CS orders
-
పక్షంలోగా సచివాలయం తరలింపు
-
పక్షంలోగా సచివాలయం తరలింపు
సిద్ధంగా ఉండాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: సచివాలయం తరలింపునకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోం ది. ‘కార్తీక మాసంలో కొత్త సచివాలయ నిర్మాణానికి పునాదిరాయి వేసే అవకాశాలున్నందున అందుకు సిద్ధంగా ఉండాలి. మరో 10-15 రోజుల్లో అన్ని శాఖలు సచి వాలయంలోని ఆఫీసులను తాత్కాలిక భవనాలకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సీఎస్ రాజీవ్‌శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులకు సూచనప్రాయంగా సంకేతాలిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమీక్షించేందుకు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సచివాలయం తరలింపు, కొత్త సచివాలయం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను సాఫీగా జరిగేలా చూసేందుకు, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తొమ్మిది మంది అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎస్ సారథ్యంలో ఉండే ఈ కమిటీలో స్పెషల్ సీఎస్‌లు ప్రదీప్‌చంద్ర, ఎంజీ గోపాల్, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్పీ సింగ్, ఎస్కే జోషీ, అజయ్ మిశ్రాలతోపాటు జీఏడీ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి. సచివాలయం తరలింపునకు తీసుకోవాల్సిన చర్యలపై వీరితో సీఎస్ ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుత సచివాలయంలోని 31 విభాగాలు, 270 సెక్షన్లలో దాదాపు 1,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ఇక్కడున్న ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలు, విభాగాలన్నీ తాత్కాలికంగా ఇతర భవనాలకు తరలించాల్సి ఉంది. సచివాలయ సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్లో వీలైనన్ని ఆఫీసులను సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించుకుంది. 31 విభాగాల్లో 22 విభాగాలను బీఆర్కే భవన్‌కు తరలించి మిగతా 9 విభాగాలను సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాలకు పంపించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు వీలుగా 4.98 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలని, అంత స్థలం బీఅర్కే భవన్లో అందుబాటులో ఉందని అంచనా వేశారు. వ్యవసాయ, అటవీ, గృహ నిర్మాణం, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, మహిళా శిశు సంక్షేమం, ప్రణాళిక విభాగాలను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సంబంధిత హెచ్‌వోడీ ఆఫీసులకు తరలించనున్నారు. వీటికి 88 వేల చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుందని, సంబంధిత హెచ్‌వోడీ ఆఫీసుల్లో తాత్కాలికంగా వాటిని ఉంచే వీలుందని అధికారులు అంచనా వేశారు. ఏపీ అంగీకారం తర్వాతే.. ఏపీకి కేటాయించిన భవనాలను తిరిగి తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు తీర్మానం పంపిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం పొందటమే తరువాయి సచివాలయం తరలింపునకు అధికారికంగా ఏర్పాట్లు మొదలవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భవనాలు అప్పగించే తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు పంపాకే గవర్నర్ నిర్ణయం వెలువడనుంది. ఏపీ మంత్రివర్గం సమావేశమై భవనాల అప్పగింత అంశంపై నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉం టుందని.. ఆ తర్వాతే గవర్నర్ ఆమోదముద్ర పడుతుందని అధికారులు చెబుతున్నారు. -
ద్విచక్ర వాహనంతోపాటే హెల్మెట్!
వాహనాలు డీలర్లకు సీఎస్ ఆదేశాలు * మూడు నెలలపాటు హెల్మెట్ ధరించాలని కౌన్సెలింగ్ * నవంబర్ 1 నుంచి హెల్మెట్ లేకపోతే జరిమానా తప్పదు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లతోపాటే హెల్మెట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధన విధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాహనాల విక్రయ డీలర్లందరికీ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా రవాణా శాఖను ఆదేశించారు. నాణ్యత లేని హెల్మెట్లు ధరిస్తే ఫలితం లేనందువల్ల ఎలాంటి హెల్మెట్లు ధరించాలి, ఎలాంటి హెల్మెట్లు ద్విచక్రవాహనదారుల కొనుగోలు చేయాలో నిబంధనలను నిర్ధారించాల్సిందిగా రవాణా శాఖకు సూచించారు. ప్రభుత్వ నిర్ధారించిన మేరకు ఉన్న హెల్మెట్లనే కొనుగోలు చేయడం, విక్రయాలు చేసేలాగ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం మూడు నెలల పాటు ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. వాస్తవంగా అయితే ఈ నెల 1వ తేదీ నుంచి హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తూ, ధరించనివారి నుంచి జరిమానా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విక్రయదారులు హెల్మెట్ ధరలను విపరీతంగా పెంచేశారు. వాహనదారులు తక్కువధరకు లభించే రక్షణ కవచం లేని హెల్మెట్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో హెల్మెట్ తప్పనిసరిని నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను ఆపి ఎటువంటి హెల్మెట్ ధరించాలనే విషయాన్ని కౌన్సెలింగ్ ద్వారా చెపుతారు. నవంబర్ 1వ తేదీ నుంచి హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు చలానా రాసి జరిమానా విధిస్తారు. మూడు నెలలపాటు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తర్వాత కొరడా ఝళిపించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గత రెండ్రోజుల్నుంచి చేస్తున్న తనిఖీల్లో కేవలం పది శాతం మంది ద్విచక్ర వాహనదారులు మాత్రమే హెల్మెట్ వినియోగిస్తున్నారని తేలిందని రవాణా శాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. రోజుకు సగటున వెయ్యి మంది తనిఖీల్లో పట్టుబడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేనప్పుడు వర్తకులు హెల్మెట్ల రేట్లు పెంచో, నాసిరకానికి చెందినవో అమ్మే ఆస్కారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యల ప్రభావం ప్రజల నుంచి నేరుగా వీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ నిబంధనను అమలు చేస్తూనే నిర్ణీత కాలంపాటు వాహనచోదకులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆ తర్వాత మాత్రమే జరిమానా విధింపు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు జిల్లాకో ఐఏఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అధికారులు చేయాల్సిన పనులను ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రతి నెల ఒకసారి వీరంతా ఆయా జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుంది. జిల్లా అధికారులతో సమావేశమై పథకాలు, కార్యక్రమాల అమలు తీరు ఎలా ఉందో మండల, గ్రామస్థాయివరకు సమీక్షించాలి. లక్ష్యంమేరకు పథకాలను, కార్యక్రమాలను జిల్లా అధికారులు అమలు చేస్తున్నారా లేదా అనే విషయంపై ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఆన్లైన్లో పంపించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి పథకాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాల అమలుతీరు ఏవిధంగా ఉందో పరిశీలించి ప్రతి నెలా సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులకు నివేదికలను పంపించాలి. ఆ నివేదికల ప్రతులను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును సమీక్షించడానికి ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రులున్నారు. పథకాల అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాకు రెండో జాయింట్ కలెక్టర్‌ను కూడా నియమించారు. తాజాగా ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.