మిగిలింది ఆరు రోజులే.. | RTA Special Drive on School Bus Fitnees | Sakshi
Sakshi News home page

మిగిలింది ఆరు రోజులే..

Published Thu, Jun 6 2019 8:42 AM | Last Updated on Sat, Jun 8 2019 8:23 AM

RTA Special Drive on School Bus Fitnees - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: బడి బస్సుల భద్రతపై  ఆర్టీఏ దృష్టి సారించింది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా రోడ్డెక్కే బస్సులను సీజ్‌ చేసేందుకు సన్నాహాలు  చేపట్టింది.  జూన్‌ 1 నుంచి  స్కూళ్లు  ప్రారంభమవుతాయనే  ఉద్దేశంతో తొలుత హడావిడి చేసినా 12వ తేదీకి  వాయిదా పడడంతో  పాఠశాల యాజమాన్యాలు  నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వాస్తవంగా  మే 15 నాటికి అన్ని స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ గడువు ముగుస్తుంది. ఆ రోజు  నుంచి   పాఠశాలలు  తిరిగి  ప్రారంభమయ్యేలోగా బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేయించాలి. అయితే గ్రేటర్‌  హైదరాబాద్‌లోని  మూడు జిల్లాల పరిధిలోని 12 వేలకు పైగా  స్కూల్‌ బస్సుల్లో  ఇప్పటి వరకు సుమారు 3700 బస్సులకు మాత్రమే  ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించారు. 

మరో  8 వేలకు పైగా బస్సులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా  ఇందుకు ఆరు రోజులు మాత్రమే గడువు మిగిలింది ఉంది. ఈ  కొద్దిపాటి వ్యవధిలోనే   గ్రేటర్‌ పరిధిలోని అన్ని  ఆర్టీఏ కార్యాలయాల్లో పరీక్షలు నిర్వహించి  బడి బస్సుల  భద్రతా ప్రమాణాలను నిర్ధారించాల్సి ఉంది. ఆ దిశగా తాము  ఇప్పటికే  కార్యాచరణ చేపట్టినట్లు  రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్‌ ప్రవీణ్‌రావు ‘సాక్షి’తో  పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు లేఖలు రాయడంతో  పాటు స్కూల్‌ బస్సు డ్రైవర్లు, అటెండర్లకు  రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి స్కూల్‌ యాజమాన్యం బస్సుల ఫిట్‌నెస్‌పై అప్రమత్తంగా ఉండాలని, డ్రైవర్లు, అటెండర్లకు  అవగాహన కల్పించాలని  సూచించారు.  12న  స్కూళ్లు  తిరిగి ప్రారంభం కానున్నందున ఆ లోగా  ఫిట్‌నెస్‌ ధృవీకరణ పొందాల్సి ఉంటుందన్నారు.  ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు రోడ్డెక్కితే వాటిని సీజ్‌ చేసి  చట్టపరమైన చర్యలు  తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు  ఈ సారి  ఆర్టీఏ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు.  

బస్సులు..భద్రతా ప్రమాణాలు..
బస్సు పసుపు  రంగులో  ఉండాలి. రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు  స్పష్టంగా కనిపించే విధంగా కన్వెక్స్‌ క్రాస్‌ వ్యూ అద్దాలు అమర్చాలి. బస్సులోపలి భాగంలో ఒక పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి.దీనివల్ల లోపల ఉన్న పిల్లలు కూడా డ్రైవర్‌కు  కనిపిస్తారు.
బస్సు ఇంజన్‌ కంపార్ట్‌మెంట్‌లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌), పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఏర్పాటు చేయాలి.
సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్‌ నంబర్, మొబైల్‌ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి.
సీట్ల కిందిభాగంలో బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకొనేందుకు వీలుగా అక్కడక్కడా లోహపు స్తంభాలను అమర్చాలి.
వాహనానికి నాలుగువైపులా పై భాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబ ర్‌ (గాఢ పసుపు పచ్చని) రంగుగల  ఫ్లాపింగ్‌ లైట్లను ఏర్పాటు చేయాలి.పిల్లలు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి.
సదరు వాహనం స్కూల్‌ బస్సు అని తెలిసేలా ముందు భాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్ధులు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) నల్లరంగులో  చిత్రించాలి. ఆ చిత్రం కింద ‘‘స్కూల్‌ బస్సు’’ లేదా ‘‘ కళాశాల బస్సు’’ అని నల్ల రంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి.
బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్‌ సిస్టమ్‌ తో ఉండాలి. సైడ్‌ విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి. సీటింగ్‌సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు.
ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి.
లోపలికి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకొనేందుకు వీలుగా ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్‌ ఉండాలి.
బస్సులో ప్రయాణించే విద్యార్థుల పేర్లు, తరగతులు,ఇళ్ల చిరునామాలు, ఎక్కవలసిన, దిగవలసిన వివరాలు బస్సులో ఉండాలి.

డ్రైవర్ల అర్హతలు ...
డ్రైవర్‌ వయస్సు 60ఏళ్లకు మించకుండా ఉండాలి. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్‌ ఆరోగ్యపట్టికను విధిగా నిర్వహించాలి.  
యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకుప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలి.
డ్రైవర్‌ను నియమించేందుకు ముందు అతని అర్హతలు, డ్రైవింగ్‌ లైసెన్స్, తదితర అంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి.
డ్రైవర్‌కు  బస్సు డ్రైవింగ్‌లో  కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
డ్రైవర్, అటెండర్‌ తప్పనిసరిగా యూనిఫామ్‌ ధరించాలి.

పేరెంట్స్‌ కమిటీ పనితీరు...
బస్సుకు సంబంధించిన బాహ్య పరికరాలు విండ్‌స్క్రీన్, వైపర్స్, లైటింగ్స్‌ వంటి వాటి మెకానికల్‌ కండీషన్స్, పనితీరు తెలుసుకొనేందుకు ప్రిన్సిపాల్‌తో కలిసి పేరెంట్స్‌ కమిటీ ప్రతి నెలా తనిఖీలు చేయాలి.
ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సులో మందులు, ఇతరపరికరాలు కూడా తనిఖీ చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement