పక్షంలోగా సచివాలయం తరలింపు | KCR wants Andhra to hand over its blocks in Secretariat | Sakshi
Sakshi News home page

పక్షంలోగా సచివాలయం తరలింపు

Published Tue, Oct 25 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

పక్షంలోగా సచివాలయం తరలింపు

పక్షంలోగా సచివాలయం తరలింపు

సిద్ధంగా ఉండాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సచివాలయం తరలింపునకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోం ది. ‘కార్తీక మాసంలో కొత్త సచివాలయ నిర్మాణానికి పునాదిరాయి వేసే అవకాశాలున్నందున అందుకు సిద్ధంగా ఉండాలి. మరో 10-15 రోజుల్లో అన్ని శాఖలు సచి వాలయంలోని ఆఫీసులను తాత్కాలిక భవనాలకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలి’ అని  సీఎస్ రాజీవ్‌శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులకు సూచనప్రాయంగా సంకేతాలిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సమీక్షించేందుకు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సచివాలయం తరలింపు, కొత్త సచివాలయం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఈ ప్రక్రియను సాఫీగా జరిగేలా చూసేందుకు, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తొమ్మిది మంది అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎస్ సారథ్యంలో ఉండే ఈ కమిటీలో స్పెషల్ సీఎస్‌లు ప్రదీప్‌చంద్ర, ఎంజీ గోపాల్, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్పీ సింగ్, ఎస్‌కే జోషీ, అజయ్ మిశ్రాలతోపాటు జీఏడీ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి. సచివాలయం తరలింపునకు తీసుకోవాల్సిన చర్యలపై వీరితో సీఎస్ ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుత సచివాలయంలోని 31 విభాగాలు, 270 సెక్షన్లలో దాదాపు 1,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ఇక్కడున్న ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలు, విభాగాలన్నీ తాత్కాలికంగా ఇతర భవనాలకు తరలించాల్సి ఉంది. సచివాలయ సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో వీలైనన్ని ఆఫీసులను సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించుకుంది. 31 విభాగాల్లో 22 విభాగాలను బీఆర్‌కే భవన్‌కు తరలించి మిగతా 9 విభాగాలను సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాలకు పంపించాలని అధికారులు నిర్ణయించారు.

అందుకు వీలుగా 4.98 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలని, అంత స్థలం బీఅర్‌కే భవన్‌లో అందుబాటులో ఉందని అంచనా వేశారు. వ్యవసాయ, అటవీ, గృహ నిర్మాణం, ఇరిగేషన్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, మహిళా శిశు సంక్షేమం, ప్రణాళిక విభాగాలను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సంబంధిత హెచ్‌వోడీ ఆఫీసులకు తరలించనున్నారు. వీటికి 88 వేల చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుందని, సంబంధిత హెచ్‌వోడీ ఆఫీసుల్లో తాత్కాలికంగా వాటిని ఉంచే వీలుందని అధికారులు అంచనా వేశారు.
 
ఏపీ అంగీకారం తర్వాతే..
ఏపీకి కేటాయించిన భవనాలను తిరిగి తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు తీర్మానం పంపిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం పొందటమే తరువాయి సచివాలయం తరలింపునకు అధికారికంగా ఏర్పాట్లు మొదలవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భవనాలు అప్పగించే తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు పంపాకే గవర్నర్ నిర్ణయం వెలువడనుంది. ఏపీ మంత్రివర్గం సమావేశమై భవనాల అప్పగింత అంశంపై నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉం టుందని.. ఆ తర్వాతే గవర్నర్ ఆమోదముద్ర పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement