ఏసీ బస్సు టికెట్ ధర భగ్గు
గుట్టుచప్పుడు కాకుండా అమల్లోకి తెచ్చిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఏసీ బస్సు చార్జీలను గుట్టుచప్పుడు కాకుండా పెంచేసింది. ఆరు శాతం మేర పెంచిన కొత్త ధరలు ఇటీవలే అమలులోకి వచ్చాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీని గట్టుకు చేర్చే క్రమంలో టికెట్ చార్జీలను సవరించాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించటంతో ఆ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ.. ముందస్తు ప్రకటనేదీ లేకుండానే ఏసీ బస్సుల చార్జీలను సవరించేసింది. ఫలితంగా వెన్నెల, గరుడ ప్లస్, గరుడ, రాజధాని (ఇంద్ర), సిటీ మెట్రో లగ్జరీ బస్సుల్లో కొత్త చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులపై వార్షికంగా రూ.15 కోట్ల వరకు భారం పడనుంది. సీఎం ఆదేశం మేరకు మొత్తంగా ఆర్టీసీ బస్సులన్నింటి చార్జీలను సవరించే సమయంలో వీటి ధరలను మళ్లీ పెంచనున్నట్లు తెలిసింది.
ఆ మొత్తం కేంద్రం ఖాతాలోకి...
గత సాధారణ బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం స్టేజీ క్యారియర్ సర్వీసులపై సేవా పన్ను విధించింది. 6 శాతం మేర పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది. ఇది ఏసీ బస్సులకే పరిమితం కావటంతో ఆర్టీసీ అధీనంలోని అన్ని ఏసీ బస్సుల ఆదాయంపై 6 శాతాన్ని కేంద్రానికి చెల్లించాల్సి వచ్చింది. దీని నుంచి ఆర్టీసీని మినహాయించాలని రవాణా సంస్థ కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఏసీ బస్సుల ఆదాయంపై అంతమేర పన్ను చెల్లించక తప్పని పరిస్థితి ఎదురైంది. అసలే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, సిబ్బంది జీతాలకే దిక్కులు చూస్తున్న తరుణంలో ఇది ఆర్టీసీపై పెద్ద భారాన్నే మోపింది. దాన్ని మోయటం సాధ్యం కాదని తేల్చిన రవాణా శాఖ ఆ బరువును ప్రయాణికుల జేబుపైనే మోపింది. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో 310 ఏసీ బస్సులున్నాయి.
వీటిలో దూరప్రాంతాల మధ్య తిరిగే 160 బస్సులకు మంచి ఆదాయం లభిస్తోంది. ఒక్కో బస్సు సగటున రూ.25 వేల వరకు ఆదాయం పొందుతోంది. మిగతా బస్సులు రూ.8 వేల మేరకే పరిమితమవుతున్నాయి. అన్నీ కలిపితే సాలీనా రూ.230 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇది స్థిరంగా లేకపోవటంతో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లెక్క ఒక్కోరకంగా ఉంటోంది. వెరసి కేంద్రానికి దాదాపు రూ.15 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండనున్నందున తాజాగా ఏసీ బస్సుల టికెట్ ధరలను 6 శాతం మేర పెంచి.. ఆ రూపంలో అదనంగా వచ్చే రూ.15 కోట్ల మొత్తాన్ని కేంద్రానికి జమ కట్టాలని నిర్ణయించారు.
పెరిగిన ధరల వివరాలివీ...
తాజా పెంపుతో హైదరాబాద్ నగరంలో తిరిగే ఏసీ మెట్రో లగ్జరీ (వోల్వో) బస్సుల్లో గరిష్టంగా టికెట్ ధర రూ.6కు పెరిగింది. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే గరుడ, గరుడ ప్లస్ బస్సుల టికెట్ ధర రూ.65 నుంచి రూ.70 వరకు పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సుల టికెట్ ధర రూ.29 నుంచి రూ.33 వరకు పెరిగింది.