మీ పుత్రరత్నమే! | special story to Crime Parenting | Sakshi
Sakshi News home page

మీ పుత్రరత్నమే!

Published Mon, Jun 19 2017 11:10 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

మీ పుత్రరత్నమే! - Sakshi

మీ పుత్రరత్నమే!

క్రైమ్‌ పేరెంటింగ్‌

పాలను ఫ్రిజ్‌ ఇస్తుంది. ఆవు కాదు! అనుబంధాలు సినిమాల్లో కనబడతాయి. ఇంట్లో కాదు! స్నేహితులు ఫేస్‌బుక్‌లో ఉంటారు. లైఫ్‌లో కాదు! డబ్బులు నాన్న పర్సులో ఉంటాయి. నాన్న చెమటలో కాదు! ఇదీ.. మన పుత్రరత్నాలకు తెలిసిన కొత్త ప్రపంచం!! దీంట్లో హీట్‌ ఉంటుంది.. కిక్కు ఉంటుంది. స్పీడు ఉంటుంది.. ‘యూజ్‌ అండ్‌ త్రో’ ఉంటుంది. ‘అలా కాదురా జీవితం’ అని అమ్మ చెబితే.. అన్నం ప్లేటు ఎత్తేస్తాడు. నాన్న కసురుకుంటే.. పిజ్జా తెప్పించుకుంటాడు. వీడిలో మార్పెలా రావాలి? వీడికి మంచి ఎలా తెలియాలి? ఇదిగో.. ఇలా రావాలి.

మీటింగ్‌లో ఉన్న మదన్‌ అసహనంగా కదులుతున్నాడు. కారణం... అతని సెల్‌ఫోన్‌. సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా దాని గుర్రుమనే శబ్దం చిరాకు పెడుతోంది. కాల్‌ అటెండ్‌ చేద్దామంటే సీరియస్‌గా ఉన్న బాస్‌ అంతకన్నా గుర్రుగా చూస్తాడేమో అని భయం! అందుకే ఆగాడు. కాని ఫోన్‌ ఆగలేదు. కంటిన్యుయస్‌గా వైబ్రేట్‌ అవుతూనే ఉంది. లిఫ్ట్‌ చేయక తప్పలేదు మదన్‌కి.

క్యాబిన్‌ బయటకు వచ్చి కాల్‌ సింబల్‌ టచ్‌ చేశాడు. వెంటనే ‘డాడీ.. పోలీసులు పట్టుకున్నారు. మీ వాళ్లతో చెప్పించండి.. ’ అవతల నుంచి కుమార రత్నం ధీరజ్‌. ‘ఏమైందిరా...?’ ఇవతల మదన్‌ ఆందోళన. ‘ఆ.. ఏం లేదు డాడీ.. స్పీడ్‌ లిమిట్‌ దాటిందని, లైసెన్స్‌ లేదని, హెల్మెట్‌ పెట్టుకోలేదని పట్టుకున్నారు. కేస్‌ రాస్తామంటున్నారు డాడీ...’ తాపీగా చెప్పాడు అబ్బాయి. ఇక్కడ అయ్యకు చెమటలు పట్టాయి. రెండు నెలల కిందటే ఒక యాక్సిడెంట్‌ చేశాడు పుత్రరత్నం. అవతలవాడికి కాలు విరిగింది. వాళ్లు లక్ష రూపాయలు డిమాండ్‌ చేస్తే బతిమాలి 60 వేలు చదివించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ పోలీసులు అంటున్నాడు. బీపీ పెరిగిపోయిందీ జర్నలిస్ట్‌ నాన్నకు. వెంటనే క్రైమ్‌ బీట్‌ రిపోర్టర్‌కి కాల్‌ చేసి సదరు పోలీస్‌తో మాట్లాడి.. బండిని, దాన్ని తోలడానికి అబ్బాయినీ విడిపించుకున్నాడు.

కాని రెండు నెలల కిందట జరిగిన ఆ సంఘటన మాత్రం ఆయన మరపుకి రావట్లేదు. కొడుకు యాక్సిడెంట్‌ చేసిన మనిషి రోజూ వారి కూలి. రెక్కాడితే కాని డొక్కాడని కష్టజీవి. కాలు విరిగి మంచాన పడ్డాడు. ఇప్పటికీ కోలుకోలేదు. ఇంటర్‌లో ఉన్న ఆయన కొడుకు చదువు మానేసి పనికి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే కొడుకు చేసిన యాక్సిడెంట్‌తో ఆ కుటుంబం రోడ్డున పడింది. వాళ్లకు ఇంకేదైనా సహాయం చేద్దామని ఉన్నా తన ఆర్థికస్థితి అందుకు ఒప్పుకోవడంలేదు. అందుకే ఏమీ చేయలేక వారానికి ఒకసారి అతని ఇంటికి వెళ్లి పరామర్శించి వస్తున్నాడు. ఆ సంఘటన తాలూకు చేదుజ్ఞాపకం, పొద్దున కొడుకు చేసిన నిర్వాకం.. వాడి భవిష్యత్‌ పట్ల ఆందోళన కలిగించిన సంఘర్షణతోనే ఆ రాత్రి ఇంటికి చేరాడు మదన్‌.

ఫస్ట్‌ ఇయర్‌ నుంచే పోరు
భోజనాల దగ్గర.. కొడుకు మీద కోపం పీకలదాకా ఉండి అన్నాన్ని లోపలకు వెళ్లనివ్వడం లేదు. అయినా తమాయించుకుని మింగుతున్నాడు ముద్దలను. వాడు మాత్రం టీవీలో సినిమాను ఎంజాయ్‌ చేస్తూ.. అందులో కామెడీ సీన్లకు పడీ పడీ నవ్వుతూ భోజనాన్ని ఆస్వాదిస్తున్నాడు. భర్త అవస్థ ఆ ఇంటి ఇల్లాలిని బాధపెడుతోంది.. కొడుకు తీరు ఆమె సహనాన్ని పరీక్షిస్తోంది. అయినా మౌనం వీడట్లేదు. తప్పు తమదే అని అర్థమైంది కాబట్టి. ఇంతలోకే టీవీలో ఏదో కారు యాడ్‌ వస్తోంది. కెవ్వుమన్నాడు అబ్బాయి.ఉలిక్కిపడ్డారు అమ్మానాన్న. ‘డాడీ... ఈ కారే నేను కొనమని చెప్పింది’ కళ్లు ఇంతింత చేసుకొని టీవీలో వస్తున్న యాడ్‌ను చూపిస్తున్నాడు కొడుకు. భార్యాభర్తలు నివ్వెరపోయారు మొహమొహాలు చూసుకొని. ధీరజ్‌కు నిండా పద్దెనిమిదేళ్లు లేవు. ఇంటర్‌ సెకండియర్‌లో ఉన్నాడు. టెన్త్‌ అయిపోయినప్పటినుంచే బైక్‌ బైక్‌ అని కలవరించడం మొదలుపెట్టాడు. ఆ మాట ఈ మాట చెప్పి ఇంటర్‌ ఫస్టియర్‌ అయిపోయే వరకు బైక్‌ ఇప్పించడం వాయిదా వేశాడు తండ్రి. ఆయన వాయిదావేసేలా చేసింది ఆ ఇల్లాలు. కాని సెకండియర్‌లో తల్లిదండ్రుల పప్పులు ఉడకనివ్వలేదు ఈ యంగ్‌చాప్‌.

కొడుక్కి బైకు.. తండ్రికి బీపీ
మంచి చదువు చెప్పించాలని ఖరీదైన కాలేజ్‌లో చేర్పించాడు. కాలేజ్‌ ఖరీదైంది కాబట్టి కాస్ట్‌లీ కుటుంబాల పిల్లలే ఎక్కువగా చేరారు అందులో. జూనియర్‌ ఇంటర్‌లో స్పోర్ట్స్‌ బైక్‌లు.. సీనియర్‌ ఇంటర్‌కి స్పోర్ట్స్‌ కార్లేసుకు రావడం మొదలుపెట్టారు. వాళ్లను చూసి ధీరజ్‌లో బైక్‌ ఆశ మరింత పెరిగింది. వాళ్లతో పిలియన్‌ రైడ్‌కు వెళ్తున్నప్పుడు వాళ్ల స్పీడ్‌ చూసి వీడికి మతి పోయేది. రాత్రి తనూ అంత స్పీడ్‌లో బైక్‌ నడుపుతున్నట్టు కలగంటూ నిద్రలోనే గాల్లో చేతులు, కాళ్లు ఆడించేవాడు. వాడి బైక్‌ కోరిక తీవ్రత చూసి చలించిపోయాడు తండ్రి. ‘మన కాలానికి, ఈ కాలానికి చాలా తేడా. నేను బస్‌లో ఆఫీస్‌కి వెళ్లినా చెల్లుతుంది. కాని వీడి తరానికి అది నామోషి. మనకు అందని సౌకర్యాలను వాళ్లకందించాలి. ఆ  ముచ్చట తీర్చాలి. లేకపోతే చదువు మీద మనసు పెట్టరు’ అని భార్యకు సర్దిచెప్పి ఆఫీస్‌లో లోన్‌ తీసుకొని మరీ బండి కొనిపెట్టాడు.

కొన్న వారానికే కొడుకు యాక్సిడెంట్‌ చేశాడు. పోలీసులతో తిట్లూ తినిపించాడు.  అంతేనా.. చీటికిమాటికీ బైక్‌ వేసుకొని బయటకు వెళ్లడం.. సెలవుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి అవుట్‌ స్కర్ట్స్‌లో బైక్‌ రేసెస్‌ పెట్టుకోవడం.. వాడు ఇంట్లోంచి బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి వచ్చేదాకా ఇంట్లో వాళ్లు గుండెను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమనడం .. ఇవన్నీ దెబ్బకే బీపీ తెప్పించాయి మదన్‌కి. పిల్లాడికి మాత్రం బైక్‌ వచ్చిన నెలకే అది అంటే మొహం మెత్తింది. కాలేజ్‌లో తన తోటి వాళ్ల కార్లు చూసి. ప్రస్తుతం కారు కొనాలంటున్నాడు. అందుకే యాడ్‌ చూసి ఎక్సైట్‌ అయిపోయాడు.  

తెచ్చివ్వడం కాదు.. తెలియజెప్పాలి
చెబితే వినే వయసు, అర్థం చేసుకునే నిదానం లేని కొడుకుకి...  వాడు యాక్సిండెట్‌ చేయడం వల్ల నష్టపోయిన కుటుంబాన్ని చూపిస్తే అయినా మార్పు వస్తుందేమో అనుకొని అతని ఇంటికి తీసుకెళ్లాడు మదన్‌. ఇంచుమించు తన వయసే ఉన్న ఆ వ్యక్తి కొడుకు చదువు మానేసి కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడో చూసి అయినా అబ్బాయి చలిస్తాడని ఆశపడ్డాడు. కాని వాడి ప్రవర్తనలో ఆవగింజంతైనా మార్పు రాలేదని అర్థమైంది మదన్‌కి కొడుకు కారు కోరిక చూసి. బైక్‌ను బేరం పెట్టి వచ్చిన డబ్బును ఆ కుటుంబానికి ఇచ్చేయమనే భార్య సలహాను పాటించాలనుకున్నాడు. తెల్లవారే బైక్‌ను అమ్మేసి, అబ్బాయిని కాలేజ్‌కి బస్‌లో పంపించాలనే నిర్ణయానికి వచ్చేశాడు. కొడుకుకు అడిగింది తెచ్చివ్వడం కాదు.. బాధ్యత నేర్పాలి అనుకున్నాక ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు మదన్‌.

 కోరికల వేగానికి బ్రేక్‌ వేయాలి
కోరికలు అనంతం! పిల్లల ఆశలకూ అంతుండదు. ఎవరి దగ్గర ఏది చూస్తే అది కావాలని మారాం చేసే వయసు దగ్గరే.. కోరిన ప్రతిదాన్ని అందుకోవాలనే వేగానికి బ్రేక్‌ వేయాలి. కనిపించే వస్తువులన్నీ మనవి కావు అని చెప్పాలి. అలాగే స్టీరింగ్, లేదా యాక్సిలేటర్‌ అందుకునే ఈడురాగానే బాధ్యతా నేర్పాలి. పదహారేళ్లకు టూవీలర్, పద్దెనిమిదేళ్లకు ఫోర్‌ వీలర్‌ కావాలని అడిగే స్పీడ్‌ ఈ తరానిది. వెహికిల్స్‌ కొనడం సరే.. లీటర్‌ పెట్రోల్‌ ఉత్పత్తికి ఎంత శ్రమ, అది కొనడానికి మీకెంత ఖర్చు అవుతుందో విడమర్చాలి. సరదా కోసం బండిని నడపడం, థ్రిల్స్‌ కోసం స్పీడ్‌ పెంచడం వల్ల ప్రకృతికి, మనుషులకు ఎలాంటి నష్టం కలుగుతుందో ఆర్‌టీఏ వాళ్ల వీడియో క్లిప్పింగ్స్‌ చూపించాలి. ఈ కొంచెం జాగ్రత్త మన పిల్లల భవిష్యత్తునే కాదు... సమాజాన్నీ ప్రమాదం నుంచి కాపాడుతుంది.
–శరాది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement