త్వరలో క్యాష్‌లెస్ కార్యాలయంగా ‘రవాణా’
ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్: రాష్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. లెసైన్స్ రెన్యూవల్ చేయించుకోవడంతోపాటు కొత్తగా ‘ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లెసైన్స్’ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా శాఖ 15 రకాల ఆన్‌లైన్ సేవలు అందిస్తోందని, త్వరలో అన్ని సేవలను ఆన్‌లైన్‌లో చేర్చి ‘క్యాష్‌లెస్ కార్యాలయం’గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ శాఖలను ఆన్‌లైన్ పరిధిలోకి తెచ్చి పారదర్శకంగా సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
దళారుల ఆగడాలపై విలేకరులు ప్రశ్నించగా ఈ విషయమై సంబంధిత శాఖ మంత్రి మాట్లాడతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒకేవిధమైన రవాణా చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ర్ట రవాణ శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, కమీషనర్ సందీప్ సుల్తానియా, జేటీసీలు రఘునాథ్, వెంకటేశ్వర్లు, రాష్ట మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు పాపారావు తదితరులు పాల్గొన్నారు.