ఆరు వేల డ్రైవింగ్ లెసైన్సుల సస్పెన్షన్! | Suspension of six thousand driving licences | Sakshi
Sakshi News home page

ఆరు వేల డ్రైవింగ్ లెసైన్సుల సస్పెన్షన్!

Published Tue, May 31 2016 12:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Suspension of six thousand driving licences

నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై రవాణాశాఖ నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: నిబంధనలు గాలికొదిలి రోడ్డుపై ఎడాపెడా వాహనాలు నడిపినవారిపై రవాణా శాఖ ఉక్కుపాదం మోపింది. 6 వేల మందికి పైగా వాహనదారుల డ్రైవింగ్ లెసైన్సుల సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధం చేసింది. రోడ్డు నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన రహదారి భద్రతా కమిటీ సూచనలతో రవాణా శాఖ ఈ చర్యలకు ఉపక్రమించింది. సాధారణ క్రమశిక్షణ చర్యలకు పరిమితం కాకుండా ఇంత భారీ సంఖ్యలో లెసైన్సులు సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి.

 3 నుంచి 6 నెలలు అమల్లో...
 పోలీసులు, రవాణా శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 6 వేల మంది ఉల్లంఘనులపైన కేసులు నమోదయ్యాయి. వీరికి షోకాజ్ నోటీ సులిచ్చిన ఆర్టీఏ అధికారులు... తాజాగా వారి డ్రైవింగ్ లెసైన్సులపైన సస్పెన్షన్ వేటు వేసేందుకు నిర్ణయించారు. వీటిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులే అధికం. పోలీసులకు పట్టుపడిన వారిలో హైదరాబాద్, రంగారెడ్డితో పాటు, ఇతర జిల్లాలకు చెందినవారు, వేరే రాష్ట్రాల డ్రైవింగ్ లెసైన్సులు గలవారు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లెసైన్సులపై చర్యలు తీసుకోవలసిందిగా రవాణా శాఖ సంబంధిత ఆర్టీఏలకు లేఖలు రాయనుంది. ఈ సస్పెన్షన్ కనిష్టంగా 3 నెలల నుంచి గరిష్టంగా 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. ఈ సమయంలో వాహనం నడిపితే మరో తప్పిదంగా భావించి సస్పెన్షన్ పొడిగించే అవకాశం ఉంది.

 నాలుగు రకాలుగా ఉల్లంఘనలు...
 సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన రహదారి భద్రతా కమిటీకి రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పోలీసు తదితర శాఖల ఉన్నతాధికారులు ఇందులో ప్రతినిధులుగా ఉన్నారు. ఈ కమిటీ రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై దిశానిర్దేశం చేసింది. ప్రమాదాలకు దారితీసే 4 రకాల ఉల్లంఘనలను తీవ్ర తప్పిదాలుగా పరి గణించి వాహనదారులపై కఠిన చర్యలకు ఆదేశించింది. మద్యం సేవించి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, ఔటర్ రింగురోడ్డు వంటి ప్రధాన రహదారులపై అమిత వేగంతో సిగ్నల్ జంపింగ్, పరిమితికి మించి సరుకు రవాణా చేయడం వీటిలో ఉన్నాయి. ఈ అభియోగాల కింద నమోదైన 6 వేల కేసుల్లో మద్యం సేవించి నడిపిన వాహనదారులు, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు పాల్పడిన వాళ్లు సగానికి పైగా ఉన్నట్లు రవాణా అధికారులు తెలిపారు. ఆ తరువాత ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్ వంటి కేసులున్నాయి.
 
 ఆ నిబంధన లేదు...
 సాధారణంగా ఒకేరకమైన తప్పిదాన్ని మూడుసార్లు చేసిన వారి డ్రైవింగ్ లెసైన్సులను సస్పెండ్ చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ మోటారు వాహన నిబంధనల్లో అలాంటి సడలింపులేవీ లేవని అధికారులు స్పష్టం చేశారు. ‘ఎన్ని సార్లు’ అనేది ప్రామాణికమే కాదన్నారు. ఒక్కసారి తప్పిదం చే స్తే ఒకరకమైన శిక్ష, రెండు సార్లు చేస్తే మరో రకమైన శిక్ష అంటూ లేదన్నారు. ‘నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నాం. ఏమరుపాటుగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికీ ఇది ఒక హెచ్చరిక’’ అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement