ట్రెజరీ..ఉక్కిరిబిక్కిరి!
► నేటితో ఆర్థిక సంవత్సరం ముగింపు
► ఖజానాకు ఒక్కసారిగా బిల్లులు రాక
► పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో కమీషన్ల దందా..
► ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, రవాణా శాఖల్లో లక్ష్యాలపై సమీక్షలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గురువారంతో ముగియనున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో హడావుడి నెలకొంది. ముఖ్యంగా పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ కార్యాలయాల్లో కమీషన్ల దందా కొనసాగుతుంటే, మరికొన్ని కార్యాలయాల్లో ఇచ్చిన లక్ష్యాలు ఎంత మేరకు చేరుకున్నామనే దానిపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ శాఖలు తమకు కేటాయించిన నిధులు ఈ నెలాఖరులోపు ఖర్చుచేయకపోతే అవి మురిగిపోయే అవకాశం ఉండడంతో ఇంజినీర్లు పూర్తయిన పనులకు బిల్లులు చేస్తున్నారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమకు రావాల్సిన బకాయిల వసూలుకు ట్రెజరీ వద్దనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అన్ని శాఖల బిల్లులు ఒకేసారి ట్రెజరీకి చేరడంతో అక్కడి సిబ్బంది పనితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖ, రవాణాశాఖ తమకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యంలో ఏ మేరకు చేరుకున్నామనే దానిపై సమీక్ష జరిపి, మిగిలిన రోజులో పన్నుల వసూలుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ప్రజల నుంచి రావాల్సిన పన్నుల వసూలుకు సిబ్బందిపై ఒత్తిడి పెంచడంతోపాటు పన్నుల చెల్లింపులపై విసృ్తతంగా ప్రచారం చేస్తున్నాయి.
ట్రెజరీలో ఆమోదించిన బిల్లులు 4 వేలకుపైనే ...
వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన 4 వేల బిల్లులను గుంటూరు ట్రెజరీ కార్యాలయం ఆమోదించింది. వీటికి దాదాపు రూ.40 కోట్లకుపైగానే నగదు చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులకు ప్రభుత్వం ఇంకా ఆమోదముద్ర వేయకపోవడంతో వాటి కోసం వివిధ ప్రభుత్వశాఖల సిబ్బంది, అధికారులు నిరీక్షిస్తున్నారు.
కమీషన్ల దందా ...
వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగిన అభివృద్ధి పనులకుగాను ఇంజినీర్లు చేసిన బిల్లులకు సంబంధించిన (ఎంబీ)ఎం.బుక్‌లను పే అండ్ అకౌంట్స్ కార్యాలయం పరిశీలించి చెక్కులను పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో బిల్లుల నమోదు సక్రమంగా జరగకపోతే వాటిపై అభ్యంతరం వ్యక్తం చేయడం, లేదంటే పూర్తిగా బిల్లులు నిలిపివేసే అధికారం ఈ కార్యాలయానికి ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉంటే నగదు చెల్లింపులకు సిఫారసు చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతీ బిల్లుపై ఈ కార్యాలయ సిబ్బంది నిర్ణీత పర్సంటేజిని నిర్మాణసంస్థల నుంచి వసూలు చేయడం బహిరంగ రహస్యమే.
మార్చి 31లోపు చెల్లింపులు జరగకపోతే కొత్త బడ్జెట్ అమల్లోకి రావడానికి నెల రోజుల జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్మాణసంస్థల ప్రతినిధులు ఆ కార్యాలయం డిమాండ్ చేసిన పర్సంటేజిలను చెల్లిస్తున్నాయి. ట్రెజరీ కార్యాలయంలో ఇప్పటివరకు వివిధ శాఖల నుంచి వచ్చిన బిల్లులకు రూ.50 కోట్లకుపైగా చెల్లింపులు జరిగితే మరో రూ.25 కోట్లకుపైగానే బిల్లులను పరిశీలించాల్సి ఉందని ఆశాఖ ఉద్యోగులు చెబుతున్నారు.
సందట్లో సడేమియాగా అడ్వాన్సు బిల్లులు
ప్రభుత్వం విడుదల చేసిన నిధులను మార్చి 31లోపు ఖర్చు చేయకపోతే ఆ శాఖ అధికారి అసమర్థతగా ఉన్నతాధికారులు భావించే అవకాశం ఉండడంతో కొందరు ఇంజినీర్లు అడ్వాన్సు బిల్లులు కూడా చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. 90 శాతం పూర్తయిన పనులకు మొత్తం చెల్లింపులకు సిఫారసు చేస్తూ నగదు చెల్లించి, ఆ తరువాత మిగిలిన 10 శాతం పనులు చేయించుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధానంలో అడ్వాన్సు బిల్లులు చెల్లించినందుకు కమీషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు.