మేము సైతం రహదారి భద్రత ఉద్యమంలో..
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏకు విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్, అఖిల్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం రవాణా శాఖ చేపట్టే రహదారి భద్రతా ఉద్యమంలో తాము కూడా పాల్గొని, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్ వెల్లడించారు. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వారు విడివిడిగా శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. మొదట అక్కినేని అఖిల్ తన నూతన కారు మెర్సిడెస్ బెంజ్ (రూ. 1.94 కోట్లు) రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. తనకు నచ్చిన నంబర్ ‘టీఎస్ 09 ఈఎల్ 9669’ కోసం ఇటీవల వేలంలో రూ. 46,500 చెల్లించి సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆర్టీఏ అధికారులతో మాట్లాడుతూ.. తాను ఇప్పటికే ‘డ్రంకన్‌డ్రైవ్’పై వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వివరించారు. రోడ్డు భద్రతా కార్యక్రమాల్లోనూ తన వంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం తన కొత్త వాహనం బీఎండబ్ల్యూ (రూ. 1.21 కోట్లు) రిజిస్ట్రేషన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఈ కారు కోసం ఆయన ఇటీవలే ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ నంబర్ కోసం వేలంలో రూ. 10.5 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఆల్‌నైన్ నంబర్ కోసం ఇంతపెద్ద మొత్తం చెల్లించడం ఇదే మొదటిసారి. వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ నిబంధనల ప్రకారం ఫొటో దిగి, డిజిటల్ ప్యాడ్‌పైన సంతకం చేశారు. ఈ సందర్భంగా ‘ఆర్టీఏ చేపట్టే రోడ్డు భద్రతా ఉద్యమంలో పాల్గొనాలని’ జేటీసీ రఘునాథ్ ఆహ్వానించగా, తప్పకుండా హాజరవుతానని చెప్పారు. ఆర్టీవో జీపీఎన్ ప్రసాద్, ఇతర అధికారులు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.