
సాక్షి, అమరావతి: రహదారి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రాజీలేకుండా రవాణాశాఖ కేసులు నమోదు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 43,958 కేసులు నమోదు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు అత్యధికంగా విశాఖ జిల్లాలో 11,602, తరువాత శ్రీకాకుళం జిల్లాలో 6,772 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా 242 కేసులు విజయనగరం జిల్లాలో నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 11,686 కేసులను నమోదు చేసింది. రోజుకు 8 గంటలకుపైగా పనిచేసిన డ్రైవర్ల మీద కూడా రవాణాశాఖ కేసులు నమోదు చేస్తోంది. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ వాహనాలపైన కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశించడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment