సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రయివేట్ పాఠశాలలంటే రవాణా శాఖకు ఎనలేని ప్రేమ. విద్యా సంవత్సరం ప్రారంభమయిందంటే బస్సుల విషయంలో ఎక్కడలేని హడావుడి చేసే ఈ శాఖ అధికారులు.. అసలు విషయం గాలికొదిలేస్తున్నారు. చేయి తడిపితే చాలు.. బస్సును చూడకుండానే ఫిట్‌నెస్ ముద్ర పడిపోతోంది. గతంలో చోటు చేసుకున్న స్కూల్ బస్సుల ప్రమాదాల దృష్ట్యా కూడా అధికారుల వైఖరిలో మార్పు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా కార్పొరేట్ పాఠశాలల బస్సులను చూసీచూడనట్లుగా వదిలేస్తున్న అధికారులు..
చిన్న పాఠశాలల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిట్‌నెస్ లేదని.. కొన్ని మరమ్మతులు చేయించుకు రావాలని అధికారులు చెప్పినప్పటికీ చాలా వరకు యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయి. ఇలాంటి బస్సుల్లో విద్యార్థులను ఎక్కించుకుని తిప్పుతున్నా రవాణా శాఖ మొద్దునిద్ర పోతోంది. జిల్లాలో ఇప్పటికీ 313 బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను పొందలేదంటే పరిస్థితి అర్థమవుతోంది.
కనిపించని దాడులు
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి మొత్తం 1,092 బస్సులు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 779 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాయి. ఇందులో సగం బస్సుల్లో కూడా నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు సక్రమంగా లేని పరిస్థితి నెలకొంది. ఇక మిగిలిన 313లోనూ చాలా వరకు 15 సంవత్సరాలు దాటినవి.. కాలం చెల్లినవిగా గుర్తించారు. అయినప్పటికీ ఈ బస్సులు కూడా రోడ్లపై విద్యార్థులను ఎక్కించుకుని చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ బస్సులు పాఠశాలలకు విద్యార్థులకు తరలిస్తున్నాయా? లేదా అనే విషయంపై అధికారులు ఆరా తీయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫిట్‌నెస్ లేని బస్సులపై దాడుల విషయంలోనూ కొద్ది మంది అధికారులు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదంటే.. సదరు అధికారులకు ప్రైవేటు బస్సులపై మోజుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
సహాయకుడు ఏడీ?
రవాణా శాఖ నిబంధనల మేరకు ప్రతి పాఠశాలకు చెందిన బస్సులో ఒక సహాయకుడు ఉండాలి. అయితే, ఏ స్కూల్ బస్సులో చూసినా డ్రైవర్ మాత్రమే ఉంటున్నారు. సహాయకుడు లేకపోవడంతో బస్సు స్టేజీ వద్దకు వచ్చినప్పుడు భారీగా బరువున్న స్కూలు బ్యాగులతో చిన్న చిన్న తరగతులకు చెందిన పిల్లలు దిగలేకపోతున్నారు.
ఒక్కోసారి బస్సులో నుంచి కిందపడిన సందర్భాలూ ఉంటున్నాయి. అదేవిధంగా పాఠశాల బస్సుతో పాటు ప్రతి రోజూ ఒక టీచర్ తోడుగా ఉండాలి. ఈ నిబంధన కూడా ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి. అయినప్పటికీ రవాణా శాఖ అధికారులు నోరుమెదపకపోవడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో కొద్ది మంది అధికారులకు మామూళ్లు ముడుతుండటమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడి బస్సుల విషయంలో ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
బడి బస్సు.. తుస్సు!
Published Wed, Jun 22 2016 3:37 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement
Advertisement