ఫిట్‌నెస్.. కేర్‌లెస్ | Fitness... careless | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్.. కేర్‌లెస్

Published Wed, May 28 2014 2:11 AM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

Fitness... careless

తిమ్మాపూర్/గోదావరిఖనిటౌన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. విద్యాసంస్థలకు చెందిన వాహనాలను ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగానే ఫిట్‌నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. రవాణా శాఖ అధికారులు వాహనాలను పూర్తిగా పరిశీలించి కండీషన్ సరిగా ఉన్నట్టు నిర్ధారణకు వస్తేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలి. వాహనాల ఉండాల్సిన తీరు, డ్రైవర్లు, సిబ్బంది నియామకం విషయంలోనూ చాలా నిబంధనలున్నాయి. వాటిని తు.చ.తప్పకుండా పాటిస్తే ప్రమాదాలను కొంతవరకైనా నివారించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. కానీ.. జిల్లాలో స్కూళ్లు, విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్ విషయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు సైతం వాహనాల ఫిట్‌నెస్ కోసం పెద్దగా పట్టించుకోవడం లేదన్నది జగమెరిగిన సత్యం. ప్రతి సంవత్సరం విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఫిట్‌నెస్ చేయాల్సి ఉండగా, కేవలం విద్యా సంస్థలకు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
 
 ఈ సంవత్సరం మే 15 నుంచి ఫిట్‌నెస్ పరీక్షలు ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క వాహనాన్ని సైతం పరిశీలించలేదంటే అధికారులు తీరును అర్థం చేసుకోవచ్చు. మొన్నటిదాకా ఎన్నికల బిజీ అంటూ జాప్యం చేసిన అధికారులు.. జూన్ 10 వరకు టైముందంటున్నారు. ఇప్పటికే యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామని, ఈ నెల 27 నుంచి ఫిట్‌నెస్ టెస్ట్ చేస్తున్నామని కరీంనగర్ ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రామగుండం మండలంలో గతంలో ప్రమాదాలు జరిగిన దృష్ట్యా.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అక్కడి ఎంవీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు.
 
 జిల్లాలో వివిధ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, బీఈడీ, ఫార్మసీ.. ఇలా అన్ని విద్యాసంస్థల్లో కలిసి వేయికిపైగా బస్సులున్నాయి. జిల్లాలోని అన్ని ఎంవీఐ కార్యాలయాల్లో ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకునే అవకాశం ఉంది. కానీ జూన్ ఒకటి నుంచే కొన్ని విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి. మిగిలినవి ఐదారు రోజుల్లో తెరుచుకోనున్నాయి. ఇంత తక్కువ సమయంలో వేయికి పైగా వాహనాలకు ఫిట్‌నెస్ చేస్తారా అన్నది అనుమానమే. పైగా స్కూళ్లు తెరుచుకొనే సమయానికి హడావుడిగా పరీక్షలు చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం ఒక ప్రహసనంగా మారుతోంది. భవిష్యత్తులో విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరో ఆర్టీఏ అధికారులకు తెలియాలి.
 
 దర్జాగా ఉల్లంఘన
 రవాణా అధికారుల నిర్లక్ష్యం ఇలాఉంటే స్కూళ్లు,కళాశాలలు తదితర విద్యాసంస్థల యాజమాన్యాలు మరో అడుగు ముందుకేసి దర్జాగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. కేవలం పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేం దుకు మాత్రమే వినియోగించాల్సిన బస్సులను ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు.పెళ్లిళ్లు, తీర్ధయాత్ర, పార్టీ కార్యక్రమాల కోసం తిప్పుతున్నారు.
 
  పిల్లల భద్రత ఎలా..?
 ప్రతియేటా ఎక్కడోచోట స్కూల్ బస్సులు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. అభంశుభం ఎరుగని చిన్నారులు బలవుతూనే ఉన్నారు. ఇటు ఆర్టీఏ, అటు స్కూల్ యాజమాన్యాలు,మరోవైపు డ్రైవర్ల అజాగ్రత్త వంటి అంశాలే ప్రధానకారణం. కొన్నిసార్లు అటెండర్లు లేకపోవడం వల్ల  కూడా చిన్నారులు ప్రమాదాలబారిన పడుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement