లెసైన్సులు మొదలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల మంజూరు వరకు
సొమ్ముల కోసం సరిహద్దులూ దాటేస్తున్నారు
ఇక్కడి బ్రేక్ ఇన్‌స్పెక్టర్ నెల్లూరులో చిక్కడమే ఇందుకు నిదర్శనం
ఎంతమంది పట్టుబడ్డా లెక్కచేయని తీరు
విజయవాడ సిటీ : రవాణా శాఖలో అవినీతి ‘హద్దు’లు దాటుతోంది. లెసైన్స్‌లు మొదలు ఫిట్‌నెస్ లేని వాహనాలకు పర్మిట్ల మంజూరు వరకు డబ్బులు గుంజేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ రవాణా శాఖ అధికారులు వదులు కోవడం లేదు. డబ్బులు వస్తాయంటే సరిహద్దులను సైతం దాటతారనడానికి నెల్లూరు జిల్లాలో ఇక్కడి అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణవేణి పోలీసులకు చిక్కడమే నిదర్శనం.
కలకలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణవేణి పట్టుబడటం ఇక్కడ కలకలం రేపింది. గన్నవరం సమీపంలోని అంపాపురం డ్రైవింగ్ సెంటర్‌లో అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ హోదాలో లెసైన్స్‌ల మంజూరును ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఆమె తనిఖీలు చేయాల్సి వస్తే విజయవాడ, ఉయ్యూరు, నూజివీడు రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. గుడివాడ ఆర్టీవో కార్యాలయం పరిధిలో కూడా తనిఖీ చేయరా దు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆదేశానుసారం, అది కూడా ఉప రవాణా కమిషనర్ పరిధిలో మాత్రమే చేసే అవకాశం ఉంది. అందుకు విరుద్ధంగా ఆమె నెల్లూరు జిల్లాలో తనిఖీల పేరిట హడావుడి చేయడం ఇక్కడి సిబ్బందిని ఆశ్చర్యానికి లోనుచేస్తోంది. పైగా సెలవులో ఉండి తనిఖీలేంటంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. తనతో నిమిత్తం లేకుండా డ్రైవర్ కక్కుర్తిపడి మామూళ్లు వసూలు చేశాడని చెప్పడాన్ని తప్పుబడుతున్నారు.
బేఖాతరు
గత ఫిబ్రవరిలో రవాణా శాఖ కార్యాలయంలో ఎల్.ఎల్.ఆర్ లెసైన్స్‌ల విభాగాన్ని ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ చర్యలను తప్పుబట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని ఏజెంట్ల కార్యాలయంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1.62 లక్షల నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిఘా కొనసాగుతోంది. అయితే నిఘాను బేఖాతరు చేస్తూ వేర్వేరు మార్గాల్లో అక్రమార్జనకు దిగుతున్నట్టు కార్యాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది.