సాక్షి, అమరావతి: ఇకపై విద్యుత్ వాహనాన్ని ఇంట్లోనే చార్జింగ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కడో ఉన్న చార్జింగ్ కేంద్రాలకు వెళ్లి, సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పని ఉండదు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వాతావరణ, వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అయితే, వీటికి చార్జింగ్ ప్రధాన సమస్య కావడంతో ఎక్కువ మంది కొనడంలేదు. దీంతో ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏర్పాటు చేసిన విద్యుత్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ఇంటిలోనో, ఆఫీసులోనో సెల్‌ఫోన్ మాదిరిగానే చార్జింగ్ పెట్టుకోవచ్చు. గృహాలు, ఆఫీసుల వినియోగానికి వర్తించే టారిఫ్ ప్రకారమే చార్జీ చెల్లించాలి. ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ (పీసీఎస్)లకు ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. అయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, బీఈఈ సూచించిన విధంగా అన్ని రకాల భద్రత, నాణ్యత ప్రమాణాలు ఉండాలి. వీటికి సర్వీస్ చార్జీలను నిర్ణయించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
రాష్ట్రంలో లక్ష కేంద్రాలు
దేశవ్యాప్తంగా 9,47,876 విద్యుత్ వాహనాలు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) నివేదిక ప్రకారం చార్జింగ్ స్టేషన్లు 1,028 మాత్రమే ఉన్నాయి. 2030 నాటికి దేశంలో ప్రైవేటు కార్లు 30 శాతం, వాణిజ్య వాహనాలు 70 శాతం, బస్సులు 40 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు 80 శాతం ఈవీలుగా మార్చాలనేది లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటికి వీటి సంఖ్యను 10 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి కోసం రాష్ట్రంలో 2030కి లక్ష చార్జింగ్ కేంద్రాలు నెలకొల్పాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున తొలి దశలో మొత్తం 300 చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. వచ్చే ఫిబ్రవరి నాటికి 60 కేంద్రాలను విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. వీటి ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈవీ పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలో పీసీఎస్‌ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది. యూనిట్‌కు రూ.12 చొప్పున వసూలు చేసి, దాని నుంచి డిస్కంలకు విద్యుత్ చార్జీ రూ.6, స్థల యజమానికి రూ.2.55 చెల్లిస్తామంటూ ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుకు చెందిన సంస్థలు టెండర్లు వేశాయి.
ఇంట్లోనే వాహన చార్జింగ్
Published Tue, Jan 18 2022 3:13 AM | Last Updated on Tue, Jan 18 2022 9:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment