- రవాణా శాఖ సంసిద్ధం
- ముగిసిన ఫిట్ నెస్ గడువు
- విస్తృత తనిఖీలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ పరీక్ష కోసం రవాణా శాఖ సిద్ధపడింది. ఈ ఏడాది విద్యా సంవత్సరాంతం మే 15తో ఫిట్‌నెస్‌ల గడువు వాహనాలకు ముగిసింది. మరో ఏడాది ఫిట్‌నెస్ పొందడానికి వాహనాలు ముస్తాబవుతున్నాయి. వాహన సామర్థ్య పని తీరు బట్టి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. వాహనాల కండిషన్ మెరుగ్గా ఉండాలని రవాణా శాఖ ఉప కమిషనర్ ఎం.ప్రభురాజ్‌కుమార్ ఆదేశించారు. మోటార్ వాహనాల చట్టం జీవో 35 ప్రకారంనియమ నిబంధనలు తప్పక పాటించాలన్నారు.
ప్రతి స్కూల్, కళాశాల వాహనం ఫిట్‌నెస్ పొందాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కూల్ వాహనాలను ఉపేక్షించబోమని డీటీసీ హెచ్చరించారు. చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయన్నారు. విస్తృత తనిఖీలతో డ్రైవర్ లెసైన్స్, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. స్కూల్ యాజమాన్యాలు ఫిట్‌నెస్‌కు సహకరించాలని కోరారు. విద్యార్థుల భద్రతకు సహకరించాలన్నారు.
విశాఖ జిల్లాలో దాదాపు 1,700 వాహనాలు ఉన్నట్టు అంచనా. వీటిలో రాకపోకలు చేస్తున్నవి 1,500 ఉండవచ్చు. విశాఖ నగర పరిధిలో 1,250 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది నుంచి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 15 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వాహనాలకు ఫిట్‌నెస్ నిరాకరిస్తున్నారు.
నిబంధనలు ఇలా..
బస్సు ఎడమ వైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలను పొందుపర్చాలి.
బస్సు బయల్దేరే సమయం, ఆగు స్థలాలు, రూట్ ప్లాన్ బస్సులో ఉంచాలి.
విద్యార్థుల సంఖ్య వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి. పరిమిత సంఖ్య విద్యార్థులతో ప్రయాణించాలి.
డ్రైవర్ వయస్సు 50 ఏళ్లకు మించరాదు. ఐదేళ్ల అనుభవం, డ్రైవర్ ఆరోగ్యంతో ఉన్నట్టు ధ్రువీకరించే హెల్త్ కార్డు ఉండాలి.
ప్రతి నెల బస్సు కండిషన్‌ను యాజమాన్యం, పేరెంట్స్ కమిటీ తనిఖీ చేయాలి.
ప్రతి బస్సుకు అటెండర్ ఉండాలి. డ్రైవర్, అటెండర్ యూనిఫాం ధరించాలి.
బస్సు తలుపులు సురక్షిత లాకింగ్ సిస్టమ్‌తో ఉండాలి. స్కూల్ బస్సు అద్దాలకు గ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలి.