక్టరుది కాదు. అయినప్పటికీ రోజుకు పదుల సంఖ్యలో జారీచేస్తూ ఈ ఆర్‌ఎంపీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. కనీసం ఇవి నిజమైన డాక్టరు జారీ చేస్తున్నారా? నకిలీ డాక్టరా? అన్నది కూడా రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. సర్టిఫికెట్ సరైన పద్ధతిలో జారీకాకపోయినప్పటికీ వారు పరిశీలించడం లేదన్నది అర్థమవుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పాత ఆర్టీఓ కార్యాలయం పరిసరాల్లో ఉంటున్న ఏజెంట్లు నడిపిస్తున్నారు.
మెడికల్ సర్టిఫికెట్ ఎందుకంటే..ట్రాన్స్‌పోర్టు లెసైన్సు, భారీ వాహనాలు నడిపేందుకు అవసరమైన హెవీ లెసైన్సుతో పాటు రెన్యువల్ కోసం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అవసరం. ఇది ఉంటేనే రవాణాశాఖ సిబ్బంది లెసైన్స్ జారీచేస్తారు. అదేవిధంగా 50 ఏళ్ల వయసు పైబడిన వారికి లెర్నింగ్ లెసైన్స్ కావాలంటే కూడా మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. కంటిచూపు బాగుందా? లేదా? ఇతర అవయవాలు బాగున్నాయా? లేదా అనే వివరాలను తెలుపుతూ గెజిటెడ్ హోదా ఉన్న ఫిజీషియన్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, అర్హత లేకపోయినప్పటికీ ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ చేస్తున్న వ్యవహారాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం సాక్షి టాస్క్‌ఫోర్స్ పరిశీలనలో బట్టబయలైంది.
సర్టిఫికెట్ జారీ ఇలా ఉండాలి
వాస్తవానికి మెడికల్ సర్టిఫికెట్‌ను జారీచేసే వ్యక్తి కనీసం ఎంబీబీఎస్ చదువుకుని ఉండాలి. సర్టిఫికెట్ జారీ సమయంలో కూడా కేవలం మెడికల్ ఆఫీసర్ అని, కింద రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పేర్కొంటారు. దీనిపై గ్రీన్ ఇంకుతో సంతకం చేయడంతో పాటు బ్రాకెట్‌లో పూర్తి పేరు కూడా రాస్తారు. అయితే, ఇక్కడ జారీ అవుతున్న సర్టిఫికెట్లు ఏవీ కూడా ఈ ప్రమాణాల్లో లేవు. రబ్బరు స్టాంపులోనే డాక్టరు పేరు ఉంది. దీనిని గమనిస్తే చాలు.. జారీ అవుతున్న మెడికల్ సర్టిఫికెట్లు నకిలీవని ఇట్టే అర్థమవుతుంది.
రవాణాశాఖ అధికారులు ఏమంటున్నారంటే...
లెసైన్సు సమయంలో మెడికల్ సర్టిఫికెట్‌ను పరిశీలించేది రవాణాశాఖ కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) స్థాయిలో ఉంటుందని రవాణాశాఖ ప్రాంతీయ అధికారి(ఆర్‌టీఓ) కె.సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఇలాంటి నకిలీ మెడికల్ సర్టిఫికెట్లను ఇక మీదట పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆ సర్టిఫికెట్లతో నాకు సంబంధం లేదు
జలదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో కర్నూలు నగరం నంద్యాల చెక్‌పోస్టుకు సమీపంలో ఉన్న లక్ష్మీ పాలి క్లినిక్‌కు వెళ్లేవాన్ని. అది కూడా కొందరు వైద్యులతో కలిసి అక్కడ కూర్చునేవాన్ని తప్ప ప్రాక్టీస్ చేయలేదు. ఎవ్వరికీ మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేయలేదు. కానీ నా పేరుతో శ్యామ్ అనే వ్యక్తి సీల్ తయారు చేసుకుని మెడికల్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఆయన ఇచ్చే సర్టిఫికెట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను జలదుర్గం పీహెచ్‌సీ నుంచి గోనెగండ్లకు.. ఆ తర్వాత ప్రస్తుతం ఎమ్మిగనూరు క్లస్టర్‌లోని కలుదేవకుంట్ల పీహెచ్‌సీలో పనిచేస్తున్నా. నా పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్న అతనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తా. - డాక్టర్ ఎం.ప్రతాప్, మెడికల్ ఆఫీసర్, కలుదేవకుంట్ల పీహెచ్‌సీ