ద్విచక్ర వాహనంతోపాటే హెల్మెట్! | helmet with bike cs orders to vehicles | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనంతోపాటే హెల్మెట్!

Published Tue, Aug 4 2015 2:35 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

ద్విచక్ర వాహనంతోపాటే హెల్మెట్! - Sakshi

ద్విచక్ర వాహనంతోపాటే హెల్మెట్!

వాహనాలు డీలర్లకు సీఎస్ ఆదేశాలు
* మూడు నెలలపాటు హెల్మెట్ ధరించాలని కౌన్సెలింగ్
* నవంబర్ 1 నుంచి హెల్మెట్ లేకపోతే జరిమానా తప్
పదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లతోపాటే హెల్మెట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధన విధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు వాహనాల విక్రయ డీలర్లందరికీ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా రవాణా శాఖను ఆదేశించారు. నాణ్యత లేని హెల్మెట్‌లు ధరిస్తే ఫలితం లేనందువల్ల ఎలాంటి హెల్మెట్‌లు ధరించాలి, ఎలాంటి హెల్మెట్లు ద్విచక్రవాహనదారుల కొనుగోలు చేయాలో నిబంధనలను నిర్ధారించాల్సిందిగా రవాణా శాఖకు సూచించారు. ప్రభుత్వ నిర్ధారించిన మేరకు ఉన్న హెల్మెట్లనే కొనుగోలు చేయడం, విక్రయాలు చేసేలాగ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం మూడు నెలల పాటు ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. వాస్తవంగా అయితే ఈ నెల 1వ తేదీ నుంచి హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తూ, ధరించనివారి నుంచి జరిమానా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విక్రయదారులు హెల్మెట్ ధరలను విపరీతంగా పెంచేశారు.

వాహనదారులు తక్కువధరకు లభించే రక్షణ కవచం లేని హెల్మెట్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో హెల్మెట్ తప్పనిసరిని నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను ఆపి ఎటువంటి హెల్మెట్ ధరించాలనే విషయాన్ని కౌన్సెలింగ్ ద్వారా చెపుతారు. నవంబర్ 1వ తేదీ నుంచి హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు చలానా రాసి జరిమానా విధిస్తారు. మూడు నెలలపాటు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తర్వాత కొరడా ఝళిపించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

గత రెండ్రోజుల్నుంచి చేస్తున్న తనిఖీల్లో కేవలం పది శాతం మంది ద్విచక్ర వాహనదారులు మాత్రమే హెల్మెట్ వినియోగిస్తున్నారని తేలిందని రవాణా శాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. రోజుకు సగటున వెయ్యి మంది తనిఖీల్లో పట్టుబడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేనప్పుడు వర్తకులు హెల్మెట్ల రేట్లు పెంచో, నాసిరకానికి చెందినవో అమ్మే ఆస్కారాలు ఉంటాయి.  ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యల ప్రభావం ప్రజల నుంచి నేరుగా వీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ నిబంధనను అమలు చేస్తూనే నిర్ణీత కాలంపాటు వాహనచోదకులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ తర్వాత మాత్రమే జరిమానా విధింపు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement