రోడ్డుపైకి ఫిట్‘లెస్’బస్సులు..రైట్రైట్
♦ బడి పిల్లలూ జరభద్రం
♦ జిల్లాలో ఫిట్‌లెస్ బస్సులు 800
♦ తీరుమారని యాజమాన్యాలు
♦ పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం
♦ చోద్యం చూస్తున్న అధికారులు
♦ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఆర్టీఓ
సంగారెడ్డి టౌన్: ఫిట్‌నెస్ లేకుండానే బడి బస్సులు రోడ్డెక్కనున్నాయి. జిల్లాలో సుమారు 800 బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందలేదంటే పిల్లల భద్రతపై పాఠశాలల యాజమాన్యాలు ఏ మాత్రం శ్రద్ధ తీసుకుంటున్నాయో అర్థమవుతోంది. వేసవి సెలవులు ముగించుకొని పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పిల్లలు బడిబాట పట్టనున్నారు. బడి బస్సులో పాఠశాలలకు వెళ్లే పిల్లల ప్రాణాలకు భద్రత కనిపించడంలేదు. జిల్లాలోని వందలాది బడి బస్సులు ఫిట్‌నెస్ లేకుండా నడవబోతుండటమే ఇందుకు కారణం.
ఇవన్నీ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడనున్నాయి. ప్రైవేటు పాఠశాలల బస్సులు జిల్లాలో మొత్తం 1,372 ఉండగా ఈ నెల 7 నాటికి 572 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొం దాయి. మిగతా 800 బస్సులు ఫిట్ సర్టిఫికెట్ ఇంకా పొందలేవు. గత సంవత్సరం బడులు ప్రారంభయ్యే నాటికి జిల్లాలో 1,050 ప్రైవేటు స్కూలు బస్సులు ఉండగా 760 మాత్రమే ఫిట్‌నెస్ పొందాయి. ఫిట్‌నెస్ లేకుండానే 380 బస్సులు నడిచాయి. ఈసారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.
గత అనుభవాల మాటేమిటీ?
♦ ప్రైవేటు పాఠశాల యాజమామాన్యం, డ్రైవరు నిర్లక్ష్యంతో 2014 జూలై 24న వెల్దుర్తి మండలం, మాసాయిపేట వద్ద స్కూలు బస్సును ఢీకొన్న రైలు దుర్ఘటనలో 16 మంది చిన్నారులు బలయ్యారు. అక్కడి తల్లిదండ్రుల్లో ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా వీడడంలేదు. ఇంతటి ఘోరం జరిగినా స్కూల్ యాజమాన్యాలు పిల్లల భద్రతపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
గతేడాది ‘మచ్చ’తునకలివీ..
♦ రేగోడ్ మండలం మెడికుంద గ్రామ శివారులో 2015 జూన్ 13న సెయింట్ డాన్ బాస్కో ప్రైవేట్ పాఠశాలకు చెందిన రెండు బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. బడి ప్రారంభం రోజునే ఈ ఘటన చోటుచేసుకుంది.
♦ రవాణా శాఖ అధికారులు బస్సుకు ఫిట్‌నెస్ సిర్టిఫికెట్ జూన్ 13న ఇచ్చారు. మర్నాడు 14న గజ్వేల్ పరిధి సంగాపూర్ వద్ద బడి బస్సు చక్రం ఊడిపడింది. 75 మంది విద్యార్థులు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. బస్సులో 37 మందిని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉండగా 75 మందిని తీసుకెళ్లారు.
తల్లిదంద్రుల బాధ్యత ముఖ్యమే..
బడి బస్సు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది పరిస్థితి. తల్లిద్రండులు కూడా పాఠశాలల బస్సుల భద్రతపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. బస్సుల ఫిట్‌నెస్ సిర్టిఫికెట్, డ్రైవర్‌కు అనుభవం ఉందా? డ్రైవింగ్ లెసైన్స్ ఉందా? బస్సులో అటెండెంట్ గురించి విచారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.
యాజమాన్యంపై క్రిమినల్ కేసులు
ఫిట్‌నెస్‌లేని స్కూల్ బస్సులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. ఫిట్‌నెస్‌లేని వాహనాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించొద్దని రవాణా అధికారులకు ఆదేశాలు జారి చేసింది.
ఫిట్‌నెస్ లేని బస్సులు, ఇతర వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని, పర్మిట్ రద్దు చేయాలని, సదరు విద్యా సంస్థ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ మంత్రి ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా డ్రైవర్ లెసైన్సును ప్రాథమికంగా మూడు నెలలపాటు రద్దుచేయాలని సూచించారు. ఈ నిబంధనలు ఈ నెల 9 నుంచి అమల్లోకి వచ్చాయి.
వేళ్లూనుకున్న దళారి వ్యవస్థ
దళారులకు మాకు సంబంధం లేదు. వారిని కార్యాలయంలోకి అనుమతివ్వడం లేదని అధికారులు ఢంకా బజాయించి చెబుతున్నారు. కాని కార్యాలయం ఎదుట ఉన్న దాదాపు 35 దళారుల దుకాణాలు జనాలతో కిక్కిరిసి ఉంటున్నాయి. మరి వారు చేసే పనేంటని అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు. దళారుల దగ్గరకు వెళ్లందే పని కావడం లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడిపితే కఠిన చర్యలు తప్పవు. అలా చేసిన వారికి మొదట శాఖాపరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇప్పటి వరకు 60 శాతం స్కూలు బస్సులు ఫిట్‌నెస్ పొందాయి. 20 శాతం బస్సుల కండిషన్ బాగాలేనందున ఫిట్‌నెస్ ఇవ్వలేదు. మిగతా వారు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ విధిగా పొందాలి. - వెంకటరమణ, ఆర్‌టిఓ, సంగారెడ్డి
దళారి వ్యవస్థను తొలగిస్తేనే మార్పు
అధికారులు చెప్పేవన్నీ ఉట్టిమాటలు. దళారులకు, అధికారులకు సంబంధం లేదంటే కార్యాలయం ఎదుట ఉన్న దళారుల దుకాణాలు ఎందుకు ఉన్నాయి. అవి జనాలతో ఎందుకు నిండి ఉంటున్నాయి. దళారుల దగ్గరకు వెళ్లందే పనులు కావడం లేదు. దళారి వ్యవస్థను తొలగిస్తేనే మార్పు వస్తుంది. - వినోద్ కుమార్, సంగారెడ్డి