సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భారీ, చిన్నతరహా వాహనాలకు వచ్చే జనవరి 1నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 డిసెంబర్ నుంచి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించినా సాధ్యపడలేదు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా ఈ విధానం అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జనవరి 1నుంచి వాహనానికి ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్ర మోటారు వాహన చట్టం–1989ను సవరించడం ద్వారా ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 డిసెంబర్‌కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 2021 ఏప్రిల్ 1 నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చెల్లుబాటయ్యే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది.
డిసెంబర్ నెలాఖరు నాటికి ఫాస్టాగ్ స్టిక్కర్లు
డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్ లేకపోతే వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయవద్దని రవాణా శాఖకు ఆదేశాలు అందాయి. ఏపీ పరిధిలోని జాతీయ రహదారులపై 42 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 75 శాతం ఫాస్టాగ్ లైన్లు, 25 శాతం డబ్బు చెల్లించేందుకు లైన్లు ఏర్పాటు చేశారు. ఇకపై మొత్తం ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర రహదారులపైనా 16 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలోనూ ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ఖర్చును కేంద్రం 70 శాతం భరిస్తుందని గతంలోనే కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర రహదారులపై ఈటీసీ మార్గాలను ఏర్పాటు చేయనుంది.
ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్
Published Mon, Nov 16 2020 4:13 AM | Last Updated on Mon, Nov 16 2020 4:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment