సాక్షి, అమరావతి: చదునైన పాదం (ఫ్లాట్ ఫుట్) ఉంటే అదృష్టం అంటారు. కానీ, ఓ యువకుడికి అది దురదృష్టంగా మారింది. ప్రభుత్వోద్యోగాన్ని దూరం చేసింది. చివరకు ఆ యువకుడు రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఫ్లాట్ ఫుట్ ఉన్న వ్యక్తులు అసిస్టెంట్ మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)గా నియమితులు కావడానికి అనర్హులని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీఓలను, నోటిఫికేషన్‌ను హైకోర్టు సమర్థించింది. వీటిని అతను సవాల్‌చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
ఇదీ వివాదం..
రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో వైఎస్సార్ కడప జిల్లా, రాయచోటి మండలానికి చెందిన నల్లమల నాగేశ్వరయ్య దరఖాస్తు చేసుకున్నారు. 2019లో నిర్వహించిన పరీక్షల్లో నాగేశ్వరయ్యకు 300 మార్కులకు గాను 194.26 మార్కులు వచ్చాయి. మెరిట్ జాబితాలో అతనిది రెండో స్థానం. అనంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించగా ఫలితాల్లో అతని పేరులేదు. కుడిపాదం చదునుగా ఉండటంతో అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో నాగేశ్వరయ్య నోటిఫికేషన్‌తో పాటు ఇందుకు సంబంధించిన జీఓలను సవాలు చేస్తూ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ కూడా ఏపీ రవాణా సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌కు, దివ్యాంగుల చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం ఇటీవల విచారించింది. వైకల్యం కారణంగా వివక్ష చూపడానికి వీల్లేదని నాగేశ్వరయ్య తరఫు న్యాయవాది వాదించారు.
ఫ్లాట్‌ఫుట్ ఆ పోస్టుకు అనర్హతే..
దివ్యాంగుల చట్టం ప్రకారం ఫ్లాట్‌ఫుట్ వైకల్యం కాదని, అందువల్ల నాగేశ్వరయ్య ఆ చట్టం కింద రిజర్వేషన్ కోరలేరని ప్రభుత్వ, ఏపీపీఎస్సీ న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ సర్వీసు రూల్స్ ప్రకారం ఏఎంవీఐ పోస్టుకు ఫ్లాట్‌ఫుట్ ఉన్న వ్యక్తి అనర్హుడని, అందువల్ల అతన్ని ఎంపిక చేయలేదన్నారు. ఏఎంవీఐ, మెటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ (పదోన్నతి ద్వారా), అసిస్టెంట్ మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ (పదోన్నతి, ప్రత్యక్ష భర్తీ), ట్రాన్స్‌పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ (పదోన్నతి), ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ (ప్రత్యక్ష భర్తీ) పోస్టులకు దివ్యాంగుల రిజర్వేషన్‌ను మినహాయిస్తూ ప్రభుత్వం 2021లో జీఓ కూడా ఇచ్చిందని కోర్టుకు నివేదించారు. ఈ పోస్టులన్నింటికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరన్నారు. అందువల్ల ఈ పోస్టుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించడం లేదన్నారు. వీటన్నింటి దృష్ట్యా పిటిషనర్ ఏఎంవీఐగా నియామకం కోరజాలరని వారు కోర్టుకు విన్నవించారు.
రిజర్వేషన్‌ను మినహాయించొచ్చు
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ, ఏపీపీఎస్సీ న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. ఉద్యోగ స్వభావాన్ని బట్టి రిజర్వేషన్‌ను మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇదే విషయాన్ని దివ్యాంగుల చట్టం చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. అంతేకాక.. ‘ఫ్లాట్ ఫుట్ కలిగి ఉన్న వ్యక్తి ఏఎంవీఐగా అనర్హుడని తేల్చడం చట్ట విరుద్ధమన్న పిటిషనర్ వాదన అర్ధరహితం. ఫ్లాట్‌ఫుట్ అనేది అంగవైకల్యం కానప్పటికీ, ఏఎంవీఐగా విధులు నిర్వర్తించేందుకు అది అడ్డంకి అవుతుంది. అది ఉన్న వ్యక్తికి నడిచేందుకు, పరిగెత్తేందుకు సరైన పట్టు ఉండదు. ఇది విధి నిర్వహణలో అతనికి ఇబ్బందవుతుంది. కాబట్టి పిటిషనర్, ఆ నిబంధనలను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరలేరు’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
‘ఫ్లాట్‌ఫుట్’తో దక్కని కొలువు
Published Wed, Apr 6 2022 4:20 AM | Last Updated on Wed, Apr 6 2022 4:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment